logo

పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి

బళ్లారి నగరం కోట ప్రదేశంలో ఉన్న మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ ఉన్నత పాఠశాలను రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమశాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. స్వాతంత్య్రానికి పూర్వం ఈ పాఠశాలను

Published : 30 Jun 2022 00:46 IST

పాఠశాల ఆవరణలో పర్యటిస్తున్న మంత్రి బి.శ్రీరాములు, ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి,తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి నగరం కోట ప్రదేశంలో ఉన్న మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ ఉన్నత పాఠశాలను రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమశాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. స్వాతంత్య్రానికి పూర్వం ఈ పాఠశాలను టిప్పుసుల్తాన్‌ కాలంలో సైనికులతో పాటు, మందుగుండు సామగ్రి నిల్వ చేయడం, తయారు చేయడానికి నిర్మించారు. ప్రస్తుతం గదులు శిథిలమవుతున్నా వాటిలోనే తరగతులను నిర్వహిస్తున్నారు. మౌలిక సౌకర్యాలను కల్పించాలని విద్యార్థులు మంత్రిని కోరారు. దీంతో మంత్రి పాతపడిన తరగతి గదులను నేరుగా పరిశీలించి ముఖ్యగురువు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. తరగతి గదుల్లోకి గాలి, వెలుతురు రావడం లేదు. విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవని మంత్రికి వివరించారు. పాఠశాలకు సరైన భద్రత లేకపోవడం వల్ల రాత్రి పూట పాఠశాల ఆవరణలోకి కొంత మంది ప్రవేశించి మద్యం తాగిన సీసాలు, గ్లాసులు కూడా ఉంటాయని ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు వేర్వేరుగా మరుగుదొడ్లు, సరైన తాగునీటి వ్యవస్థ కూడా లేదని వివరించారు. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ పాఠశాల వెనకభాగంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలోని స్థలాంతరం చేయాలని మంత్రి ఉపాధ్యాయులకు సూచించారు. చారిత్రాత్మక భవనాలు కావడంతో వాటిని కూల్చివేయడం సరికాదు. వాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించడానికి ఉండేలా నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుందనే వివరాలతో కూడిన నివేదికను సిద్ధం చేసి ఇవ్వాలని విద్యాశాఖాధికారికి మంత్రి సూచించారు. కోట ప్రదేశానికి 300 మీటర్లు ఉండటం వల్ల ఈ భవనాలు కూల్చడం, అభివృద్ధిపై కూడా కేంద్ర పురాతత్వ శాఖాధికారులతో చర్చించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు పేదలు, సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థులు వస్తారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్య బోధించాలని మంత్రి ఉపాధ్యాయులకు సూచించారు. మంత్రితో పాటు బళ్లారి నగర శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి, మాజీ లోక్‌సభ సభ్యురాలు జె.శాంత, విద్యాశాఖాధికారి ఆందానప్ప వడగేరి, ఏడీసీ పి.ఎస్‌.మంజునాథ, తహసీల్దార్‌ విశ్వనాథ, ప్రజాపనులశాఖాధికారులు పాల్గొన్నారు.

పాఠశాల ఆభివృద్ధిపై విద్యాశాఖ, స్థానిక ప్రజలతో చర్చిస్తున్న మంత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని