logo

సుందరీకరణ స్వప్నం తీరేదెన్నడు?

పట్టణవాసులకు ఆహ్లాదం, మానసిక ప్రశాంతతను కల్పించేందుకు ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక ప్రధాన చెరువును మినీ ట్యాంకుబండ్‌గా మార్చాలని నిర్ణయించింది. చెరువు కట్టను వినోద, విజ్ఞాన కూడలిగా ఆధునికీకరించాలని సంకల్పించింది. ఇందుకోసం

Published : 13 Aug 2022 04:07 IST

మినీ ట్యాంకుబండ్‌ పనుల్లో ఎడతెగని జాప్యం

నిర్మాణ దశలోనే వెలుగు చూస్తున్న నాణ్యత లోపం

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

పెద్దపల్లిలోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువు సుందరీకరణ పనులను 2016లో ప్రారంభించారు. రూ.4.5 కోట్లతో మత్తడి, తూము, కట్ట, రివిట్‌మెంట్‌ వాల్‌, రిటైనింగ్‌ వాల్‌ పనులు చేశారు. మున్సిపల్‌ గ్రాంట్‌ కింద రూ.3.5 కోట్లతో 2 కి.మీ.ల మేర ఎల్లమ్మ చెరువు నుంచి చందపల్లి వరకు బీటీ రోడ్డు, రెయిలింగ్‌, సిమెంట్‌ గోడలు, వాకింగ్‌ ట్రాక్‌ ఫుట్‌పాత్‌లు, మార్బుల్స్‌ పనులు తుది దశకు చేరాయి. ఓపెన్‌జిమ్‌ ఏర్పాటు చేశారు. బిల్లుల మంజూరులో జాప్యంతో పనులు నిలిచిపోయాయి.

పట్టణవాసులకు ఆహ్లాదం, మానసిక ప్రశాంతతను కల్పించేందుకు ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక ప్రధాన చెరువును మినీ ట్యాంకుబండ్‌గా మార్చాలని నిర్ణయించింది. చెరువు కట్టను వినోద, విజ్ఞాన కూడలిగా ఆధునికీకరించాలని సంకల్పించింది. ఇందుకోసం మిషన్‌ కాకతీయ పథకంలో నిధులు కేటాయించింది. ఆరేళ్ల కిందట పనులు ప్రారంభం కాగా.. జిల్లాలో ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి.. అన్న చందాన పరిస్థితి మారింది. అధికారుల నిర్లక్ష్యానికి ఈ పనులు అద్దం పడుతున్నాయి. అదనపు అంచనా వ్యయాన్ని విడుదల చేయడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో మినీ ట్యాంక్‌బండ్‌ల ఏర్పాటు కల నెరవేరడం లేదు.

ఇదీ ప్రణాళిక..

మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా పెద్ద చెరువు వద్ద సుందరీకరణ పనులు చేసి, ఆధునిక వసతులతో మినీ ట్యాంకుబండ్‌గా మార్చాలన్నదే ఉద్దేశం. చెరువు కట్టలను పటిష్ఠం చేయడం, పూడిక మట్టి తొలగించడంతో పాటు రివిట్‌మెంటు పనులు చేస్తున్నారు. నడక దారులు విస్తరిస్తున్నారు. బతుకమ్మ, వినాయక నిమజ్జనోత్సవాల కోసం వేదికలు ఏర్పాటు చేయడంతో పాటు నీటి నిల్వలను పెంచి పర్యాటకులకు బోటింగ్‌ వసతి సమకూర్చాల్సి ఉంది. పిల్లల కోసం ఉద్యానవనాలు నిర్మించడం, అరుదైన పక్షులు, చేప పిల్లలను, ప్రత్యేకమైన మొక్కలను పెంచడం, ఓపెన్‌ జిమ్‌, వాకింగ్‌ట్రాక్‌, ఉద్యానవనాల కోసం ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి.

వర్షాలతోనే పనులు ఆలస్యం - సత్యరాజ్‌చంద్ర, జలవనరుల శాఖ ఎస్‌ఈ

వర్షాల కారణంగానే మినీ ట్యాంకుబండ్‌ల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. పెద్దపల్లిలోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువు పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పనులు చేయాల్సి ఉంది. మంథనిలో పనులను వేగవంతం చేస్తాం. వానలు తగ్గుముఖం పడిన వెంటనే తిరిగి ప్రారంభిస్తాం.

ప్రగతికి నిధుల అడ్డంకి

జిల్లాలోని మూడు మినీట్యాంకుబండ్‌ల నిర్మాణానికి నిధుల మంజూరు అడ్డంకిగా మారింది. అదనపు నిధుల కోసం ప్రతిపాదించినప్పటికీ మోక్షం లభించడం లేదు. దీంతో పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. చేసిన పనుల్లో నాణ్యత కొరవడింది. ఏళ్ల తరబడి పనులు కొనసా..గుతూనే ఉండటంతో కట్ట దెబ్బతిని కుంగిపోతోంది. పిచ్చిమొక్కలు పెరగడంతో పాత కథే పునరావృతమవుతోంది.

మంథని పట్టణంలోని తమ్మిచెరువు వద్ద రూ.3.15 కోట్లతో ప్రతిపాదించగా రూ.2.15 కోట్లతో 2016లో పనులు ప్రారంభమయ్యాయి. కట్ట వెడల్పుతో పాటు ఎత్తు, లైనింగ్‌ పనులు పూర్తయ్యాయి. 2017లో అదనపు వ్యయం కింద రూ.3.99 కోట్ల మంజూరుకు ప్రతిపాదించారు. కట్టపై వీధి దీపాలు, రహదారి నిర్మాణం, ఉద్యాన పనులు చేపట్టాల్సి ఉంది. ట్రీగార్డులు నేలవాలడం, మొక్కలు ఎండిపోవడం, మార్బుల్స్‌ శిథిలం కావడంతో పాటు చెరువుల్లో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.

రామగుండం నియోజకవర్గంలోని మల్కాపూర్‌ చెరువు సుందరీకరణ పనులను 2017లో రూ.1.01 కోట్లతో ప్రారంభించారు. కంకర, మట్టి, తారు రహదారుల పనులు కొనసాగుతున్నాయి. చెరువు మత్తడి, కట్టపై నుంచి శిఖం పక్క వరకు తిరిగి మత్తడికి మరోవైపు ఉన్న కట్టకు చేరుకునేలా చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, రెయిలింగ్‌ గ్రిల్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. విద్యుద్దీకరణ, జిమ్‌, ఆటవస్తువులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అదనంగా రూ.2 కోట్ల నిధులకు ప్రతిపాదించారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని