logo

కరువు కాలంలో కావేరి చిచ్చు

తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయటం వెనుక సర్కారుకు ఏ లక్ష్యం ఉందో తెలీదు కానీ.. ఆ అంశంలో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. న్యాయస్థానం తీర్పును శిరసావహించాలంటే రాష్ట్ర రైతుల సమస్యలను ఫణంగా పెట్టినట్లేనని విపక్షాలు తూర్పారబడుతున్నాయి.

Published : 24 Sep 2023 05:19 IST

సర్కారును చుట్టుముట్టిన ఇక్కట్లు
విపక్షాలు, ప్రజా సంఘాల ఆందోళన

బొమ్మై, ఇతర నాయకులను తోడ్కొని వెళుతున్న పోలీసులు

ఈనాడు, బెంగళూరు : తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయటం వెనుక సర్కారుకు ఏ లక్ష్యం ఉందో తెలీదు కానీ.. ఆ అంశంలో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. న్యాయస్థానం తీర్పును శిరసావహించాలంటే రాష్ట్ర రైతుల సమస్యలను ఫణంగా పెట్టినట్లేనని విపక్షాలు తూర్పారబడుతున్నాయి. బెంగళూరులో, దిల్లీలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసినా ఆ తాలూకూ సహకారం భాజపా, జేడీఎస్‌ నుంచి అందకపోవటం సర్కారుకు ముందు నుయ్యి- వెనుక గొయ్యి పరిస్థితికి కారణమైంది. కావేరి జలాలను విడుదల చేసిన సర్కారును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా క్రమంగా ఆందోళనలు విస్తరిస్తున్నాయి. మొన్నటి వరకు మండ్యకే పరిమితమైన ఆందోళనలు శనివారం నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయి. శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో సర్కారు సానుకూల తీర్మానం తీసుకుంటుందని ఎదురుచూసిన రైతుల సంఘాలు అలాంటి శుభవార్త అందకపోవటంతో భగ్గుమన్నాయి. శనివారం ఈ సంఘాలకు భాజపా, కర్ణాటక రక్షణ వేదిక, చెరకు రైతుల సంఘం, ఆమ్‌ ఆద్మీపార్టీల, కర్ణాటక జలసంరక్షణ సమితి, కన్నడపర సంఘటనల సమితి తదితరాలన్నీ తోడై సర్కారుపై ఒత్తిడిని పెంచాయి. ఈనెల 26న బెంగళూరుతో సహా రాష్ట్రమంతటా ఆందోళనకు పిలుపునివ్వటంతో కావేరి వివాదం ఇప్పట్లో సద్దుమణిగే పరిస్థితి కనిపించడంలేదు.

తమిళనాడుకు కావేరి నీటి విడుదలను నిరసిస్తూ బంద్‌ నిర్వహించడంతో జిల్లా కేంద్రం మండ్య వీధులు వెలవెల

రాజకీయ మలుపు

రైతుల ఆందోళనను సున్నితంగా అడ్డుకోగలిగిన సర్కారు రాజకీయ ఆందోళనలపై కఠినంగా వ్యవహరిస్తోంది. అఖిల పక్ష సమావేశంలో విపక్షాలన్నీ రాజకీయాలు మరచి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పిన సర్కారు.. ఆ సమావేశం బయట భిన్నమైన స్పందన చవిచూస్తోంది. దిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, రాష్ట్ర ఎంపీలతో పలుమార్లు చర్చించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌.. నేడు వారి నుంచి వ్యతిరేకత చూస్తున్నారు. దిల్లీలో ప్రధానితో భేటీ చేయించే బాధ్యత మాదేనని హామీ ఇచ్చిన ప్రహ్లాద్‌ జోషి బయటకు వచ్చి కేంద్రం జోక్యం చేసుకోదని తెగేసి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప, బసవరాజ బొమ్మై తదితరులైతే కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ‘ఇండియా’లో సభ్యులైన డీఎంకేతో కాంగ్రెస్‌ నేత సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే ఎందుకు మాట్లాడలేకపోతున్నారని భాజపా ప్రశ్నిస్తోంది. మేకెదాటు కోసం పాదయాత్ర చేసి విధానసభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ తీరా అధికారంలో వచ్చాక రాష్ట్ర అవసరాల కంటే పొరుగు రాష్ట్ర శ్రేయస్సుకే ప్రాధాన్యమిచ్చినట్లు భాజపా నేత సీ.టి.రవి ఆరోపించారు. శనివారం భాజపా నేతలు బెంగళూరులో చేపట్టిన ఆందోళనలోనూ ఇదే ఆరోపణ చేస్తూ.. అఖిలపక్ష సమావేశంలో మేము ఇచ్చిన సలహాను పెడచెవిన పెట్టిన సిద్ధు సర్కారు- తమిళనాడు సర్కారు అడగకముందే నీటిని విడుదల చేసి నేడు కేంద్రం జోక్యం చేసుకోవాలనటం సరికాదన్నారు. ఎన్‌డీఏలో భాగస్వామి అయిన జేడీఎస్‌ ఈ అంశాన్ని మరింత వివాదం చేసేందుకు సిద్ధమవుతోంది. ‘హోం మంత్రి అమిత్‌ షాతో కావేరి విషయంపై చర్చించా. విపక్షాల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తే కేంద్రం నుంచి సహకారం దొరికేలా చేస్తా’నని కుమారస్వామి ప్రకటించారు. మండ్య జిల్లా రైతుల ఆందోళనకు జేడీఎస్‌ మద్దతిస్తూ- కావేరి వివాదాన్ని రాజకీయ ఆందోళనగా మార్చే ప్రయత్నం చేస్తోంది.

ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతున్న బొమ్మై

సర్కారు ఘోర వైఫల్యం: భాజపా

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కన్నడిగుల హితాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని భాజపా డిమాండు చేసింది. కావేరి ఆధారిత కేఆర్‌ఎస్‌లో నీటి నిలువలు లేవన్న అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం ముందు తెలియజేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప, మాజీ మంత్రులు అశ్వత్థ నారాయణ, గోపాలయ్య, గోవింద కారజోళ, మాజీ స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డే కాగేరి, లోక్‌సభ సభ్యుడు పీసీ మోహన్‌, ఎమ్మెల్యే ఎల్‌ఏ సుబ్రహ్మణ్య, మాజీ ఎమ్మెల్సీ అశ్వత్థనారాయణ, ఎమ్మెల్సీ ఛలవాది నారాయణ స్వామి తదితరులతో కలిసి పాత మైసూరు బ్యాంకు కూడలిలో శనివారం ధర్నా నిర్వహించారు. రాస్తా రోకోకు ప్రయత్నించిన భాజపా నాయకులు, కార్యకర్తలను అదుపునకు తీసుకుని బీఎంటీసీ బస్సులు ఎక్కించి హైగ్రౌండ్స్‌ ఠాణాకు తరలించారు.

ధర్నాలో భాజపా నాయకులు, కార్యకర్తల జోరు

వాస్తవాన్ని కప్పిపుచ్చారా?

కావేరి జలాల సమస్య కప్పిపుచ్చలేనిది. కావేరి నది ఉద్భవ ప్రాంతం కొడగులోనూ నాలుగేళ్లుగా నీటి సమస్య కనిపిస్తోంది. సర్కారు తాజాగా ప్రకటించిన కరవు ప్రాంతాల్లో కొడగులోని ఐదు తాలూకాలుండగా ఇందులో మడికేరి, విరాజపేట, కుశాల్‌నగర తాలూకాల్లో తీవ్ర కరవు తాండవిస్తోంది. సోమవారపేట, పొన్నంపేటలు సాధారణ కరవు ప్రాంతాల జాబితాలో ఉన్నాయి. రెండు తాలూకాల్లో కరవు పరిస్థితులున్నా వాటిని కరవు జాబితాలో చేర్చకపోవటంపై అభ్యంతరం వ్యక్తం అవుతోంది. కావేరి నది ఉద్భవ ప్రాంతంలోనే కరవు పరిస్థితి ఉండగా, మిగిలిన ప్రాంతాల దుస్థితి వర్ణనాతీతం. రెవెన్యూ, వ్యవసాయ, వాతావరణ విభాగాల సమీక్షల ప్రకారం కావేరి నది ఆయకట్టులో రానున్న రెండు నెలల వరకు కేవలం 13 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంటుందని అంచనా. సీడబ్ల్యూఎంఏ ఆదేశాల ప్రకారం నిత్యం ఐదు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే సెప్టెంబరు చివరి నాటికి డెడ్‌ స్టోరేజీ నీరు పోగా ఆరు టీఎంసీలు మాత్రమే మిగిలితే వాటిని బెంగళూరు నగరంతో పాటు మండ్య, చామరాజనగర, మైసూరు, శివమొగ్గ జిల్లాలకు ఎలా పంపిణీ చేస్తారని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర వాస్తవ పరిస్థితిని కప్పిపుచ్చిన సర్కారు సీడబ్ల్యూఎంఏ వద్ద బేలగా మారిందని మండ్య జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు.


కుమార ఆందోళన బాట

మండ్యలో నిర్వహించిన ధర్నాలో ప్రసంగిస్తున్న కుమారస్వామి

మండ్య, న్యూస్‌టుడే : కృష్ణరాజ సాగర జలాశయంలో నీటి నిలువలు తక్కువగా ఉన్నప్పటికీ తమిళనాడుకు నీటిని విడుదల చేయడాన్ని ఖండిస్తూ రైతు, కన్నడ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన బంద్‌ పిలుపునకు చక్కని స్పందన లభించింది. మండ్య, మద్దూరులలో విద్య, వ్యాపార సంస్థలు శనివారం మూసివేశారు. దిల్లీ నుంచి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కేఆర్‌ఎస్‌ జలాశయం వద్దకు వెళ్లి నీటి నిలువలను పరిశీలించారు. మండ్యలో రైతు హితరక్షణ సమితి నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొని ఆందోళనకారులకు మద్దతు ప్రకటించారు. రైతు, కన్నడ సంఘాల నిరసనకు విద్యార్థులు, పౌర సంఘాలు మద్దతు పలికాయి. నీటిని నిలిపి వేసేంత వరకు ఆందోళనను కొనసాగిస్తామని ఆందోళనకారులు తెలిపారు. కొన్ని చోట్ల నిరసనకారులు రస్తా రోకోకు విఫలయత్నం చేశారు. ఆందోళనలో మాజీ మంత్రులు జీటీ దేవేగౌడ, మునిరత్న, సీటీ రవి, యువ జనతాదళ్‌ అధ్యక్షుడు నిఖిల్‌ గౌడ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని