logo

తల్లిని కాపాడే యత్నంలో తండ్రిపై దాడి

ఎప్పటిలాగే తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని అనుకున్నాడా అబ్బాయి. తల్లిపైకి కత్తితో వస్తున్న తండ్రిని చూసి ఆందోళనకు గురయ్యాడు. పెనుగులాటలో  కింద పడిన కత్తిని తీసుకుని తండ్రిని పొడవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందిన

Published : 25 Jun 2022 06:27 IST

తీవ్రంగా గాయపడి మృతి

మృతి చెందిన రవి

అంతర్గాం, న్యూస్‌టుడే: ఎప్పటిలాగే తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని అనుకున్నాడా అబ్బాయి. తల్లిపైకి కత్తితో వస్తున్న తండ్రిని చూసి ఆందోళనకు గురయ్యాడు. పెనుగులాటలో  కింద పడిన కత్తిని తీసుకుని తండ్రిని పొడవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అంతర్గాం మండలం లింగాపూర్‌లో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అంతర్గాం ఎస్‌.ఐ. సంతోష్‌కుమార్‌, గ్రామస్థుల కథనం ప్రకారం మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన శనిగరపు రవి(40)కి అంతర్గాం మండలం లింగాపూర్‌కు చెందిన రమతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంచిర్యాల జిల్లా భీమారం వద్ద రవి తండ్రి బాపునకు రెండెకరాల పొలం ఉంది. రవి మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో రమ పిల్లలతో కలిసి పుట్టింటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో బాపు తన పేరిట ఉన్న రెండెకరాల భూమిని మనవడు, మనవరాలు పేరిట పట్టా చేశాడు. అనంతరం భూమి కాగితాలు ఇవ్వాలంటూ రవి తరచూ భార్య, పిల్లలను ఇబ్బందులకు గురిచేసేవాడు. కాగితాలు ఇచ్చేంతవరకు తాను చెన్నూరుకు వెళ్లనని ఐదేళ్లుగా లింగాపూర్‌లోనే ఉంటూ ట్రాక్టరు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నిత్యం మద్యం మత్తులో భార్యా పిల్లలను వేధిస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి రవి భార్యతో గొడవపడ్డాడు. ఇరువురు తీవ్రంగా ఘర్షణ పడగా కత్తితో భార్యను చంపేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న కుమారుడు(14) అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ముగ్గురి పెనుగులాటలో కింద పడిన కత్తిని బాలుడు తీసుకొని తండ్రిని పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌, రామగుండం సీఐ లక్ష్మీనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌.ఐ. సంతోష్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని