logo

మలిమడత మహా ప్రచారం

ఎన్నికల వేళ పార్టీల ప్రచార రథాలన్నీ వాయువేగంతో పరుగెడుతున్నాయి. పార్టీల దిగ్గజ నేతలు ఒక్కొక్కరుగా రాష్ట్రానికి వచ్చి వెళుతున్నారు.

Published : 01 May 2024 02:38 IST

ప్రచారరథాల పరుగుల జోరు
నేతల నోట మాటల తూటాలు

ఈనాడు, బెంగళూరు : ఎన్నికల వేళ పార్టీల ప్రచార రథాలన్నీ వాయువేగంతో పరుగెడుతున్నాయి. పార్టీల దిగ్గజ నేతలు ఒక్కొక్కరుగా రాష్ట్రానికి వచ్చి వెళుతున్నారు. వారి ప్రచారానికి కొనసాగింపుగా రాష్ట్ర నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో నేతల విమర్శలను అందుకుంటున్న పార్టీల సామాజిక మాధ్యమాలు వైవిధ్య పోస్టులతో ప్రచారానికి కొంత హంగులు అద్దుతున్నాయి. ఇంకో ఐదు రోజుల్లో ముగిసే బహిరంగ ప్రచారంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతల ప్రసంగాలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతూ పార్టీల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతూ.. గురువారం ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో నేతలు మధ్యాహ్న వేళల కంటే సాయంత్రాల్లో ప్రచారాన్ని చేపట్టాలని నిర్ణయించటం గమనార్హం.

మోదీపై నిప్పులు

కాంగ్రెస్‌పై క్రమం తప్పకుండా విమర్శలు గుప్పించే ప్రధానమంత్రి మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి విరుచుకుపడ్డారు. మంగళవారం ఆయన కలబురగి, మైసూరుతో పాటు చత్తీస్‌ఘడ్‌లోని చంపాలను చుట్టేసి రాత్రి కలబురగిలోని వాడి ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ గతంలో హైదరాబాద్‌కు వెళ్తూ మార్గ మధ్యంలో అడుగుపెట్టినట్లు ఖర్గే గుర్తు చేశారు. ఆ చిత్రాలను పార్టీ ప్రచారంలో చూపాలని అక్కడి నేతలకు సూచించారు. అనంతరం రాజ్యాంగం గురించి మాట్లాడుతూ భారతీయత పునాదులను కూలదోయడానికి భాయపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పదేళ్లుగా దేశానికి సంబంధించిన సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నట్లు మోదీ రొమ్ము విరిచి మాట్లాడుతుంటారని, ఆయన రొమ్ము ఆయన వద్దనే ఉంచుకోవాలని, మాకు ప్రజల సేవలు చేసే నేతలుంటే చాలన్నారు. చేసిన పనులకు ప్రచారం చేసుకునే నేతలు కాకుండా నిశ్శబ్దంగా సేవలందించే వారు దేశానికి కావాలన్నారు. కాంగ్రెస్‌ వేసిన బాటలోనే నేడు ప్రధాని విమానాలు, ఓడరేవులు, జాతీయ రహదారులు నిర్మిస్తున్నారని గుర్తుచేశారు. అది ఆయన ఘనతగా చెప్పుకోవడం సరికాదన్నారు. ఆయనేమీ కోట్లాది మందికి ఉద్యోగాలు, ఉపాధి హామీ ద్వారా వేతనాలు అందించలేదని గుర్తు చేశారు. దేశంలోని పేదలకు ఏం చేయకూడదో అది మోదీ చేశారన్నారు.


బెళగావి : కాంగ్రెస్‌ అభ్యర్థి మృణాల్‌ హెబ్బాళ్కర్‌కు మద్దతుగా ప్రచారం ప్రారంభించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఘన సత్కారం

సిద్ధు సవాల్‌

మోదీని విమర్శించే బాధ్యత మోస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ఆ క్రమంలో భాజపాపై విమర్శలు గుప్పించారు. బెళగావిలోని గోకాక్‌, కొప్పళ తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన తన 50ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీ వంటి అబద్ధాల కోరు నేతను చూడలేదన్నారు. పేదల కోసం కాంగ్రెస్‌ తెచ్చిన గ్యారంటీలను విమర్శించే భాజపాకు ప్రజల సంక్షేమం అంటే గుర్తుకు రాదన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఎంత అన్యాయం చేసిందో ఈ ఎన్నికల సమయంలో ప్రజలు గుర్తించారన్నారు. మణిపూర్‌లో హింసను నియంత్రించలేని భాజపా నేడు హుబ్బళ్లిలో సంఘటనపై ప్రచారం చేస్తోంది. వీరికి సున్నితమైన సంఘటనను రాజకీయం ఎలా చేయాలో తెలుసని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ప్రజ్వల్‌ రేవణ్ణ అంశంపై ఆందోళన చేపడుతూ భాజపా, జేడీఎస్‌ల మైత్రిని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం చేసింది.

నేరస్థుల అడ్డా..

ఇండియా కూటమి అంటే నేరస్థుల నాయకత్వానికి అడ్డా అంటూ భాజపా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆరోపించారు. ఆయన భాజపా తరఫున ప్రచారాన్ని కొనసాగిస్తూ శివమొగ్గ, హావేరి జిల్లా బ్యాడిగిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ నేతలు, ఇండియా కూటమిలోని భాగస్వాములంతా నేర చరిత్ర కలిగిన వారేనన్నారు. ఈ కూటమికి అధికారం వస్తే దేశంలో అవినీతి తప్ప అభివృద్ధి సాధ్యపడదని ఆరోపించారు. భాజపా వల్ల దేశం మరో 50 ఏళ్ల దార్శనికతను చూస్తే..కాంగ్రెస్‌తో 75ఏళ్ల వెనక్కు వెళ్లాల్సి వస్తుందంటూ ఆరోపించారు. పార్టీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, బసవరాజ బొమ్మై, శివమొగ్గ అభ్యర్థి రాఘవేంద్ర తదితరులు ఈ ప్రచారాల్లో పాల్గొన్నారు. మరోవైపు భాజపా సామాజిక మాధ్యమ విభాగం కాంగ్రెస్‌ పార్టీ గత ఏడాదిలో ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీకి చెందిన రూ.23వేల కోట్లకుపైగా నిధులను మళ్లించి ఆ సముదాయాల అభివృద్ధిని అడ్డుకుందని ఆరోపించింది. ఈ పార్టీతో జతకట్టిన జేడీఎస్‌ నేతలు ప్రజ్వల్‌ రేవణ్ణను తొలగించి కాంగ్రెస్‌పై యథావిధిగా విమర్శలు చేశారు.

బ్యాడగి : హావేరిలో భాజపా అభ్యర్థి బసవరాజ బొమ్మై తరఫున రోడ్‌షోలో పాల్గొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

జోషి తీవ్ర ఆరోపణ..

హుబ్బళ్లి : ఎంపీ ప్రజ్వల్‌ను రక్షించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య- మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ మధ్య ఒప్పందం కుదిరిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆరోపించారు. ఆయన హుబ్బళ్లిలో విలేకరులతో మంగళవారం మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజ్వల్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఆయన విదేశాలకు వెళుతున్నట్లు సమాచారం ఉన్నా ఎందుకు నిర్బంధించలేదో ప్రజలకు బదులివ్వాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని