logo

Karnataka Elections: టిక్‌..టిక్‌..టిక్‌.. ఆ నాలుగు చోట్ల నరాలు తెగే ఉత్కంఠ

జిల్లాలోని ఐదు విధానసభ క్షేత్రాల్లో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అభ్యర్థులతోపాటు ఓటర్లు, దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్న కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి.

Updated : 13 May 2023 07:24 IST

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లాలోని ఐదు విధానసభ క్షేత్రాల్లో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అభ్యర్థులతోపాటు ఓటర్లు, దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్న కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈనేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో తాజా పరిస్థితిపై విశ్లేషణాత్మక కథనం. బళ్లారి గ్రామీణ, సిరుగుప్ప, కంప్లి, సండూరు విధాన క్షేత్రాల్లో కాంగ్రెస్‌- భాజపా అభ్యర్థుల మధ్య నువ్వా-నేనా అన్న విధంగా పోటీ నెలకొంది..బళ్లారి నగరంలో కాంగ్రెస్‌, భాజపా, కేఆర్‌పీపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. గెలుపుపై ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. పోలీసులు, నిఘా వర్గాల మధ్య సండూరు, సిరుగుప్ప విధాన క్షేత్రాల్లో కాంగ్రెస్‌ను అనుకూలంగా ఉంటుందని ఓ అంచనాకు వచ్చారు. కంప్లి, బళ్లారి గ్రామీణ విధానసభ క్షేత్రాల్లో భాజపా- కాంగ్రెస్‌ మధ్య నువ్వా-నేనా అన్న విధంగా నెలకొంది, బళ్లారి నగర విధానసభ క్షేత్రంలో కేఆర్‌పీపీ- కాంగ్రెస్‌ మధ్య పోటీ నెలకున్నా..భాజపా మాత్రమే తమకు అనుకూల ఓటు బ్యాంకు ఉంటుందని భావిస్తోంది.  

* కంప్లి విధానసభ క్షేత్రంలో భాజపా అభ్యర్థి టి.హెచ్‌.సురేశ్‌బాబు, కాంగ్రెస్‌ అభ్యర్థి జె.ఎన్‌.గణేశ్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకుంది. భాజపా అభ్యర్థి టి.హెచ్‌.సురేశ్‌బాబు 2018 విధానసభ ఎన్నికల్లో జరిగిన తప్పులు అనురావృతం కాకుండా ప్రతి విషయంలో జాగ్రత్త పడ్డారు. కాంగ్రెస్‌ అభ్యర్థి 2018 విధానసభ ఎన్నికలతో పోల్చిస్తే ఎక్కువగా శ్రమించారు. కొంత మంది సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా ప్రచారం చేశారు. జిల్లాలో ఈ క్షేత్రంలో అత్యధిక పోలింగ్‌ శాతం జరిగింది. ఎవరి గెలిచినా 5వేలు ఆధిక్యతతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి.

* సిరుగుప్ప విధానసభ క్షేత్రంలో భాజపా అభ్యర్థి ఎం.ఎస్‌.సోమలింగప్ప- కాంగ్రెస్‌ అభ్యర్థి బి.ఎం.నాగరాజ మధ్య పోటీ తీవ్రంగా ఉంది..ఈ క్షేత్రంలో ఎవరూ వరుసగా రెండు సార్లు గెలిచిన దాఖలాలు లేవు. భాజపా అభ్యర్థి, శాసనసభ్యుడు ఎం.ఎస్‌.సోమలింగప్పకు అనుకూలంగా వాతావరణ ఉన్నా..కుమారుల దూకుడు కారణంతో కొద్దిగా వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్‌ అభ్యర్థి బి.ఎం.నాగరాజ క్షేత్రం ప్రజలకు అనుకూలంగా ఉన్నారు. ఎలాంటి వ్యతిరేకత లేదు. ఇక్కడ ఎక్కువ మంది భూస్వాములతో పాటు, సిరుగుప్ప పట్టణంలో రైస్‌ మిల్లులు ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటున్నట్లు భావిస్తున్నా...ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

* బళ్లారి గ్రామీణ విధానసభ క్షేత్రంలో భాజపా అభ్యర్థి, మంత్రి బి.శ్రీరాములు, కాంగ్రెస్‌ అభ్యర్థి బి.నాగేంద్ర మధ్య నువ్వా-నేనా అన్న విధంగా పోటీ నెలకొంది.ఈ క్షేత్రంలో మైనార్టీ ఓటర్లు కీలకం(ముస్లిం, క్రిస్టయన్లు). బళ్లారి నగర కౌల్‌బజార్‌లోనే ముస్లిం ఓటర్లు 50వేలకు పైగా ఉన్నారు. క్రిస్టియన్లు 15వేల మందికిపైగా ఉన్నారు. కౌల్‌బజార్‌లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేసినట్లు సమాచారం గ్రామీణంలోని 63 చోట్ల సగం మంత్రికి, మిగిలిన గ్రామాల్లో కాంగ్రెస్‌కు అనుకూల ఓటు బ్యాంకు ఉంది. మంత్రి బి.శ్రీరాములుకు ముస్లిం ఓటర్లు సైతం 10 నుంచి 20 శాతం వేసినట్లు సమాచారం. ఇద్దరి మధ్య పోటీ నువ్వా-నేనా అన్న విధంగా మారింది.

* బళ్లారి నగర విధానసభ క్షేత్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థి నారా భరత్‌రెడ్డి, కేఆర్‌పీపీ అభ్యర్థి గాలి లక్ష్మీ అరుణ, భాజపా అభ్యర్థి గాలి సోమశేఖర్‌రెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్‌, భాజపాలకు 30 నుంచి 35వేల వరకు శాశ్వత ఓటు బ్యాంకు ఉంది. కేఆర్‌పీపీ కొత్తగా ఏర్పడినా అభ్యర్థి రెండు జాతీయ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చారు. ప్రతి ఓటరును కలిశారు. కాంగ్రెస్‌ పార్టీ 60 నుంచి 70 శాతం ఓటర్లను కలిశారు. భాజపా అభ్యర్థి ఓటర్లందరినీ కలవడం, గమనార్హం. 14,380 మందికి ఇళ్లు పట్టాలు అందజేశారు. కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్‌ నేతల మద్దతు కొరవడటం, పరోక్షంగా కేఆర్‌పీపీకి మద్దతు ప్రకటించడం వ్యతిరేక అంశాలు. మాజీ మంత్రి ముండ్లూరు దివాకర్‌బాబు అనుచరులు కేఆర్‌పీపీకి పూర్తి మద్దతు ప్రకటించి, లోలోపల ఓటర్లను కలిశారు. బళ్లారి నగర విధానక్షేత్రంలో ఫుట్‌బాల్‌ గుర్తుకు అనుకూల వాతావరణం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఎవరు గెలిచినా...5వేల ఆధిక్యతతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి.

* సండూరు విధానసభ క్షేత్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఇ.తుకారామ్‌, భాజపా అభ్యర్థి శిల్పా పాటీల్‌, కేఆర్‌పీపీ అభ్యర్థి కె.ఎస్‌.దివాకర్‌ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, శాసనసభ్యుడు ఇ.తుకారామ్‌ ఇప్పటికే మూడు సార్లు గెలుపొందినా..ప్రజల్లో వ్యతిరేకత లేదు. భాజపాలో బలమైన అభ్యర్థి లేక పోవడంతో పాటు, కె.ఎస్‌.దివాకర్‌ భాజపా టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నాలు చేసి కేఆర్‌పీపీ తరఫున పోటీలో నిలిచారు. దివాకర్‌ భాజపా ఓట్లు చీల్చే అవకాశాలు ఉండటంతో కాంగ్రెస్‌కు అనుకూలంగా వాతావరణం కనిపిస్తోంది.


కాయ్‌ రాజా కాయ్‌

బళ్లారి జిల్లాలో ఐదు విధానసభ క్షేత్రాల ఓట్ల లెక్కింపు శనివారం జరుగనుంది. ఈనేపథ్యంలో గెలుపోటములపై పందేలు జోరుగా సాగుతున్నాయి. బళ్లారి నగరం విధానసభ క్షేత్రంలో కేఆర్‌పీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులపై పందేలు కాస్తున్నారు. బళ్లారి గ్రామీణ విధానసభ క్షేత్రంలో బి.శ్రీరాములు, బి.నాగేంద్రల గెలుపుపైనా పందేలు కాస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని