logo

సంబరాలకు రాజఠీవి!

చందనవనంలో విరాజిల్లే రాచనగరి మైసూరు కొత్త కాంతులీనింది. గజరాజుల ఘీంకారాల మధ్య బంగారు అంబారీలో చాముండీమాత ఊరేగి వస్తుంటే.. భక్తులు, పర్యాటకులు జయనాదాలతో వీధులను హోరెత్తించారు.

Published : 07 Oct 2022 02:30 IST

మైసూరు వీధుల్లో చాముండీ మాతను బంగారు అంబారీపై ఊరేగిస్తున్న వేళ.. కదలివచ్చిన అశేష జనవాహిని

మైసూరు, న్యూస్‌టుడే : చందనవనంలో విరాజిల్లే రాచనగరి మైసూరు కొత్త కాంతులీనింది. గజరాజుల ఘీంకారాల మధ్య బంగారు అంబారీలో చాముండీమాత ఊరేగి వస్తుంటే.. భక్తులు, పర్యాటకులు జయనాదాలతో వీధులను హోరెత్తించారు. రాచనగరి మొదలు.. బన్ని మండపం వరకు ఇసుకేస్తే నేలరాలనంతగా గుమికూడిన జనులకు ఇది కనుల పండుగే! విఖ్యాత దసరా ఉత్సవాలు విజయవంతంగా పూర్తికావడంతో రాష్ట్ర సర్కారు ఊపిరి పీల్చుకుంది. కరోనా మహమ్మారితో రెండేళ్లుగా నామమాత్రంగా నిర్వహించిన ఈ వేడుకలకు ఈ ఏడాది దేశ, విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో కదలి వచ్చారు. రాచనగరికి మొదటిసారి వచ్చిన పర్యాటకులు ఇక్కడి భవంతులు, ఆలయాలు, సంస్కృతి-సంప్రదాయాలను చూసి ముచ్చటపడ్డారు. దసరా ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపాల అలంకరణను ఈ వారాంతం వరకు కొనసాగించానున్నారు. జంబూసవారీలో పాల్గొన్న ఏనుగులు ప్యాలెస్‌ వెనుక ఆవరణలో విశ్రాంతి తీసుకున్నాయి. వాటికి స్నానాలు చేయించడాన్ని పర్యాటకులు వీక్షించారు. దసరా వస్తు ప్రదర్శన కేంద్రంలో గురువారం రద్దీ కనిపించింది. కొందరు పర్యాటకులు ఏనుగుల వద్దకు వెళ్లి ఫొటోలు దిగారు. ప్యాలెస్‌లో సందర్శకుల సంఖ్య ఎక్కువగా కనిపించింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసులు, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు సత్ఫలితాన్ని ఇచ్చింది.

అంగారు అంబారీలో ఊరేగుతున్న చాముండీ మాతకు నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై


కాగడా, బాణసంచా ప్రదర్శనల వీక్షణకు కదలివచ్చిన జనం


నృత్యావళితో.. పునీత్‌రాజ్‌కుమార్‌కు ఘన నివాళి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని