logo

మోదీ అబద్ధాలతో మభ్యపెడతారు

ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పి మభ్యపెడతారు, కాంగ్రెస్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.

Published : 01 May 2024 02:28 IST

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది: సిద్ధు

గంగావతిలో ప్రజాధ్వని యాత్ర ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

గంగావతి,న్యూస్‌టుడే: ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పి మభ్యపెడతారు, కాంగ్రెస్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన మంగళవారం రాత్రి గంగావతి ప్రజాధ్వని యాత్రలో పాల్గొని మాట్లాడారు. ‘విదేశాల నుంచి నల్లధనం తెచ్చి అందరి ఖాతాలకు రూ.15లక్షలు వేస్తామన్నారు. రూ.15సైతం ఇవ్వలేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు చొప్పున పదేళ్లలో 20 కోట్ల మందికి ఉపాధి కత్పించాలి. 20 లక్షల మందికీ ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగాలు ఇవ్వండంటే పకోడా, బోండాలు అమ్ముకోండంటూ భాద్యతారాహిత్యంగా అంటున్నారు. ఆయన యువతకు పంగనామాలు పెట్టినా వారు మోదీ, మోదీ అంటూ నినాదాలు చేస్తున్నారన్నారు. మోదీ భరోసా ప్రకారం రైతుల ఆదాయం రెండింతలయిందా అని ప్రశ్నించారు. భారతదేశం చరిత్రలో అసత్యాలు పలికే ప్రధానిని నేను చూడలేదు’ అన్నారు. బళ్లారిని అధోగతి పాలు చేసిన జనార్దన్‌రెడ్డిని గెలిపించిన గంగావతి ఓటర్లు దురదృష్టవంతులన్నారు. బళ్లారిలో వారు చేసిన పాపాలకు శిక్ష పడాలని తాను పాదయాత్ర చేసినట్లు గుర్తుచేశారు. తాను కొప్పళ నుంచి లోక్‌సభకు పోటీ చేసిన సమయంలో పార్టీలకు అతీతంగా మద్దతు ఇచ్చారన్నారు. ప్రస్తుతం బిన్నాభిప్రాయాలన్నీ మరచి కాంగ్రెస్‌ అభ్యర్థి రాజశేఖర్‌ ఇహిట్నాళ్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు శివరాజ్‌ తంగడిగి, భైరతి సురేశ్‌, అమరేగౌడ, మల్లికార్జున నాగప్ప, శ్రీనాథ్‌, లలితారాణి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని