logo

చేరికలపై హస్తం పార్టీ దృష్టి

కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ నియోజకవర్గంలో పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేస్తోంది. కరీంనగర్‌ నగర పాలక సంస్థ పాలకవర్గంలో 60 మంది కార్పొరేటర్లు ఉండగా, ఒక్క కాంగ్రెస్‌ సభ్యుడు కూడా లేరు.

Published : 04 May 2024 04:34 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం, కార్పొరేషన్‌

కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ నియోజకవర్గంలో పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేస్తోంది. కరీంనగర్‌ నగర పాలక సంస్థ పాలకవర్గంలో 60 మంది కార్పొరేటర్లు ఉండగా, ఒక్క కాంగ్రెస్‌ సభ్యుడు కూడా లేరు. శుక్రవారం భారాస కార్పొరేటర్లు 11 మంది సీఎం సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నాయకులు కూడా పార్టీలో చేరేందుకు ముందుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు ఆకారపు భాస్కర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ ఎం.రాజేందర్‌, ఎంఐఎం మాజీ జిల్లా అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్‌ సయ్యద్‌ వాహజుద్దీన్‌తోపాటు పలువురు  ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌ చేరిన విషయం తెలిసిందే.

జిల్లా పరిషత్‌లో కూడా..

కరీంనగర్‌ శాసనసభ నియోజకవర్గం పరిధిలో రెండు మండలాలు జిల్లా పరిషత్‌ పరిధిలోకి వస్తాయి. జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్‌ సతీమణి కరీంనగర్‌ గ్రామీణం జడ్పీటీసీ సభ్యురాలు పి.లలిత పార్టీలో చేరారు. ఆ తర్వాత మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పిట్టల రవీందర్‌తోపాటు ఆయన సతీమణి కొత్తపల్లి జడ్పీటీసీ సభ్యురాలు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమక్షంలో చేరారు. పలువురు భారాసలో ఉన్న మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు చేరారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో పార్టీ బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు పావులు కదుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని