logo

గంజాయి చోరీ కేసులో ఆరుగురి అరెస్టు

పోలీసుస్టేషన్‌ నుంచి గంజాయి దొంగిలించిన కేసులో మంగళవారం ఆరుగురిని అరెస్టు చేశారు. జగిత్యాల డీఎస్పీ డి.రఘుచందర్‌ వివరాలు వెల్లడించారు.

Published : 01 May 2024 02:19 IST

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ డి.రఘుచందర్‌

జగిత్యాల, న్యూస్‌టుడే: పోలీసుస్టేషన్‌ నుంచి గంజాయి దొంగిలించిన కేసులో మంగళవారం ఆరుగురిని అరెస్టు చేశారు. జగిత్యాల డీఎస్పీ డి.రఘుచందర్‌ వివరాలు వెల్లడించారు. సారంగాపూర్‌ పోలీసుస్టేషన్‌ వెనుక అంబులెన్స్‌లో మూడు సంచుల్లో ఉన్న 60 కిలోల గంజాయిని మార్చి 31న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. మంగళవారం తెల్లవారుజామున సారంగాపూర్‌ మండలం లక్ష్మిదేవిపల్లి శివారులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రంగపేట గ్రామానికి చెందిన అల్లెపు యశ్వంత్‌ అలియాస్‌ ఎలెన్‌, ధర్మారపు అశోక్‌, అన్నవేని గంగాధర్‌ అలియాస్‌ చిన్ను, బోదాసు రాకేష్‌ మరో ఇద్దరు మైనర్లు ద్విచక్రవాహనాలపై 3 గంజాయి ప్యాకెట్లతో దొరికారు. వారిని విచారించగా సారంగాపూర్‌ పోలీసుస్టేషన్‌ వెనుక నిలిపి ఉంచిన అంబులెన్స్‌ నుంచి దొంగిలించినట్లు తేలింది. వారి నుంచి రూ.5.51 లక్షల విలువైన 22.1 కిలోల గంజాయి 4 ద్విచక్రవాహనాలు స్వాధీనపర్చుకున్నట్లు వివరించారు.

పథకం పన్నారిలా..

రంగపేట గ్రామానికి చెందిన ధర్మారపు అశోక్‌ అన్నవేని గంగాధర్‌ అలియాస్‌ చిన్నులను ఆబ్కారీ పోలీసులు గత జనవరిలో అరెస్టుచేసి జైలుకు పంపించారు. అదే సమయంలో సారంగాపూర్‌ పోలీసులు 70 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలుసుకున్నారు. ఫిబ్రవరిలో కండిషన్‌ బెయిల్‌పై విడుదలై విషయాన్ని స్నేహితులైన అల్లెపు యశ్వంత్‌ అలియాస్‌ ఎలెన్‌ ఇద్దరు మైనర్లకు చెప్పారు. గంజాయి దొంగిలించి కొంత దాచుకుని మిగతాది విక్రయిస్తే జల్సా చేయవచ్చనుకున్నారు. అల్లెపు యశ్వంత్‌ అలియాస్‌ ఎలెన్‌ ఇద్దరు మైనర్లు మార్చి 31న రాత్రి 2 గంటలకు ద్విచక్రవాహనంపై రంగపేట నుంచి సారంగాపూర్‌ వెళ్లారు. పోలీసుస్టేషన్‌ సమీపంలోనే పల్లెప్రకృతివనంలో ద్విచక్రవాహనాన్ని ఆపి ఒక మైనర్‌ రహదారిపై ఉండగా యశ్వంత్‌ పోలీసుస్టేషన్‌ పక్కనుంచి పరిసరాలు పరిశీలించాడు. 3.30 గంటల ప్రాంతంలో మరో మైనర్‌ పోలీసుస్టేషన్‌ గోడ దూకి అంబులెన్స్‌ వెనుకవైపు అద్దం పగులగొట్టి గంజాయి ప్యాకెట్లను దొంగిలించి గోడపై నుంచి బయట పడేశాడు. అనంతరం ముగ్గురు కలిసి గంజాయి ప్యాకెట్లు తీసుకుని రంగపేట శివారులోని బండ గుట్ట దగ్గర అడవిలో దాచిపెట్టారు. ఉదయం 10 గంటలకు విషయాన్ని ధర్మారపు అశోక్‌, అన్నవేని గంగాధర్‌ అలియాస్‌ చిన్నుకు చెప్పారు. అయిదుగురు కలిసి గంజాయి తాగి కొంత స్నేహితులకు ఇవ్వగా మరికొంత విక్రయించారు. గంజాయి కొనుగోలు చేసిన వారిలో మాలెపు రణధీర్‌, మరో మైనర్‌ పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ రఘుచందర్‌ వివరించారు. కేసుతో ప్రమేయం ఉన్న ప్రతిఒక్కరిని పట్టుకుంటామని, నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన డీఎస్పీ రఘుచందర్‌, రూరల్‌ సీఐ ఆరీఫ్‌అలీఖాన్‌, ఇన్‌ఛార్జి ఎస్సై గౌతం పవార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీను, కానిస్టేబుళ్లు రవి, నరేష్‌, శ్యామ్‌లను జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని