logo

గతమెంతో ఘనం.. ఉన్నతీకరణ గగనం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్న తరుణంలో కాల్వశ్రీరాంపూర్‌ మండలాన్ని విస్మరించారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Published : 01 Feb 2023 04:53 IST

శ్రీరాంపూర్‌ ఆరోగ్య కేంద్రంలో అంతంతమాత్రంగానే సేవలు

కాల్వశ్రీరాంపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి

న్యూస్‌టుడే, కాల్వశ్రీరాంపూర్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్న తరుణంలో కాల్వశ్రీరాంపూర్‌ మండలాన్ని విస్మరించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్‌ వైద్యం అందించాల్సింది పోయి 30 పడకలుగా ఉన్న ఆసుపత్రిని ఆరు పడకల ఆసుపత్రిగా కుదింపు చేయడంతో మండల ప్రజలకు నిరాశే మిగిలింది. అప్పటి ప్రభుత్వం కాల్వశ్రీరాంపూర్‌ మండల గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని 5గురు వైద్యులు, ముగ్గురు హెడ్‌నర్సులు, 7గురు స్టాఫ్‌ నర్సులు, 12 మంది సిబ్బందితో వైద్య సేవలు అందిస్తున్నారు.

ఇదీ పరిస్థితి

కాల్వశ్రీరాంపూర్‌ మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మారుతుందనుకుంటే ప్రభుత్వం ఆరు పడకలకే కుదించడంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అరవై ఏళ్ల క్రితం మారుమూల గ్రామమైన కాల్వశ్రీరాంపూర్‌లో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిగా ఉండేది. 1970లో కాల్వశ్రీరాంపూర్‌ సర్పంచి కాల్వ రామచంద్రరెడ్డి సహకారంతో అప్పటి ఎమ్మెల్యే జిన్న మల్లారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయించారు. సర్పంచి రాంచంద్రారెడ్డి సొంత వ్యవసాయ భూమి విరాళంగా ఇవ్వడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించి ప్రజలకు వైద్య సేవలు అందించారు.

* ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు 1979లో 30 పడకల ఆసుపత్రిని అప్పటి ఎమ్మెల్యే జిన్న మల్లారెడ్డి మంజూరు చేయించారు. 1980లో ఆసుపత్రి నిర్మాణం, పోస్టుమార్టం గదితో పాటు, వైద్యులు, సిబ్బంది ఉండడానికి వసతి గృహాలు నిర్మించారు. వైద్యులు, సిబ్బంది తమకు కేటాయించిన గృహాలలో ఉంటూ ప్రజలకు 24 గంటల వైద్యం అందించారు. ఈ ఆసుపత్రిని కాల్వశ్రీరాంపూర్‌ మండలంతో పాటు ఓదెల, ముత్తారం, జమ్మికుంట, మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. 1985లో కాల్వ రాంచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆసుపత్రిని మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రిలో వైద్యులతో పాటు సిబ్బందిని పెంచారు.

* 2009లో ఈ ఆసుపత్రి 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ అయ్యింది. దీంతో అప్పటి ఉన్నతాధికారులు ఈ ఆసుపత్రిని సందర్శించి 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ అయ్యిందని మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. అనంతరం ఆ విషయాన్ని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడంతో మరుగునపడిపోయింది. ఈ క్రమంలో పాత భవనం తొలగించి కొత్త భవనం నిర్మించేందుకు ఆరు పడకల ఆసుపత్రిగా మార్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని