logo

డ్రైవింగ్‌ శిక్షణ.. దక్కని ఆదరణ

టీఎస్‌ ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు పలు రంగాల వైపు అడుగులు వేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థను కొనసాగిస్తూనే మరోవైపు డ్రైవింగ్‌ స్కూళ్లను ఏర్పాటు చేసింది. హెవీ మోటారు వాహనాల చోదక శిక్షణ ఇచ్చి ఆదాయం పొందాలనుకున్నా యువత నుంచి ఆదరణ కరవైంది.

Published : 05 Oct 2022 05:16 IST
డ్రైవింగ్‌ శిక్షణకు ఉపయోగించే బస్సు
ఆర్టీసీ కేంద్రాల్లో చేరేందుకు ముందుకు రాని యువత
న్యూస్‌టుడే, కరీంనగర్‌ రవాణా విభాగం

టీఎస్‌ ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు పలు రంగాల వైపు అడుగులు వేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థను కొనసాగిస్తూనే మరోవైపు డ్రైవింగ్‌ స్కూళ్లను ఏర్పాటు చేసింది. హెవీ మోటారు వాహనాల చోదక శిక్షణ ఇచ్చి ఆదాయం పొందాలనుకున్నా యువత నుంచి ఆదరణ కరవైంది. ఫలితంగా శిక్షణ కేంద్రాలు వెలవెలబోతున్నాయి.

టీఎస్‌ ఆర్టీసీ తెలంగాణ వ్యాప్తంగా జిల్లాకు ఒకటి చొప్పున డ్రైవింగ్‌ స్కూళ్లను ఏర్పాటు చేయగా కరీంనగర్‌ రీజియన్‌లో కరీంనగర్‌తో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో 2021లో వీటిని అందుబాటులోకి తెచ్చింది. డ్రైవింగ్‌ స్కూళ్లల్లో చేరిన వారికి 30 రోజులు శిక్షణ ఇస్తారు. ఐదు రోజులు థియరీ, 25 రోజులు ప్రాక్టికల్‌ ఉంటుంది. ఇందులో 16 గంటలకు తగ్గకుండా స్టీరింగ్‌పై తర్ఫీదు ఇస్తారు. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా స్థానిక రహదారిని ఎంచుకొని బస్సును నడపడం, నియంత్రించడం, బ్రేక్‌, క్లచ్‌ ఎలా ఉపయోగించాలి, వాహనం ఎలా రిపేరు చేయాలి, రోడ్డు నిబంధనలు, సిగ్నల్స్‌, యూటర్న్‌, పార్కింగ్‌, ఓవర్‌టేక్‌ ఎలా చేయాలి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. సాధారణ అభ్యర్థులకు రూ.15,600, ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఫీజు రూపేణా చెల్లించాల్సి ఉంటుంది.

104 మందికి...

కరీంనగర్‌ రెండో డిపో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రైవింగ్‌ స్కూల్‌లో జనవరి 2021 నుంచి ఇప్పటి వరకు నాలుగు బ్యాచ్‌ల్లో 104 మంది మాత్రమే శిక్షణ పొందారు. జగిత్యాల జిల్లాలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా కాలం డ్రైవింగ్‌ స్కూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. రీజియన్‌ మొత్తంలో అభ్యర్థులు లేక డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలు వెలవెల బోతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం అంతర్జాతీయ డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రం ఉండటంతో యువత అందులోనే చేరుతున్నారు.ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రైవింగ్‌ స్కూల్‌కు అంతగా ఆదరణ లేదని అంటున్నారు.

సంక్షేమ శాఖలపైనే...

డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలను విజయవంతంగా కొనసాగించేందుకు ఆర్టీసీ ప్రభుత్వ సంస్థల చేయూత కోసం ఎదురుచూస్తోంది. బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ శాఖలపై భారీగా ఆశలు పెట్టుకుంది. పలు జిల్లాల్లో ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ఆయా శాఖల అధికారులను కలిసి విన్నవించారు. ఆయా సంక్షేమ శాఖల నుంచి శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులను ఎంపిక చేసి పంపిస్తే శిక్షణ ఇవ్వడానికి ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీకి అన్ని విధాలా శిక్షణకు సంబంధించిన వనరులు అందుబాటులో ఉంటాయి. అనుభవజ్ఞులైన డ్రైవర్లు, వాహనం రిపేరు, ఇలా ప్రతి అంశానికి సంబంధించిన వారు ఉంటారు. హెవీ మోటారు డ్రైవింగ్‌ శిక్షణ కాకుండా కారు డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే వందలాది మంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.

కారణాలు ఇలా..

ఫీజు అధికంగా ఉండటం (రూ.15,600). ఇది పేద, మధ్యతరగతి యువతకు ఆర్థిక భారంగా మారింది.

ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం.

ఎక్కువ మంది కారు డ్రైవింగ్‌ శిక్షణ వైపు మొగ్గు చూపుతున్నారు.

శిక్షణపై ప్రచారం లేక పోవడం, ప్రైవేట్‌ కేంద్రాల్లో ఫీజు తక్కువగా ఉండటం.

సిద్ధంగా ఉన్నాం -వి.మల్లయ్య, డీఎం, కరీంనగర్‌-2 డిపో

అభ్యర్థులు వస్తే శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే సంక్షేమ శాఖల అధికారులను కలిశాం. వారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. శిక్షణ తీసుకునే వారిని ఎంపిక చేసి అందుకు సంబంధించిన రుసుం చెల్లిస్తే సంస్థ పరంగా శిక్షణ ఇస్తాం.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని