logo

ప్రైవేటులో అమ్మకు కడుపు కోతలు

ఓ వైపు గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేసి తల్లి, బిడ్డ క్షేమంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు ఆ ఆదేశాలు బేఖాతర్‌ చేస్తూ.. పలు ప్రైవేటు ఆసుపత్రులు శస్త్రచికిత్సలు (కడుపు కోతలు) అధికంగా చేస్తున్నాయి.

Updated : 02 Mar 2024 06:39 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం: ఓ వైపు గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేసి తల్లి, బిడ్డ క్షేమంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు ఆ ఆదేశాలు బేఖాతర్‌ చేస్తూ.. పలు ప్రైవేటు ఆసుపత్రులు శస్త్రచికిత్సలు (కడుపు కోతలు) అధికంగా చేస్తున్నాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న జిల్లా అధికారులు ఇటీవల ఏడు ఆసుపత్రులకు తాఖీదులు జారీ చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరిగినా ప్రైవేటులో ఆ పరిస్థితి లేదు. కోతల ద్వారా ప్రసవాలు చేసి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 86 శాతం సిజేరియన్లు చేసినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గతంలో మాదిరిగా కనీసం 75 శాతం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సమీక్ష సమావేశాలలో ఆదేశాలు జారీ చేశారు. 11 నెలల వ్యవధిలో ప్రైవేటు, ప్రభుత్వాసుపత్రుల్లో మొత్తం 10,698 ప్రసవాలైతే సాధారణం 3,146 కాగా, శస్త్రచికిత్సలు 7,552 ఉన్నాయి.

ప్రభుత్వాసుపత్రిలో సాధారణ ప్రసవాలు

 కరీంనగర్‌ మాతా శిశు కేంద్రం, హుజూరాబాద్‌, జమ్మికుంట వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యమిస్తున్నారు. అవసరమైన కౌన్సెలింగ్‌తో అవగాహన కల్పిస్తున్నారు. తప్పని పరిస్థితిలోనే శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుతోంది.

వాటిలో శస్త్రచికిత్సలకు ప్రాధాన్యం

జిల్లాలో మొత్తం 45 ప్రైవేటు ప్రసవ ఆసుపత్రులు ఉండగా, 33లో రోజూ నిర్వహిస్తారు. గత నెలలో ప్రైవేటు దవాఖానాల్లో కోతలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్‌ తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించా ఏడు ఆసుపత్రులకు తాఖీదులురు. రెండు నెలల వ్యవధిలో 24 ప్రైవేటు ఆసుపత్రులను వైద్యాధికారుల బృందాలు తనిఖీ చేశాయి. ఏడింటిలోనే సాధారణ ప్రసవాలకు, సుమారు పదింటిలో కేవలం శస్త్రచికిత్సలకే ప్రాధాన్యం ఇచ్చినట్లు తనిఖీ సమయంలో బయటపడింది. ఈ లెక్కన ప్రైవేటులో సాధారణ ప్రసవాలు జరగడం లేదని తేలింది. నోటీసులతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రైవేటు ఆసుపత్రుల్లో మార్పు వస్తుంది.


కఠిన చర్యలు తప్పవు

గత రెండు నెలల్లో సిజేరియన్ల ద్వారా ప్రసవాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఏడు ఆసుపత్రులకు గత నెల 28న షోకాజ్‌ నోటీసులు జారీ చేశాం. వారి సమాధానం ప్రకారం చర్యలు తీసుకుంటాం. సాధారణానికి ప్రాధాన్యం ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవు. ఇక ప్రతి నెలా నివేదికలు తెప్పించుకొని సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.
- డాక్టర్‌ సుజాత, డీఎంహెచ్‌వో, కరీంనగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని