logo

కర్ణాటక మెచ్చిన హృదయవంతుడు.. విష్ణువర్ధనుడు

కన్నడిగులు మొత్తం మెచ్చుకునే హృదయవంతుడు డా.విష్ణువర్ధన్‌ అని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పేర్కొన్నారు. తన అభినయంతోనే ప్రజల మనసులను ఆయన గెలుచుకున్నారని తెలిపారు.

Published : 30 Jan 2023 02:25 IST

స్మారకాన్ని ప్రారంభిస్తున్న బొమ్మై

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: కన్నడిగులు మొత్తం మెచ్చుకునే హృదయవంతుడు డా.విష్ణువర్ధన్‌ అని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పేర్కొన్నారు. తన అభినయంతోనే ప్రజల మనసులను ఆయన గెలుచుకున్నారని తెలిపారు. హెచ్‌డీకోట రోడ్డు హాళాలు గ్రామంలో డా.విష్ణువర్ధన్‌ ప్రతిష్ఠాన, సమాచార శాఖ ఐదెకరాల విస్తీర్ణంలో నిర్మించిన డా.విష్ణువర్ధన్‌ స్మారక భవనాన్ని ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. నాగరహావు సినిమాలో రామాచారి పాత్ర ద్వారా ప్రతి ఒక్కరి అభిమానాన్ని చూరగొన్న ఆయన ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదన్నారు. తనకు వచ్చిన అన్ని పాత్రలను తనదైన శైలిలో నటించి, అభిమానులను మెప్పించారని చెప్పారు. విష్ణు జీవిత భాగస్వామిగా, శక్తిగా పద్మశ్రీ భారతి విష్ణువర్ధన్‌ నిలిచారని పేర్కొన్నారు. నటునిగా, మానవతావాదిగా ఆయన కళ, సాహసం, చిత్ర పరిశ్రమలో చేసిన సాధనలను అన్నీ తన కళ్లముందున్నాయని తెలిపారు.

విష్ణువర్ధన్‌ విగ్రహాన్ని ప్రారంభించి, పూలు చల్లుతున్న బొమ్మై

తాను ఇక్కడకు విష్ణువర్ధన్‌ అభిమానిగానే ఇక్కడకు వచ్చానని చెప్పారు. నాగరహావు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సహజంగానే ఆయన అభిమానిగా మారుతారన్నారు. తన భావనాత్మక ప్రపంచంలో ఉంటూ, ఇతరులనూ అదే మార్గంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించేవారని గుర్తు చేసేవారు. స్మారకం నిర్మాణానికి రూ.11 కోట్లు విడుదల చేసిన అప్పటి ముఖ్యమంత్రి యడియూరప్పకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు అభిమానులు ‘విష్ణుకు కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలి’ అంటూ అట్టముక్కలు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అభిమానుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ రానున్న రోజులలో ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భారతి విష్ణువర్ధన్‌, అనిరుద్ధ, చట్టసభ ప్రతినిధులు ప్రతాప్‌ సింహ, రామదాస్‌, నాగేంద్ర, జీటీ దేవేగౌడ, విష్ణు అభిమానుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని