logo

వేసవి గట్టెక్కేనా!

జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌ పట్టణాలకు డబ్బాలోని గ్రిడ్‌ ద్వారా మిషన్‌ భగీరథ పథకం నీరు సరఫరా అవుతోంది. ధర్మపురి పట్టణానికి డబ్బా నుంచి పైపులైన్లు వేసినా చివరి ప్రాంతం కావడంతో నీరు సరఫరా సక్రమంగా కావడం లేదు.

Published : 29 Mar 2024 05:08 IST

న్యూస్‌టుడే, కోరుట్ల

జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌ పట్టణాలకు డబ్బాలోని గ్రిడ్‌ ద్వారా మిషన్‌ భగీరథ పథకం నీరు సరఫరా అవుతోంది. ధర్మపురి పట్టణానికి డబ్బా నుంచి పైపులైన్లు వేసినా చివరి ప్రాంతం కావడంతో నీరు సరఫరా సక్రమంగా కావడం లేదు. బోలి చెరువు నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. పక్కనే గోదావరి నది ఉన్నా తాగునీటి సరఫరాకు ఉపయోగపడం లేదు. వేసవికాలంలో పట్టణాల్లో నీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. జగిత్యాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.87లక్షలు, కోరుట్లకు ఎస్‌డీఎఫ్‌ నిధులు రూ.55.90 లక్షలు, మెట్‌పల్లికి రూ.50.09 లక్షలు, రాయికల్‌కు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.18.30 లక్షలు, ధర్మపురికి ఎస్‌డీఎఫ్‌ నిధులు రూ.71.17 లక్షల చొప్పున మంజూరయ్యాయి. పైపులైన్‌ ఏర్పాటు, బోరుబావులు, చేతిపంపులు మరమ్మతు చేపడతారు.


శివారు కాలనీల్లోనే సమస్య

జగిత్యాల పట్టణం: పట్టణానికి తాగునీరందించే ప్రధాన జలాశయం ధర్మసముద్రం, లింగం చెరువులో సమృద్ధిగా నీరుంది. మరోవైపు డబ్బా నుంచి మిషన్‌ భగీరథ నీరు నిత్యం సరఫరా అవుతోంది. ధర్మసముద్రం 935 అడుగుల నీటి సామర్థ్యం కాగా ప్రస్తుతం 934 అడుగల మేరకు నీరు ఉంది. వేసవి అవసరాలకు నీరు సరిపోయేంత ఉన్నప్పటికీ తీవ్ర ఎండల ప్రభావంతో అడుగంటే ప్రమాదం కూడా ఉంది. అప్పుడు పూర్తిగా భగీరథ నీటిపై ఆధారపడాల్సి వస్తోంది. పట్టణంలో 14,108 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 165 బోర్లు ఉండగా 21 పనిచేయడంలేదు. 17.50 మిలియన్‌ లీటర్ల డిమాండ్‌ కాగా ప్రస్తుతం 17 మిలియన్‌ లీటర్ల నీరు బల్దియా సరఫరా చేస్తోంది. పట్టణంలో నీటి ఎద్దడి లేకపోయినా శివారుకాలనీల్లో తీవ్రంగా ఉంది. భగీరథ కనెక్షన్లు ఇచ్చినా పూర్తిస్థాయిలో నల్లాలు రావడంలేదని స్థానికులు చెబుతున్నారు. అవసరం మేరకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నామని ఏఈ చరణ్‌ తెలిపారు.


తగ్గుతున్న నీటిమట్టం

ధర్మపురి: తలాపునే గోదావరి ఉన్నా ధర్మపురిలో తాగు నీటికి ఇబ్బంది నెలకొంది. పట్టణానికి తాగునీరు అందించే బోలిచెరువులో నీటి మట్టం గణనీయంగా తగ్గుముఖం పట్టడం, యాసంగి పొలాలకు ఈ చెరువ నీరే ఆధారం కావడం, మరోవైపు డబ్బా పథకం ద్వారా నీరు అందని పరిస్థితితో ముప్పు ఏర్పడుతోంది. బోలిచెరువులో కేవలం అయిదారు అడుగులు మాత్రమే నీటి నిలువ ఉండటంతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇబ్రహీంపట్నం వద్ద గల డబ్బా గ్రామం నుంచి పైపులైన్లు వేసినా చివరి ప్రాంతమైన ధర్మపురికి తాగు నీటిని అందించడం ఇబ్బందిగా ఉంటోంది. డి53 ప్రధాన కాలువ ద్వారా బోలిచెరువు నిండేలా నింపాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రెండు ఇందిరమ్మ కాలనీలు, గోదావరినది పరీవాహక ప్రాంతంలోనే నీటి సమస్యలు అధికంగా నెలకొన్నాయి. నీటి ఇబ్బందులున్న కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని, ప్రస్తుతం డబ్బా పథకం ద్వారా నీరందించేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.


ట్యాంకర్ల ద్వారా..

మెట్‌పల్లి పట్టణం: భూగర్భజలాలు అడుగంటి మెట్‌పల్లి పట్టణంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నారు. పెద్దచెరువులో నీరు తగ్గడంతో మూడు బోర్లును ఏర్పాటు చేసి నిత్యం పట్టణంలో నీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణంలో 56 చేతిపంపులు మరమ్మతుకు నోచుకోక నిరుపయోగంగా మారాయి. నిత్యం 9 ఎంఎల్‌డీల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా 6 ఎంఎల్‌డీలు అందిస్తున్నారు. 5 ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నారు.


తరచూ లీకేజీలు..

కోరుట్ల: కోరుట్ల పట్టణంలో మొత్తం 33 వార్డులున్నాయి. పట్టణానికి డబ్బా గ్రిడ్‌ నుంచి వచ్చే మిషన్‌ భగీరథ పథకం నీరే దిక్కు. ప్రస్తుతం ఒక్కో వ్యక్తికి రోజుకు 135 లీటర్ల చొప్పున 16,500 ఇళ్లకు రోజుకు మొత్తం 11 ఎంఎల్‌డీల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలో నీటి కొరత లేదు. మిషన్‌ భగీరథ పైపులైన్లలో మరమ్మతు ఏర్పడితే నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేక వనరులపై దృష్టిసారించాల్సి ఉంది. చాలాకాలనీలలో పవర్‌ బోర్ల ద్వారా నిత్యావసరాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. చేతిపంపులు అందుబాటులో ఉన్నా ప్రజలు వాటిని వినియోగించుకోవడం లేదు. వేసవిలో తాగునీటి పైపులైన్లు, బోర్ల మరమ్మతుకు రూ.55.90 లక్షల ఎస్‌డీఎఫ్‌ నిధులు ఇటీవల మంజూరయ్యాయి. మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిచిపోతే, నీటి సమస్యలు తలెత్తితే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించినట్లు డీఈఈ అభినయ్‌కుమార్‌ తెలిపారు.


అరకొర నీటి సరఫరా..

రాయికల్‌ పట్టణం: పట్టణంలో తాగునీటి కోసం రూ.10 కోట్లతో గతంలో ఏర్పాటు చేసిన ఫిల్టర్‌ బెడ్‌ మిషన్‌ భగీరథ రాకతో నిరుపయోగం కాగా పట్టణంలో ఇంటింటికీ నీటి సరఫరా అందని ద్రాక్షగానే మారింది. భగీరథ పనులు పూర్తయినా చాలా కాలనీల్లో లోప్రెషర్‌, తరచూ పైపులైన్ల మరమ్మతు కారణంగా నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. పట్టణంలో మొత్తం 5 నీటి ట్యాంకులు ఉండగా 2 ట్యాంకులు మున్సిపల్‌ పరిధివి కాగా మూడు మిషన్‌  భగీరథవి. పట్టణంలో మొత్తం 6 మంచి నీటి బావులు ఉన్నాయి. బావుల నుంచి మున్సిపల్‌ ట్యాంకులు, మిషన్‌ భగీరథ నీటి ద్వారా రెండు నీటి ట్యాంకులు నింపి పట్టణంలో సరఫరా చేస్తున్నారు. పట్టణంలో వేసవిలో నీటి ఎద్దడి నెలకొంటుండగా గత సంవత్సరం 9వ వార్డులో ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేశారు. పట్టణంలో మొత్తం 1.68 ఎంఎల్‌డీల నీటి డిమాండ్‌ ఉండగా మిషన్‌ భగీరథ ద్వారా 0.79 ఎంఎల్‌డీలు, మున్సిపల్‌ బావుల నుంచి ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, డైరెక్టు పంపింగ్‌ ద్వారా 0.90 ఎంఎల్‌డీల నీటిని సరఫరా చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని