logo

HD Kumaraswamy: మా కుటుంబంలో చీలికకు ‘శకుని’ యత్నం: కుమారస్వామి

తమ కుటుంబంలో చీలికలు తెచ్చేందుకు ఓ ‘శకుని’ ప్రయత్నిస్తున్నాడని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ధ్వజమెత్తారు. తన భార్య భవానీకి హాసన నుంచి టికెట్‌ ఇవ్వకపోతే ఆ స్థానంతో పాటు, హొళెనరసీపుర నుంచి తనకు టికెట్‌ ఇవ్వాలని తన సోదరుడు హెచ్‌డీ రేవణ్ణ కోరిన విషయం తనకు తెలియదన్నారు. హాసన నుంచి పోటీకి తన వదిన భవానీ ఏడాదిన్నర కిందటే కోరగా నిరాకరించానని చెప్పారు.

Updated : 12 Apr 2023 08:32 IST

నిప్పులు చెరిగిన కుమార

హుబ్బళ్లి, న్యూస్‌టుడే : తమ కుటుంబంలో చీలికలు తెచ్చేందుకు ఓ ‘శకుని’ ప్రయత్నిస్తున్నాడని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ధ్వజమెత్తారు. తన భార్య భవానీకి హాసన నుంచి టికెట్‌ ఇవ్వకపోతే ఆ స్థానంతో పాటు, హొళెనరసీపుర నుంచి తనకు టికెట్‌ ఇవ్వాలని తన సోదరుడు హెచ్‌డీ రేవణ్ణ కోరిన విషయం తనకు తెలియదన్నారు. హాసన నుంచి పోటీకి తన వదిన భవానీ ఏడాదిన్నర కిందటే కోరగా నిరాకరించానని చెప్పారు. హాసన నుంచి పార్టీ కార్యకర్త స్వరూప్‌ను పోటీకి దించుతామని స్పష్టం చేశారు. హుబ్బళ్లిలోని సిద్ధారూఢ మఠానికి ఆయన మంగళవారం వచ్చారు. అనంతరం తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు.

స్వరూప్‌ నిజాయతీపరుడైన కార్యకర్త అని అభివర్ణించారు. మహాభారతంలో ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న సమయంలో సోదరుడు హెచ్‌డీ రేవణ్ణ పక్కన చేరి ఆయనకు బ్రెయిన్‌ వాష్‌ చేస్తున్న శకునులు ఎవరో తనకు తెలుసన్నారు. తన తండ్రి దేవేగౌడ కూడా తన సోదరుడి మనసు మార్చలేకపోవడం దురదృష్టకరమని అన్నారు. భవానీకి గతంలో జిల్లా పంచాయతి సభ్యురాలిగా అవకాశం ఇచ్చామని ప్రజ్వల్‌కు లోక్‌సభ సభ్యునిగా, మరో కుమారుడు సూరజ్‌కు ఎమ్మెల్సీగా, రేవణ్ణకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. అభిమానులు, శ్రేయోభిలాషుల పేరిట బయటి వ్యక్తులే తమ కుటుంబంలో చిచ్చు పెడుతూ, హాసన సీటు కోసం పట్టుబట్టాలని రేవణ్ణకు నూరిపోస్తున్నారని విమర్శించారు. మా కుటుంబ ప్రతిష్ఠను దిగజార్చేందుకే బయటి వ్యక్తులు ఇలా చేస్తున్నారని ఆక్రోశించారు.

హాసన టికెట్‌ కేటాయింపు అంశంలో దేవేగౌడదే తుది నిర్ణయమని చెప్పారు. భార్యను పోటీ నుంచి విరమించుకోవాలని చెప్పేందుకు తన అన్న భయపడుతున్నట్లు ఉందన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు నేను రోజుకు 17 గంటలు శ్రమిస్తున్నానని తెలిపారు. హాసన టికెట్‌ ఖరారు కాకపోవడంతోనే జాబితా విడుదలలో జాప్యం జరిగిందన్నారు. బుధవారం సాయంత్రానికి తమ రెండో జాబితాను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు. మాజీ ప్రధాని దేవేగౌడ ఈ నెల 22 నుంచి కొన్ని నియోజకవర్గాలలో ప్రచారాన్ని చేస్తారని కుమారస్వామి ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా రేవణ్ణ, సిద్ధరామయ్య ఇద్దరూ మంచి స్నేహితులు. సిద్ధరామయ్యను ఉద్దేశించే శకుని అని కుమారస్వామి వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకుల అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని