logo

ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం

ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది.

Published : 23 Apr 2024 02:09 IST

అధికార యంత్రాంగం చొరవతో అధిక దరఖాస్తులు
25న తుది జాబితా వెల్లడి
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

దరఖాస్తులు స్వీకరిస్తున్న బీఎల్వో

ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. 18 ఏళ్లు నిండిన వారందరూ దరఖాస్తు చేసుకునేందుకు అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నం ఫలించింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాలో ఈ నెల 15 వరకు బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి దరఖాస్తు స్వీకరించగా యువత నుంచి భారీ స్పందన వచ్చింది. జిల్లాలో కొత్త ఓటు హక్కు కోసం ఫారం-6లో 10,380, ఒక చోట నుంచి మరో చోటుకు బదిలీ కోసం ఫారం-8లో 16,900 దరఖాస్తులు వచ్చాయి. వీటిని క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలిస్తున్నారు. అన్ని ఆధార పత్రాలు సక్రమంగా ఉన్న వారికి ఓటు హక్కు కల్పించనున్నారు. ఈ నెల 26న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నారు.

కొత్తగా 10,380

అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. నియోజకవర్గాల వారీగా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అభివృద్ధి చేసే ప్రజాప్రతినిధిని ఎన్నుకునే ఆయుధం ఓటు అంటూ విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తించారు. మరోవైపు బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎంత మంది నివసిస్తున్నారు? అందరికీ ఓటు హక్కు ఉందా? ఎవరైనా తప్పిపోయారా అనే కోణంలో వివరాలు సేకరించారు. కొత్తగా నమోదు కోసం 10,380 దరఖాస్తులు రాగా.. పలు కారణాలతో 837 తిరస్కరించారు.

మార్పులు, చేర్పులకు ...

జిల్లాలోని రామగుండం, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో చాలా మంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం, ఒక పోలింగ్‌ కేంద్రం నుంచి మరో కేంద్రానికి, జాబితాలో చిరునామా తప్పొప్పుల సవరణకు 16,900 దరఖాస్తులు రాగా వీటిని పరిష్కరిస్తున్నారు. రెండేసి చోట్ల ఓట్లు ఉండటం, సక్రమంగా వివరాలు నమోదు చేయకపోవడంతో ఇప్పటి వరకు 659 తిరస్కరించారు. 13,412 దరఖాస్తులను అంగీకరించి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. మిగిలిన దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని