logo

నిర్ణయమేంటి?

కరీంనగర్‌ కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది.

Updated : 26 Apr 2024 06:09 IST

ప్రవీణ్‌రెడ్డి అంశంపై కాంగ్రెస్‌లో చర్చ

ఈనాడు, కరీంనగర్‌ న్యూస్‌టుడే- కరీంనగర్‌ పట్టణం: కరీంనగర్‌ కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక్కడి స్థానం కోసం టికెట్‌ ఆశించి భంగపడ్డ అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నిర్ణయం ఏంటనే విషయమై శ్రేణుల్లో ఒకింత కలవరం మొదలైంది. ఓ వైపు అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపదాస్‌ మున్షీని కలిసి బీ-ఫారాన్ని అందుకుని నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. మరో వైపు ప్రవీణ్‌రెడ్డి బుధవారం తన అనుచరులతో నామినేషన్‌ దాఖలు చేయించారు. గురువారం సొంతంగా మరో సెట్‌ వేయడానికి సిద్ధమైన సమయంలో టికెట్‌ రాజేందర్‌రావుకు ఖరారు కావడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు మద్దతుదారులు చెబుతున్నారు. ఇదే సమయంలో పార్టీ అధిష్ఠానం ఆయనతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. గతేడాది నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుస్నాబాద్‌ టికెట్‌ ప్రవీణ్‌రెడ్డి ఆశించగా పొన్నం ప్రభాకర్‌కు ఇచ్చారు. ప్రస్తుతం లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలనుకుంటే సమీకరణలు కుదరడం లేదని అధిష్ఠానం వెలిచాల రాజేందర్‌రావు వైపునకు మొగ్గు చూపడంపై ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

హామీతో బుజ్జగిస్తారా?

కరీంనగర్‌ టికెట్‌ కోసం పలువురు ఆశావహులు దరఖాస్తు చేసుకున్నా రాజేందర్‌రావు, ప్రవీణ్‌రెడ్డి మధ్యనే నువ్వా- నేనా అన్నట్లుగా అభ్యర్థిత్వానికి పోటీ సాగింది. ఒక దశలో టికెట్‌ ఎవరికి ఇచ్చినా.. ఇంకొకరికి నామినేటెడ్‌ పదవి ఇస్తారనే ప్రచారం బలంగా వినిపించింది. అయితే ఇద్దరు అభ్యర్థిత్వం కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. ప్రవీణ్‌రెడ్డికి హుస్నాబాద్‌ సెగ్మెంట్‌తోపాటు హుజూరాబాద్‌, మానకొండూర్‌ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించి నామినేటెడ్‌ పదవి ఇస్తారనే చర్చ పార్టీలో నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయంలో ఇప్పటికే పార్టీ ముఖ్యులకు సంకేతాలిచ్చినట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ప్రవీణ్‌రెడ్డి టికెట్‌ విషయమై ఇప్పటి వరకు బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకున్నా.. ఆయన మద్దతుదారులు మాత్రం తమ నేతకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌రెడ్డి నిర్ణయమేంటనే చర్చ కాంగ్రెస్‌లో పెద్దఎత్తున జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని