logo

దారుణం.. దాచేస్తే దాగని నిజం: ప్రజ్వల్‌ ఉదంతంలో ఘోరాలెన్నో..

జనతాదళ్‌ నుంచి ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను మంగళవారం సస్పెండ్‌ చేసిన వెంటనే- ప్రత్యేక దర్యాప్తు దళం దర్యాప్తు వేగం పుంజుకుంది.

Updated : 01 May 2024 13:08 IST

గళూరు : ప్రజ్వల్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల ధర్నా

హాసన, న్యూస్‌టుడే : జనతాదళ్‌ నుంచి ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను మంగళవారం సస్పెండ్‌ చేసిన వెంటనే- ప్రత్యేక దర్యాప్తు దళం దర్యాప్తు వేగం పుంజుకుంది. దర్యాప్తునకు 18 మంది అధికారులను ప్రత్యేకంగా నియమించారు. హొళెనరసీపుర ఠాణాలో ఫిర్యాదు చేసిన బాధితురాలి (47) వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా ఉన్న హెచ్‌డీ రేవణ్ణకు సిట్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందిన 24 గంటల్లో విచారణకు హాజరు కావాలని సూచించింది. ప్రజ్వల్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ, విద్యార్థి సంఘాలు బెంగళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లా కేంద్రాల్లో ధర్నా, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.

వీడియోలు ఎలా?

ప్రజ్వల్‌ వ్యక్తిగత కారు డ్రైవరుగా కార్తిక్‌ పని చేసేవాడు. హెచ్‌డీ రేవణ్ణ కుటుంబానికి ఆ యువకుడు బినామీ అన్న అనుమానం ఉండేది. తన చరవాణిని కార్తిక్‌కు అప్పగించి.. ప్రజ్వల్‌ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆ సమయంలోనే ప్రజ్వల్‌ చరవాణిలో ఉన్న వీడియోలు, చిత్రాలను తన చరవాణికి కార్తిక్‌ బదిలీ చేసుకున్నాడు. నిరుడు కార్తిక్‌, అతని కుటుంబ సభ్యులను రేవణ్ణ కుటుంబం నిర్బంధించి, అతని పేరిట ఉన్న పొలాలు, స్థలాలు బలవంతంగా రాయించుకుందనే అపవాదు ఉంది. దీనిపై ఆయన పోలీసు ఠాణాలో కేసు పెట్టారు. తన వద్ద ఉన్న వీడియోలను హాసన భాజపా నాయకుడు, న్యాయవాది దేవరాజేగౌడకు కార్తిక్‌ అందజేశాడు. దేవరాజేగౌడ వాటిని కొందరు భాజపా నాయకులకు గత ఏడాది డిసెంబరు 8న అందజేశారు. ప్రజ్వల్‌కు టికెట్‌ ఇచ్చేందుకు అంగీకరించవద్దని, ప్రీతంగౌడకు ఇవ్వాలని కోరారు. అశ్లీల వీడియో చిత్రాలను తాము బయటకు విడుదల చేయలేదని దేవరాజేగౌడ, కార్తిక్‌ స్పష్టం చేశారు. కొందరు నాయకుల ద్వారానే అవి బయటకు వచ్చాయని అనుమానిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందించి.. ‘కొందరు భాజపా నాయకులే వాటిని విడుదల చేశారు’ అన్న అనుమానాన్ని హుబ్బళ్లిలో వ్యక్తం చేశారు.

చేదు నిజాలు

పెన్‌డ్రైవ్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోల్లో ప్రజ్వల్‌తో కనిపించిన వారిలో ఎక్కువ మంది ఉద్యోగినులు, ఉద్యోగాల కోసం వచ్చిన యువతులు ఉన్నారని ప్రాథమిక విచారణలో గుర్తించారు. బదిలీ, పదోన్నతులు కోరుతూ వచ్చిన వారి నుంచి తన శారీరక వాంఛలను తీర్చుకున్నాడని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వీడియోల్లో కొన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతూ ఉండడంతో బాధిత మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. తమ విషయం బయటపడితే సంసారాలు వీధిన పడతాయని భయపడుతున్నారు.

హుబ్బళ్లి : ప్రజ్వల్‌పై చర్యలకు డిమాండు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి

బసచేసిన ఓ హోటల్‌ వద్దకు కాంగ్రెస్‌ కార్యకర్తలు దూసుకొచ్చిన వేళ..

అడ్డుతగిలిన జనతాదళ్‌ కార్యకర్తలు, పోలీసులు

మహిళా కమిషన్‌ నోటీసులు

బెంగళూరు (శివాజీనగర): ప్రజ్వల్‌ రేవణ్ణ, హెచ్‌డీ రేవణ్ణలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సమగ్ర వివరాలు ఇవ్వాలని కర్ణాటక పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ అలోక్‌ మోహన్‌కు జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. వీడియోలు వైరల్‌ కాకుండా అడ్డుకోవాలని, వాటిని విస్తృతం చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. వీడియోల్లో ఉన్న యువతుల గోప్యతను దృష్టిలో ఉంచుకుని సైబర్‌ క్రైం నిపుణుల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు.

కృష్ణ భైరేగౌడ ఫైర్‌..

హావేరి: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే హిందూ మహిళల మాంగల్యాన్ని తెంచుకుంటుందని ప్రచారం చేస్తున్న మోదీ ఇప్పుడు ప్రజ్వల్‌ రేవణ్ణ చేసిన అకృత్యాలకు బదులివ్వాలని రెవెన్యూ మంత్రి కృష్ణ భైరేగౌడ హావేరిలో సవాల్‌ విసిరారు. ప్రజ్వల్‌కు టికెట్‌ ఇవ్వవద్దని స్థానిక భాజపా నాయకులు చేసిన సిఫార్సులను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రజ్వల్‌ చేతిలో సుమారు 500 మంది లైంగిక వేధింపులకు గురయ్యారని తెలిపారు. ఈ వీడియోలు నాలుగేళ్ల కిందటివని హెచ్‌డీ రేవణ్ణ చెప్పడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. నాలుగేళ్ల కిందటివైతే దర్యాప్తు చేయకూడదా అని ప్రశ్నించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌ విదేశాలకు వెళ్లేందుకు ఎవరు సహకరించారో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. మీ మిత్రపక్షం అభ్యర్థి (ప్రజ్వల్‌్) ఆరు వందల మంది చీరలను లాగాడు.. ఇదేనా మీరు చెబుతున్న అచ్ఛేదిన్‌ అంటూ కేంద్ర మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం ప్రధానిని ప్రశ్నించారు. తాను చేసిన ప్రచారంతో కుమారస్వామి 17 సీట్లు దక్కించుకున్నారని, ఇప్పుడు గతిలేని భాజపాతో మతిలేని ఆయన పొత్తు కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు.

రాకేశ్‌ కేసు మాటేంటి?

హుబ్బళ్లి: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు రాకేశ్‌ విదేశాల్లో అనుమానాస్పదంగా మరణించినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాయం చేశారని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి గుర్తుచేశారు. ప్రజ్వల్‌ కేసుతో పాటు రాకేశ్‌ మరణానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాకేశ్‌ విదేశాల్లో మరణించాడు. ఆ సమయంలో మోదీ పరామర్శించారని.. ఎటువంటి సాయం చేయలేదు’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెళగావిలో స్పష్టం చేశారు.


కుమారకు సెగ

హుబ్బళ్లి, న్యూస్‌టుడే : హుబ్బళ్లిలో జనతాదళ్‌ కోర్‌ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యేందుకు ఓ హోటల్‌ వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రజ్వల్‌ను జర్మనీ నుంచి వెనక్కు పిలిపించండి అంటూ నినాదాలు చేశారు. హాసనలో తప్పు చేసిన వ్యక్తిపై ఇప్పటికే ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిందని, ఆ ఘటనకు తమకు ముడిపెట్టవద్దని కుమారస్వామి కోరారు. బాధిత యువతులకు కౌన్సెలింగ్‌ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని