logo

రాహుల్‌ రణగర్జన

అవినీతిలో కూరుకుపోయిన భాజపా సర్కారును పెకిలించాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన విధానసభ ఎన్నికల నేపథ్యంలో తొలిసారి కర్ణాటకలో ప్రచారానికి కదలివచ్చారు.

Updated : 21 Mar 2023 02:13 IST

బెళగావిలో శ్రేణులకు దిశానిర్దేశం

ఈనాడు, బెంగళూరు : అవినీతిలో కూరుకుపోయిన భాజపా సర్కారును పెకిలించాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన విధానసభ ఎన్నికల నేపథ్యంలో తొలిసారి కర్ణాటకలో ప్రచారానికి కదలివచ్చారు. బెళగావిలో సోమవారం నిర్వహించిన ‘యువ క్రాంతి’ సమావేశంలో లక్షలాది అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘రూ.100 పనికి రూ.200 కమీషన్‌ తీసుకునే పాలనలో రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయారు. నేను గతేడాది అక్టోబరులో రాష్ట్రంలో చేపట్టిన భారత్‌ జోడో యాత్ర సందర్భంగా ప్రజలు ఈ ప్రభుత్వంపై ఏమేరకు అసంతృప్తిగా ఉన్నారో గుర్తించా. నాడు కన్నడిగులు నాపై చూపిన అభిమానాన్ని మరువలేను’ అని రాహుల్‌గాంధీ మరోమారు గుర్తు చేసుకున్నారు.

బెళగావి వేదికపై రాహల్‌, ఖర్గేతో పాటు కీలక నేతలు.. డీకే శివకుమార్‌,
సిద్ధరామయ్య, వేణుగోపాల్‌, మునియప్ప, సతీశ్‌ జార్ఖిహొళి

*పార్టీలోని నాయకులంతా సమష్టిగా ఎన్నికలను ఎదుర్కొంటే కాంగ్రెస్‌ అన్ని స్థానాల్లోనూ ఘన విజయం సాధిస్తుందని రాహుల్‌ అన్నారు. అవినీతి సర్కారును తొలగించేందుకు మీరు ఏ జిల్లాలో ప్రచారం చేయాలన్నా వస్తానని పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. జోడో యాత్ర సందర్భంగా ఎంతటి స్పందన లభించిందో అదే స్థాయిలో ఎన్నికల ప్రచారం చేయాలన్నారు. ‘భారత్‌ జోడో యాత్ర సందర్భంగా యువకులు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, గృహిణులు.. ఇలా అన్ని వర్గాల వారితో వ్యక్తిగతంగా చర్చించా. ప్రజల సమస్యలను ఓ జాబితాగా రూపొందించుకున్నా. రాష్ట్రంలో మాకు అధికారం ఇస్తే వారు ఎదుర్కొనే వాస్తవ సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రతి పేదింటి మహిళకు రూ.2వేలు అందించే గృహలక్ష్మి, ఉచితంగా 10 కిలోల బియ్యం సమకూర్చే అన్నభాగ్య, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇచ్చే గృహజ్యోతి పథకాలను ప్రకటించాం. నిరుద్యోగుల కోసం యువనిధి పథకం ద్వారా రూ.3వేల నెల భృతి అందిస్తాం. అధికారంలోని వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 2.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు.

కర్ణాటకలో త్వరలో నిర్వహించే ఎన్నికలపై దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని, ఆ ఫలితాలు దేశ భవిష్యత్తుపై స్పష్టమైన సంకేతాలు ఇస్తాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే ఈ సందర్భంగా వివరించారు. ‘నేను ఏఐసీసీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత తొలిసారి బెళగావికి వస్తున్నా. వందేళ్ల కిందట మహాత్మాగాంధీ 39వ కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షులుగా ఎన్నికైన సమావేశాన్ని ఈ ప్రాంతంలోనే నిర్వహించారు. నేనూ అంతటి మహనీయుడి అడుగు జాడల్లోనే నడిచే అదృష్టాన్ని ప్రజలు కల్పించారు. ఈ ప్రాంతంలో ప్రతి ఎన్నికల్లోనూ 15-16 క్షేత్రాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తూ వచ్చింది. ఈసారి కూడా మొత్తం 18 స్థానాల్లో గెలుస్తుంది’ అని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. భాజపా ఎమ్మెల్యేలు అవినీతి కేసుల్లో చిక్కినా ప్రభుత్వం వారికి రక్షణ కల్పిస్తోందని తప్పుపట్టారు. విపక్ష సభ్యులపై ఈడీ, సీబీఐలతో వేధింపులకు గురి చేస్తుందన్నారు. కిత్తూరు రాణి చెన్నమ్మ, సంగొళ్లి రాయణ్ణ, బళవాడి మల్లమ్మ వంటి వీరుల పుణ్యభూమిలో పుట్టిన వారు ఇలాంటి బెదిరింపులకు భయపడరని ఖర్గే భాజపాకు సవాలు చేశారు.

యువనిధి కార్యక్రమానికి కదలివచ్చిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు

సర్వం.. అవినీతిమయం

అవినీతితో రాష్ట్రాన్ని దోచుకుంటున్న భాజపా సర్కారు ఆ డబ్బుతో మరోమారు అధికారంలోనికి వచ్చేందుకు ప్రయత్నిస్తోందని విపక్ష నేత సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. మతం పేరిట యువకులను ఉద్రేకపరిచి అధికారంలోనికి వచ్చిన భాజపా ఆపై వారికి ఉపాధి ఇవ్వకుండా మోసగించిందన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి దక్కాలని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉపాధి దొరకని యువకులు విదేశాలకు వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కారణంగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతి వారం రాష్ట్రానికి వస్తున్నారని నిందించారు. గతంలో వరదలు, ఆక్సిజన్‌ కొరతతో ప్రజలు మృతి చెందినా వారిని పరామర్శించేందుకు మోదీ రాలేకపోయారని తప్పుపట్టారు.

* బెళగావి సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మాట్లాడుతూ యువకుల కోసం కాంగ్రెస్‌ ప్రత్యేక ప్రణాళికను తయారు చేసిందన్నారు. ప్రైవేటు రంగంలోనూ యువకులకు ఉపాధి అందించే ప్రత్యేక చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. రాజీవ్‌గాంధీ పాలనలో 18ఏళ్ల యువకులకు ఓటు హక్కు కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌, రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా, విధానపరిషత్తు విపక్ష నేత బి.కె.హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని