logo

నేటితో ప్రచారం.. పరిసమాప్తం

రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు.

Published : 24 Apr 2024 05:52 IST

మండ్య జిల్లా మళవళ్లిలో మంగళవారం దళ్‌ నేత కుమారస్వామి రోడ్‌షో

ఈనాడు, బెంగళూరు : రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు. భాజపా అగ్రనేత అమిత్‌ షా బెంగళూరులో పలుచోట్ల రోడ్‌షోలో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి ఆయన బెంగళూరు దక్షిణ స్థానంలో తేజస్విసూర్య తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. బుధవారం తుమకూరులో పర్యటిస్తారు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా చిత్రదుర్గలో ప్రచారం చేశారు. అంతకు ముందు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ రాష్ట్ర బాధ్యుడు రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా విధానసౌధ సమీపాన కేంద్ర సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తుమకూరులో ప్రచారం చేశారు. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ రామనగరలో, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మండ్య జిల్లాలో ప్రచారం చేశారు. వీరంతా తొలివిడత ఎన్నికల కోసం కసరత్తు చేశారు.

గోబ్యాక్‌ పీఎం

సరిగ్గా కరవు పరిహారంపై సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వెల్లడైన సందర్భంలోనే ఎన్నికల ప్రచారం ఊపందుకోవటంతో ఇరు పార్టీలకు ఆ అంశం ఓ అస్త్రంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌ షాను నిలదీస్తూ.. రాష్ట్రానికి పరిహారం చెల్లించే వరకు ప్రచారానికి రావొద్దని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ బెంగళూరులో గోబ్యాక్‌ పీఎం, గోబ్యాక్‌ షా.. అంటూ ప్రచారాన్ని కాస్త ఆందోళనగా మార్చింది. మరోవైపు ప్రజాధ్వని పేరిట ముఖ్యమంత్రి సాగిస్తున్న ప్రచారం బెంగళూరు, తుమకూరుల్లో జోరందుకుంది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో రైతుల సమస్యలను పట్టించుకోని భాజపా నేడు ఓట్ల కోసం ఎలా రాగలుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన వేలకోట్ల పరిహారాన్ని నిర్బంధించిన కేంద్రం సుప్రీం కోర్టు జోక్యంతో మాత్రమే స్పందించింది. రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో భాజపాకు 25స్థానాల గెలుపు కట్టబెడితే వారి చేతికి ఖాళీ చెంబు ఇచ్చిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. రాష్ట్రం నుంచి వసూలు చేసే రూ.100లో కేవలం రూ.13లను మాత్రమే తిరిగి ఇచ్చే ఎన్‌డీఏ సర్కారుకు ఈ ఎన్నికల్లో ఓట్లడిగే నైతికత లేదని కాంగ్రెస్‌ ఆరోపించింది.

మోదీ మరో విడత..

ఇప్పటికే తొలి విడత ప్రచారాన్ని ముగించిన ప్రధాని నరేంద్ర మోదీ రెండో విడత ఎన్నికల కోసం ఈనెల 28, 29 తేదీల్లో రాష్ట్రానికి రానున్నారు. రెండు రోజుల పాటు దావణగెరె, కార్వార, బెళగావి, విజయపుర, కలబురగిల్లో ప్రధాని ప్రచారం చేస్తారు. ఈ పర్యటనల్లో ఉత్తర కర్ణాటకలోని కనీసం 10 స్థానాలకు చెందిన అభ్యర్థులను వేదికలపై ఆహ్వానించి వారి తరపున ప్రధాని ప్రసంగిస్తారు. ఈ సమావేశాల్లో కిత్తూరు, కల్యాణ కర్ణాటక, మధ్య కర్ణాటక ప్రాంతాల ప్రచారంలో సగానికి సగం పూర్తి చేస్తారని భాజపా వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని