logo

అతివల ఉపాధికి ఆదరువేదీ!

రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు.

Updated : 24 Apr 2024 06:06 IST

సంక్షోభంలో బీడీ పరిశ్రమ
ఉమ్మడి జిల్లాలో 1.70 లక్షల మందికి ఆధారం

న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు : రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. కరీంనగర్‌ ఎంపీ పరిధిలోనూ చాలా మందికి బీడీ పరిశ్రమనే జీవనాధారం. ఉమ్మడి జిల్లాలో దాదాపు 1.70 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడగా కొంతకాలంగా సంక్షోభంలో ఉండటం వారిని కుంగదీస్తోంది. తమ సమస్యల పరిష్కారానికి నేతలు చొరవ తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

పెరిగిన పన్ను భారం

చేతితో తయారయ్యేవి కావడంతో గతంలో రాష్ట్రంలో బీడీలపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌) వసూలు చేయలేదు. కాగా దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలులోకి రావడం, ప్రజారోగ్యరీత్యా పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే కేంద్రం బీడీలపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) భారాన్ని అధికంగా వేసింది. అంతకుముందు సెంట్రల్‌ ఎక్సైజ్‌ పన్ను వెయ్యి బీడీలకు రూ.16.31గా ఉండేది. జీఎస్టీ అమలు తర్వాత 28 శాతం పన్ను కింద వెయ్యి బీడీలకు కంపెనీల ధరలు బట్టి రూ.195-285 వరకు చెల్లించాల్సి వస్తోంది. కంపెనీలు ఈ భారాన్ని వినియోగదారులపైనే మోపుతుండటంతో ధరలు పెరిగి బీడీలు తాగేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది.

21 వర్గాలపై ప్రభావం

తెలంగాణలో తయారైన బీడీలు ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, బిహార్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. బీడీ కట్టల ధరలు పెరగటంతో వినియోగదారుల సంఖ్య తగ్గి ఉత్పత్తిని సైతం తగ్గించామని కంపెనీలు చెబుతున్నాయి. అదే సమయంలో యంత్రాలతో తయారయ్యే చవక రకం సిగరెట్లు మార్కెట్లోకి రావడం బీడీ పరిశ్రమకు శరాఘాతంగా మారింది. పొగాకు పండించే రైతు మొదలు ఆకు సేకరించేవారు, బీడీలు చుట్టేవారు, ప్యాకర్లు, చాకర్లు, టేకేదార్లు, కంపెనీల్లో ఇతర సిబ్బంది, గంపలు, చాటల తయారీదార్లు తదితర వర్గాలన్నీ కలిపితే 21 మంది వరకు బీడీల తయారీపై ఆధారపడ్డారు. పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో వీరందరి జీవితాలపై ప్రభావం పడుతోంది.

ఇవీ కార్మికుల వినతులు

  •  2014లోపు పీఎఫ్‌లో ఖాతా కలిగి ఉన్న వారికే ప్రస్తుతం పింఛను మంజూరు చేస్తుండగా, ఆ గడువును ఎత్తివేస్తామని గతంలో ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఈ ఎన్నికల తర్వాతనైనా జీవనభృతిని రూ.4 వేలకు పెంచాలని, కాంట్రిబ్యూటరీ పింఛన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) నుంచి తమను మినహాయించాలని విన్నవిస్తున్నారు.
  •  బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధిగా కేంద్రం నుంచి గతంలో రూ.500 కోట్లు విడుదల చేసినా వినియోగించుకోలేకపోవడంతో వెనక్కి మళ్లాయి. వాటిని తిరిగి కేటాయించాలని కోరుతున్నారు.
  •  బీడీల తయారీలో 21 లిమిటెడ్‌ కంపెనీలు, 41 స్థానిక కంపెనీలున్నాయి. కార్మికుల్లో 98 శాతం మహిళలే ఉండగా ప్రస్తుతం నెలలో 10-14 రోజులకే పని దొరుకుతోంది. ఉపాధి పెంచేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
  •  జీవో నం.41 ప్రకారం బీడీలకు కనీస ధర చెల్లించడంతో పాటు నెలలో 26 రోజులు పని కల్పించాలని మహిళలు కోరుతున్నారు. కనీస వేతన చట్టం అమలు చేస్తే వెయ్యి బీడీలకు రూ.229 దక్కుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
  •  ప్రధాని ఆవాస్‌ యోజన ద్వారా గృహనిర్మాణానికి రూ.3 లక్షల రాయితీని లేదా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు అందించాలని ఆశిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు రాయితీపై రుణాలివ్వాలని కోరుతున్నారు.
  •  లక్‌పతి దీదీ పథకాన్ని బీడీ కార్మికులకు వర్తింపజేయడంతో పాటు ఆయుష్మాన్‌భారత్‌ పథకాన్ని వర్తింపజేస్తామని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీడీ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని