logo

కుక్కర్‌లో కుక్కేసిన కుట్రలెన్నో!

అనూహ్యంగా మంగళూరులో కుక్కర్‌ బాంబు పేలడంతో గాయపడి దొరికిపోయిన అనుమానిత తీవ్రవాది షారిఖ్‌కు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి వద్ద పోలీసులు భద్రతను రెట్టింపు చేశారు.

Published : 30 Nov 2022 00:38 IST

షారిఖ్‌

మంగళూరు, న్యూస్‌టుడే : అనూహ్యంగా మంగళూరులో కుక్కర్‌ బాంబు పేలడంతో గాయపడి దొరికిపోయిన అనుమానిత తీవ్రవాది షారిఖ్‌కు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి వద్ద పోలీసులు భద్రతను రెట్టింపు చేశారు. తీవ్రవాదులకు సంబంధించిన సమాచారం బయటపడకుండా స్లీపర్‌ సెల్స్‌ అతనిపై దాడి చేసి, మట్టుపెట్టే ప్రమాదం ఉందన్న ఎన్‌ఐఏ సూచనలతో మంగళూరు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిందితుడు మంగళూరుకు చేరుకున్న తర్వాత ఎవరెవరిని కలిశాడో గుర్తించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అతని చరవాణిలో ఐసిస్‌, అల్‌ ఖైదాకు చెందిన 1200 వీడియోలు ఉన్నాయని తేలింది. బాంబుల తయారీ, తుపాకీ కాల్పులు, రెచ్చగొట్టే ప్రసంగాలు అందులో కోకొల్లలు. రోజులో ఎక్కువ సమయం అతను ఆ వీడియోలను చూస్తూ కాలం గడిపేవాడని, అతనికి పరిచయం ఉన్న వారి నుంచి పోలీసులకు అందిన సమాచారం. నాలుగేళ్ల నుంచి తమ కుమారుడు ఇలా విచిత్రంగా వ్యవహరిస్తూ వస్తున్నాడని షారిఖ్‌ తల్లి చెప్పినట్లు సమాచారం. ఉడుపిలోనూ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాల నిఘాను మరింత పెంచారు. అనుమానాస్పదంగా తిరిగే వారు కనిపిస్తే తక్షణమే స్థానిక ఠాణా, భద్రత సిబ్బంది, ఔట్పోస్టులలో వివరాలు ఇవ్వాలని పెజావర మఠాధిపతి విశ్వేశ ప్రసన్న తీర్థ భక్తులను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని