logo
Published : 28/11/2021 00:54 IST

వానపోటుకు..దిగుబడులు దిగదుడుపే

ఆశలన్నీ ఆవిరి.. ఉత్పత్తుల సాధన కష్టం

విజయపుర జిల్లాలో ద్రాక్షతోటలో నిలిచిన వర్షం నీరు

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే : ‘చేతికి అందిన కూడు నోటికి అందలేద’న్నట్లుగా రాష్ట్ర రైతుల పరిస్థితి మారిపోయింది. పంటలు చేతికందినట్లేనని ఆశతో ఎదురు చూసిన దశలో ఒక్కసారిగా వరుణుడు ప్రతాపాన్ని చూపడంతో అన్నదాతలు తల్లడిల్లారు. పదుగురికి అన్నంపెట్టే వారంతా నేడు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. నేతలు ఎప్పటికి కరుణిస్తారో? తాము కష్టాల నుంచి గట్టెక్కి ఊపిరి పీల్చుకునే రోజులు ఎప్పుడొస్తాయో? అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం ఏనుగు దాహానికి చూరు నీళ్లలా ఉందనే ఆవేదన సర్వత్రా వినవస్తోంది.

రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్దేశించిన లక్ష్యం మేరకు రాష్ట్రంలో 77 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఖరీఫ్‌లో వివిధ రకాల పంటల్ని సాగు చేయాలి. లక్ష్యాన్ని అధిగమించి అదనంగా మరో లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో పంటల సాగు నమోదైంది. ఇటీవలి కాలంలో ఇది ఓ రికార్డుగా భావించారు. ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం నుంచే సకాలంలో వర్షాలు కురవడంతో రైతులు ఉత్సాహంగా ఏరువాక సాగించారు. అందుకు తగినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు, విత్తనాల్ని చాలినంతగా నిల్వల్ని అందుబాటులో ఉంచింది. కొన్ని ప్రాంతాల్లో తగిన పరిమాణంలో లభ్యం కానప్పటికీ వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో రైతులు అధిక ధరలకు ఇతర ప్రాంతాల నుంచి వీటిని సమకూర్చుకున్నారు. పంటల దిగుబడులు కళ్లాలకు చేరుకుని మరికొన్ని రోజుల్లో ఉత్పత్తులు ఇంటికి చేరనున్నాయనగా వరుణుడు కన్నెర్ర చేశాడు. తుపాను రూపంలో ఎడతెరిపి లే

కుండా వర్షాల్ని కురిపించడంతో రైతుల ఆశలన్నీ నిరాశలుగా మిగలాయి. కొన్నిచోట్ల కళ్లాలకు చేరకుండానే పొలంలోనే కంకులన్నీ మొలకలెత్తాయి. అనేక జిల్లాల్లో కోతలు కోసిన తరువాతి వరి పొలాలన్నీ నీటిలో మునిగాయి. రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారమే దాదాపు ఐదు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు ధ్వంసమయ్యాయి. వరి, జొన్న, రాగి, మొక్కజొన్న, సజ్జ, ఇతర తృణ ధాన్యాల పంటల్ని 31.37 లక్షల హెక్టార్లలో సాగుచేయాలని నిర్ణయించినా.. అది లక్ష్యాన్ని అధిగమించి 31.88 లక్షల హెక్టార్లకు చేరుకుందని వ్యవసాయ శాఖ సంబరపడింది. దిగుబడులపై అంచనాల్ని రూపొందిస్తున్న సమయంలో అనుకోని ఉపద్రవం సంభవించినట్లు అధికారులు వాపోయారు. ఇదే పరిస్థితి రబీ సీజన్‌లో కూడా రాష్ట్రాన్ని పీడిస్తోందని తెలిపారు. రబీలో 28 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటల్ని సాగుచేయాలనుకున్నారు. ఇప్పటికే 16 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటల సాగు పూర్తయింది. మిగిలిన విస్తీర్ణంలో సాగును పూర్తి చేయాల్సిన పరిస్థితుల్లో వానలు దెబ్బతీశాయి. సాగును ముందుకు కదలనీయడం లేదని అధికారులు తెలిపారు.

ఆకాశానికి చిల్లులే

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ): ఊహలకు కూడా అందనంతగా మేఘాలు వర్షించడంతో రైతులు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఈనెల 18 నుంచి 24 వరకు రాష్ట్రంలో ఏకంగా 750 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 7.7 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. ఏకంగా 65.4 (750 శాతం) మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వివిధ ప్రాంతాల విషయానికొస్తే తీర ప్రాంతంలో 494 శాతం, ఉత్తర మధ్య కర్ణాటకలో 758 శాతం, దక్షిణ మధ్య కర్ణాటకలో 798 శాతం అధికంగా వర్షాలు పోటెత్తాయని తెలిపారు.

బెళగావి జిల్లాలో జలమయమైన వరి మళ్లు

నూర్పిడికి ముందే రాగి కంకుల నుంచి మొలకలొచ్చాయిలా..

వానబారిన పడిన రాగి కంకుల్ని ఎండబెట్టుకుంటున్న రైతులు

మల్నాడు ప్రాంతంలో భారీ వర్షాలకు కొబ్బరి తోటలు ఇంకా నీటిలోనే..

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని