logo

తైబజార్‌... చిరు వ్యాపారుల బేజార్‌

పురపాలక సంఘంలో తైబజార్‌ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.

Published : 24 Apr 2024 05:15 IST

రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నా పట్టించుకోని అధికారులు

చిరు వ్యాపారికి రూ. 50లకు ఇచ్చిన రసీదు

న్యూస్‌టుడే, వేములవాడ : పురపాలక సంఘంలో తైబజార్‌ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు. ఏటా మున్సిపల్‌ అధికారులు వేలం నిర్వహిస్తుంటారు. నిబంధనలకు అనుగుణంగా పాట దక్కించుకున్న గుత్తేదారు చిరు వ్యాపారుల వద్ద తీసుకోవాలి. ఈ నిబంధనలను తుంగలో తొక్కి రోజు వారీగా చిరు వ్యాపారులను దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వేములవాడ మున్సిపల్‌ పరిధిలో 2023-24 సంవత్సరానికి గాను తైబజార్‌ను రూ.19.40 లక్షలకు గుత్తేదారు దక్కించుకున్నారు. ఏటా కొందరు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు పాట దక్కించుకొని మున్సిపల్‌ ఆదాయానికి గండి కొడుతున్నారు. మరోవైపు చిరు వ్యాపారుల వద్ద మాత్రం నిబంధనలకు విరుద్ధంగా రెండింతలు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే రైతులు నోరు మెదపకుండా, చేసేదేమీ లేక గుత్తేదారు అడిగినంత ఇస్తున్నారు. పలు సందర్భాల్లో ఎక్కువ డిమాండ్‌ చేసినప్పుడు రైతులు, చిరు వ్యాపారులు గుత్తేదారుతో వాగ్వాదానికి దిగిన సందర్భాలున్నాయి. అయినా ముక్కు పిండి అధికంగా వసూలు చేస్తున్నారు.

ఉత్సవాల సమయంలో రూ.200

వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి, శివకల్యాణం, సీతారాములవారి కల్యాణోత్సవాల సందర్భంగా పట్టణంలోని రోడ్లపై ఏర్పాటు చేసుకునే తోపుడు బండ్లు, ఇతర దుకాణారుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.200 వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. తైబజార్‌ వసూలు చేసే ధరల్లో ఆటో వ్యాన్‌, తోపుడు బండ్లు, మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌కు మాత్రమే రూ.30 నిర్ణయించారు. అంతకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. అలాంటిది వీరి వద్ద రూ.200 తీసుకుంటున్నా పట్టించుకునే వారు లేకపోవడంతో చిరువ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఒక రోజు ఆటోలో వచ్చి మక్క కంకులు, పుచ్చకాయలు తదితర వాటిని విక్రయించే వారి వద్ద రూ.100 పైగా వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. చిన్న చిన్న వ్యాపారుల వద్ద రూ.50 తక్కువ తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు. ఎక్కువ మొత్తంలో అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు తెలిసినా మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా తైబజార్‌ అదనపు వసూళ్లపై చర్యలు చేపట్టాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు.

విచారణ చేసి చర్యలు తీసుకుôటాం

వ్యాపారుల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేసినట్లు, ఉత్సవాల సందర్భంగా దుకాణాల వద్ద నుంచి రూ. 200 తీసుకున్నట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. దుకాణాలు, చిరు వ్యాపారులను విచారించి అధికంగా డబ్బులు వసూలు చేసినట్లు తేలితే తైబజార్‌ గుత్తేదారుపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

 అన్వేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌, వేములవాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని