logo

మహా జాతరకు సర్వం సిద్ధం

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ పుణ్యక్షేత్రంలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. రాజన్న ఆలయం, పరిసరాలు, వేములవాడ పట్టణం స్వాగత తోరణాలు, విద్యుత్తు దీపాల అలంకరణతో మహా జాతర శోభను సంతరించుకున్నాయి.

Published : 07 Mar 2024 04:50 IST

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల న్యూస్‌టుడే, వేములవాడ

విద్యుద్దీపాల వెలుగుల్లో రాజన్న ఆలయం

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ పుణ్యక్షేత్రంలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. రాజన్న ఆలయం, పరిసరాలు, వేములవాడ పట్టణం స్వాగత తోరణాలు, విద్యుత్తు దీపాల అలంకరణతో మహా జాతర శోభను సంతరించుకున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు రూ.2.95 కోట్లతో ఏర్పాట్లు చేశారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సిద్ధం చేశారు. దాదాపు 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
మహాశివరాత్రి వేడుకలకు ఆలయాన్ని, ఆలయ ప్రాకారాలను విద్యుత్తు దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ పరిసరాలను నీటితో శుద్ధి చేశారు. ధర్మగుండంలో పాత నీటిని పూర్తిగా తోడేసి భగీరథ నీటిని నింపారు. ఆలయం లోపల, ముఖ ద్వారాలను పూలు, అరటి తోరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు పార్కింగ్‌ స్థలంలో శివార్చన ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు సాధారణ క్యూలైన్‌, శీఘ్రదర్శనంతోపాటు వీఐపీ క్యూలైన్‌ను అదనంగా ఏర్పాటు చేశారు. భక్తులకు కోసం 2.5 లక్షల లడ్డూ ప్రసాదాన్ని సిద్ధం చేశారు. ఆరు కేంద్రాల ద్వారా విక్రయించనున్నారు. ఈ సారి వాహన పూజ షెడ్‌లో కొత్తగా ప్రసాదాల విక్రయ కేంద్రాన్ని నెలకొల్పారు. పార్కింగ్‌ స్థలంలో, ఆలయ పరిసరాల్లో భక్తులు జాగరణ చేసేందుకు పెద్ద ఎత్తున చలువ పందిళ్లు, సామియానాలు ఏర్పాటు చేశారు. తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలను ఏర్పాటు చేశారు. ఎనిమిది మొబైల్‌ మూత్రశాలల రప్పించి వివిధ ప్రాంతాల్లో పెట్టేందుకు చర్యలు చేపట్టారు. క్యూలైన్లలోని భక్తులకు నీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు చర్యలు తీసుకొంటున్నారు. ఆరు రాజన్న జల ప్రసాదం కేంద్రాల ద్వారా శుద్ధజలం అందిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ పరిసరాలు, పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రోడ్లపై సూచిక బోర్డులు పెట్టారు. పలు కూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. పట్టణంలోని కూడళ్లను, మూలవాగు వంతెన ప్రదేశాలను సుందరీకరించారు.

992 ఆర్టీసీ బస్సులు

మహాశివరాత్రి జాతరకు మూడు రోజుల పాటు ఆర్టీసీ అధికారులు 992 బస్సులను నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు. వివిధ డిపోల నుంచి వేములవాడ క్షేత్రానికి నడిపించనున్నారు. తిప్పాపూర్‌ నుంచి కట్టకింద బస్టాప్‌ వరకు భక్తులకు 14 ఉచిత బస్సులను నడపనున్నారు.

పార్కింగ్‌ స్థలంలో జాగరణ కోసం వేసిన షామియానాలు

పారిశుద్ధ్యం, వైద్యంపై ప్రత్యేక దృష్టి

వేడుకల్లో పారిశుద్ధ్యం, వైద్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎండల తీవ్రత పెరగడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా వీధులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు పెద్ద ఎత్తున సిబ్బందిని పెట్టారు. ఇందులో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాలు, పార్కింగ్‌ ప్రాంతంలో దేవస్థానం పర్మినెంట్‌ సిబ్బంది 110 మంది, 950 మంది తాత్కాలిక సిబ్బందిని అయిదు రోజుల పాటు వినియోగించనున్నారు.

  • మున్సిపల్‌ పారిశుద్ధ్య సిబ్బంది 104 మంది, 180 మంది తాత్కాలిక సిబ్బందిని, మరో 225 మందిని ఇతర మున్సిపాలిటీలకు చెందిన వారిని వినియోగించనున్నారు.
  • వివిధ ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 174 మంది వైద్యులు, సిబ్బందిని నియమించారు. ఇందులో 24 గంటలూ వైద్య సేవలందించే శిబిరాలు 5, పన్నెండు గంటల పాటు వైద్య సేవలు అందించే కేంద్రాలు ఏడు పెట్టనున్నారు. 30 మంది వైద్యులను నియమించారు. 108 అంబులెన్స్‌లు మరో అయిదింటిని అందుబాటులో ఉంచారు.

ప్రత్యేక పూజలు

మహాశివరాత్రి పురస్కరించుకుని రాజన్న ఆలయంలో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు జరుగుతాయి.

  • గురువారం: రాత్రి 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాల సమర్పణ. 7.30లకు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే పట్టువస్త్రాల సమర్పణ. రాత్రి 9 గంటలకు నిశీపూజ తర్వాత భక్తులకు లఘు దర్శనం, కోడె మొక్కులు కొనసాగుతాయి.
  • శుక్రవారం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం రాత్రి 11.30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు పురజనులకు సర్వదర్శనం కల్పిస్తారు. 2.30 నుంచి 3.30 గంటల వరకు ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులకు దర్శనం.  ఉదయం 3.30 నుంచి 3.40 వరకు మంగళవాయిద్యాలు, 3.40 నుంచి 4.30 వరకు సుప్రభాతం, ఆలయ శుద్ధి. 4.30 నుంచి 6.00 గంటల వరకు ప్రాతఃకాలపూజ, అనువంశిక అర్చకుల దర్శనం. సాయంత్రం 4.00 నుంచి 5.30 వరకు శివదీక్ష స్వాములకు దర్శనం. సాయంత్రం 6.00 నుంచి 8.00 వరకు మహాలింగార్చన. రాత్రి 11.35 గంటలకు లింగోద్భావ సమయంలో మహాన్యాసక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం.
  • శనివారం: ఉదయం సుప్రభాతం, ప్రాతఃకాల పూజలు, రోజువారీ ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయి.

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

వేములవాడలోని రాజన్న ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాం. క్యూలైన్లలోని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాం. తాగునీరు, చలువపందిళ్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేశాం.

కృష్ణప్రసాద్‌, ఈవో, రాజన్న ఆలయం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని