logo

ఆకుట్టుకుంటున్న స్వయం ఉపాధి

పొద్దున్నే పిల్లలను బడికి పంపించాక తిరిగి సాయంత్రం వరకు ఇంటిపట్టున ఖాళీగా ఉండే గృహిణులకు.. కొత్తగా పెళ్లయిన యువతులకూ ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో అందిస్తున్న శిక్షణ కొండంత భరోసానిస్తోంది.

Published : 28 Nov 2022 03:40 IST

ఉచిత శిక్షణ శిబిరాలతో అతివలకు భరోసా
పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని 2 వేల మందికి నైపుణ్యం

మల్లాపూర్‌లో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఈశ్వర్‌(పాతచిత్రం)

న్యూస్‌టుడే, ధర్మారం: పొద్దున్నే పిల్లలను బడికి పంపించాక తిరిగి సాయంత్రం వరకు ఇంటిపట్టున ఖాళీగా ఉండే గృహిణులకు.. కొత్తగా పెళ్లయిన యువతులకూ ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో అందిస్తున్న శిక్షణ కొండంత భరోసానిస్తోంది. కుట్టు పనితో ఇంటి ఖర్చులకు సరిపడా ఆదాయం సంపాదించవచ్చనే నమ్మకాన్ని పెంచుతోంది. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చొరవతో పెద్దపల్లితో పాటు జగిత్యాల జిల్లాల్లోని పలు మండలాల్లో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శిక్షణ పొందిన వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటాన్ని గమనిస్తున్న ఇరుగుపొరుగు గ్రామాల మహిళలు తమ ఊరిలోనూ శిబిరాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఏదైనా గ్రామంలో కనీసం 40 మంది శిక్షణ పొందేందుకు ముందుకొస్తే శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

కంపెనీల నుంచి ఆర్డర్లు

రెండేళ్లుగా ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు జూలపల్లి మండలం కుమ్మరికుంటలోనూ కుట్టు శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఇప్పటివరకు దాదాపు 2 వేల మంది నేర్చుకున్నారు. తీరిక వేళల్లో పని చేసే వీలుండటంతో మహిళలు ఆసక్తి చూపుతుండటంతో శిక్షణకు ఆదరణ పెరుగుతోంది. నైపుణ్యం పొందిన వారికి ఆర్డర్లు ఇప్పించడంపైనా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చొరవ చూపుతున్నారు. ఇదివరకే ధర్మారంతో పాటు పాలకుర్తి, అంతర్గాం మండలాల్లోని వివిధ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టే ఆర్డర్లు ఇప్పించగా విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా గుడ్డ సంచులు కుట్టే ఆర్డర్ల కోసం మంతనాలు సాగిస్తున్నారు. వివిధ కంపెనీల నుంచి ఆర్డర్లు ఇప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఉచితంగా యంత్రం

మూడు నెలల వ్యవధితో నేర్పిస్తున్న కుట్టు శిక్షణలో చిన్నారుల దుస్తుల నుంచి ఆధునిక వనితల అభిరుచులకు అనుగుణంగా వివిధ ఆకృతుల్లో జాకెట్లు కుట్టడం వరకు నేర్పించారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి యోగ్యతా పత్రంతో పాటు ఉచితంగా కుట్టు మిషను అందిస్తుండటం వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. నయా పైసా ఖర్చు లేకుండా శిక్షణతో పాటు పరికరం అందిస్తుండటంతో జీవనోపాధికి భరోసా కలుగుతోందని మహిళలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సంఘాల ఏర్పాటుకు ప్రోత్సాహం

వివిధ సొసైటీలకు చెందిన ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలల ఏకరూప దుస్తులు కుట్టే పనులకు మహిళలు టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. తక్కువ ధరకు కుట్టే వారికే పనులు అప్పగిస్తారు. ఈ నేపథ్యంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలు సంఘాలుగా ఏర్పడి రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా మంత్రి కొప్పుల ప్రోత్సహిస్తున్నారు. సంఘం ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. దీంతో పలు గ్రామాల్లో కొత్తగా సొసైటీలు ఏర్పాటయ్యాయి. సంఘాలు ఏర్పాటు చేసుకోని గ్రామాల్లో ఇతరుల వద్ద డ్రెస్‌ల లెక్కన తీసుకొని కుట్టి అప్పగిస్తున్నారు. కుట్టు నేర్చుకున్న వారు వేలాది మంది ఉండటంతో పరిసర జిల్లాల్లో గుత్తాగా పొందినవారు ఏకరూప దుస్తులు, ఇతరత్రా కుట్టు పనులు వీరికి అప్పగించి ఛార్జీలు చెల్లిస్తున్నారు.


అన్ని అంశాలూ నేర్పించారు

-అసోద శైలజ, మల్లాపూర్‌

నేను డిగ్రీ వరకు చదివి, ఖాళీగా ఉండేదాన్ని. ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు శిక్షణ పొందాను. పంపకాల దగ్గరి నుంచి వివిధ రకాల డిజైన్లతో జాకెట్లు కుట్టడం వరకు అన్నీ నేర్పించారు. పిల్లల దుస్తులు కుట్టడం వచ్చింది. విద్యార్థుల ఏకరూప దుస్తులను సొంతంగా కుడుతున్నాం. ఇంటి పట్టున ఉంటూ ఆదాయం పొందవచ్చునన్న నమ్మకం కలిగింది.


పేదల జీవనోపాధికి భరోసా

-దీకొండ పద్మావతి

మూడు నెలల కుట్టు శిక్షణలో చాలా విషయాలు నేర్చుకున్నాను. పెటికోట్‌, వివిధ డిజైన్లలో జాకెట్లు, పంజాబీ డ్రెస్‌లు కుట్టడం నేర్చుకున్నా. దీంతో పాటు మగ్గం వర్క్‌ నేర్పించారు. కూలీ పనులపై ఆధారపడే వారికి ఈ శిక్షణ బాగా మేలు చేసింది. ఏ పనీ లేకున్నా బట్టలు కుట్టుకుని అయినా జీవనోపాధి పొందవచ్చుననే భరోసా వచ్చింది. నా కాళ్లపై నేను నిలబడగలనన్న దైర్యం వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని