logo

సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం

శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

Published : 23 Apr 2024 02:12 IST

రైతు బిడ్డ జీవన్‌రెడ్డిని పార్లమెంటుకు పంపండి
ఇందూరు సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

వేదికపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, చిత్రంలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు,  ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర ప్రభుత్వ    సలహాదారు షబ్బీర్‌ అలీ, మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ తదితరులు

నిజామాబాద్‌ (ఈనాడు), నిజామాబాద్‌ అర్బన్‌ (న్యూస్‌టుడే) : శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. నిజామాబాద్‌లో సోమవారం నిర్వహించిన జనజాతర సభకు విచ్చేసిన ఆయన మాట్లాడారు. చక్కెర కర్మాగారాలు తెరిపించే విషయంలో విధివిధానాలు ఖరారు చేసేందుకు పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన.. జీవన్‌రెడ్డితో కలిపి కమిటీ వేసిన విషయం ప్రస్తావించారు. మూసి ఉన్న చక్కెర కర్మాగారం తలుపులు సెప్టెంబరు కల్లా తెరిపించే బాధ్యత తనదే అన్నారు. జీవన్‌రెడ్డిని గెలిపిస్తే ఇండియా కూటమిలో వ్యవసాయశాఖ మంత్రిగా ఆయనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారన్నారు. వడ్లు కొనడం లేదని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని.. ఎంత పండించినా కొనటంతో పాటు వచ్చే సీజన్‌ నుంచి రూ.500 బోనస్‌ ఇస్తామన్నారు. వంద రోజుల్లో చక్కెర పరిశ్రమ తెరిపిస్తానని, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని విఫలమైన కేసీఆర్‌ కూతుర్ని ఇక్కడి రైతులు ఓడించారన్నారు. ధర్మపురి అర్వింద్‌ గెలిస్తే అయిదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానంటూ బాండ్‌ పేపర్‌ రాసిచ్చి మోసగించారన్నారు. వంద రోజుల మోసానికే కవితకు ఆ తీరున బుద్ధి చెప్పిన ఇక్కడి రైతులు.. కేవలం అయిదు రోజులు అంటూ మోసగించిన అర్వింద్‌ను అంతకు మించి ఓడించాలని కోరారు. సుగంధ ద్రవ్యాల బోర్డునే పసుపు బోర్డుగా నమ్మించి బుకాయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వ్యవసాయం తెలియని అర్వింద్‌ను గెలిపించుకుంటే.. పల్లికాయలు ఏడ కాస్తాయంటే చెట్టుపైన అంటారంటూ ఎద్దేవా చేశారు. రైతు కష్టాలపై అవగాహన లేని అర్వింద్‌ కంటే.. స్వయాన రైతు జీవన్‌రెడ్డిని గెలిపిస్తే మీలో ఒకడిగా ఉండిపోతారన్నారు.

జీవన్‌రెడ్డికి నామినేషన్‌ ధరావతు సొమ్ము విరాళంగా అందజేస్తున్న హనుమాన్‌ దీక్షాపరులు

పెట్టుబడి వర్గాలకు.. రైతులకు మధ్య ఎన్నికలు

అన్నివర్గాలకు న్యాయం, సంక్షేమం అందించటం కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. పసుపు బోర్డు కోసం బాండ్‌ పేపర్‌ రాసిచ్చి అయిదేళ్లు కాలపయాపన చేసిన అర్వింద్‌.. ఇప్పుడు మళ్లీ అవకాశం ఇవ్వాలని అడగటం విడ్డూరంగా ఉందన్నారు. మోదీ అక్టోబరు 4న పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తాం.. ఎప్పుడు ఏర్పాటు చేస్తామనే వివరాలు లేకుండా ప్రకటించడం మళ్లీ మోసం చేయటమే అన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడారు. నిజామాబాద్‌లో నిర్వహించిన తొలి ఎన్నికల సభకు భారీగా జనం తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా ఇతర నాయకులు తమ ప్రసంగాలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపారు. హనుమాన్‌ మాలధారులు పలువురు సభా వేదికపైకి చేరుకొని.. జీవన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలుకు ధరావతు రుసుమును విరాళంగా అందించారు. సోమవారం ముఖ్యమంత్రితో కలిసి నామినేషన్‌ వేయాలని అనుకోగా ఆయన రాక ఆలస్యమైంది. మూడు గంటల వరకే సమయం ఉండటంతో వాయిదా వేసుకున్నారు. మంగళ, బుధవారాల్లో వేస్తానని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. సభలో మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని