logo

ఆసాంతం.. ప్రశాంతం

బళ్లారి లోక్‌సభ సార్వత్రిక ఎన్నిక సోమవారం ఉదయం సజావుగా ప్రారంభమైంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ముగిసింది. సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు వారంతా ఓటు వేయడానికి అవకాశం కల్పించారు.

Published : 08 May 2024 02:18 IST

ఓటెత్తిన మహిళా లోకం
సాయంత్రం 5 గంటలు 68.94 శాతం
పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు

బళ్లారి : ఓటు వేసిన భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు, సతీమణి, కుమారుడు... ఓటు వేయడానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి లోక్‌సభ సార్వత్రిక ఎన్నిక సోమవారం ఉదయం సజావుగా ప్రారంభమైంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ముగిసింది. సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు వారంతా ఓటు వేయడానికి అవకాశం కల్పించారు. బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 1,972 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారిలో 299 సూక్ష్మ, 69 అతి సూక్ష్మ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా, సూక్ష్మ, అతి సూక్ష్మ పోలింగ్‌ కేంద్రాల వద్ద స్థానిక పోలీసులు, హోంగార్డులతో పాటు కేంద్ర బలగాలను నియమించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 5.30 గంటలకు పోలింగ్‌ కేంద్రాల్లో మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. ప్రతి ఓటింగ్‌ కేంద్రంలో 50 ఓట్లను మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా బళ్లారి నగర, బళ్లారి గ్రామీణ విధానసభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది.

కదలివచ్చిన మహిళామణులు

ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద మహిళా ఓటర్లు పొటెత్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పురుష ఓటర్లు కనిపించారు. ఉదయం 8.30 గంటలకు పోలింగ్‌ కేంద్రాలకు మహిళా ఓటర్లు తరలివచ్చారు. బళ్లారి నగరం విధానసభ నియోజకవర్గంలోని మిల్లర్‌పేటె, హుసేన్‌నగర్‌, శ్రీరామపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల వద్ద మహిళా ఓటర్లు బారులు తీరారు. బళ్లారి గ్రామీణ నియోజకవర్గంలోని రేడియోపార్క్‌, కౌల్‌బజార్‌, కొళగల్లు, కృష్ణానగర క్యాంపు, ధనలక్ష్మి క్యాంపు, తిరుమల నగర క్యాంపు, శంకర్‌బండ, కమ్మర చేడు, రూపనగుడి, యాళ్పి, కుంటనాళు, లింగనదేవనహళ్లి, పి.డి.హళ్లి, చెళ్లగుర్కి, కె.వీరాపురం, జోళదరాశి, అమరాపురం, కక్కబేవినహళ్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలు, కంప్లి విధానసభ నియోజకవర్గంలోని యర్రంగలి, బాధనహట్టి, కురుగోడు పట్టణం, వద్దట్టి, మదురెక్యాంపు, కోళూరు, సోమసముద్రం, లక్ష్మినగర్‌ క్యాంపు తదితర గ్రామాల్లో ఉదయం నుంచి మహిళలే ఎక్కువగా వచ్చారు. మధ్యాహ్నం 1 నుంచి 3.30 గంటల వరకు విపరీతమైన ఎండ ఉండటంతో పోలింగ్‌ కేంద్రాలు ఓటర్లు లేక బోసిపోయాయి. సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చిన వారు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.

ఓటర్లకు వసతుల కల్పన

ఎండలు ఎక్కువగా ఉండటంతో పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చే ఓటర్లు ఎండలో ఉండకుండా షామియానాలు ఏర్పాటు వేశారు. శుద్ధతాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేకంగా ర్యాంపును ఏర్పాటు చేసి వీల్‌చైర్‌ను అందుబాటులో ఉంచారు. సఖీ పోలింగ్‌ కేంద్రాల్లో మహిళా సిబ్బంది, అధికారులను నియమించారు. ముందు జాగ్రత్తగా ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద ఆరోగ్య సిబ్బంది శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి ఓఆర్‌ఎస్‌ పొట్లాలను అందించారు. కోళగల్లు, కుడతిని పోలింగ్‌ కేంద్రాల్లో అనారోగ్యానికి గురైన సిబ్బందికి రక్తపోటు పరీక్షలు నిర్వహించి, మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో విమ్స్‌కు తరలించారు.


ప్రముఖులు ఓటేశారు

బళ్లారి: బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో పలువురు ప్రముఖులు మంగళవారం ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర క్రీడలు, యువజన సేవలు, గిరిజన సంక్షేమ శాఖ బాధ్యమంత్రి బి.నాగేంద్ర కుటుంబ సమేతంగా బసవేశ్వర నగర 1వ క్రాస్‌లో వుంకి మరిసిద్ధమ్మ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు బళ్లారి నగరం వాల్మీకి కూడలిలోని మహిళ-శిశు అభివృద్దిశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఇ.తుకారామ్‌ కుటుంబ సమేతంగా సండూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. రాజ్యసభ సభ్యుడు డా.సయ్యద్‌ నాసీర్‌ హుసేన్‌ కుటుంబసమేతంగా కౌల్‌బజార్‌ సెయింట్‌ జోసెఫ్‌ ఉన్నత పాఠశాల కేంద్రంలో ఓటు వేశారు. ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి కుటుంబ సమేతంగా బసవేశ్వరనగర్‌లో, కంప్లి శాసనసభ్యుడు జె.ఎన్‌.గణేష్‌ సతీమణితో కలిసి వచ్చి కురుగోడు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్‌.యు.సి.ఐ అభ్యర్థి ఎ.దేవదాసు ఎమ్మిగనూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ఉదయం 7 గంటలకు సత్యనారాయణ పేటె ప్రధాన రహదారిలోని ప్రభుత్వ సరళదేవి సతీశ్చంద్ర అగర్‌వాల్‌ డిగ్రీ కళాశాలలో ఓటు వేశారు..


ఓటింగ్‌ శాతం ఇలా..

ఉదయం 9 గంటలకు బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో 10.37 శాతం పోలింగ్‌ నమోదైంది. బళ్లారి గ్రామీణ 11.06, బళ్లారి నగరం 10.43, హూవినహడగలి 6,60, హగరిబొమ్మనహళ్లి 9.24, కంప్లి 13.06, కూడ్లిగి 10.09, సండూరు 9.91, విజయనగరలో 11.83 శాతం నమోదైంది.

  • 11గంటలకు 26.45శాతం నమోదైంది. బళ్లారి గ్రామీణ 27.16, బళ్లారి నగరం 25.54, హూవినహడగలి 21.29, హగరిబొమ్మనహళ్లి 24.21, కంప్లి 31.53, కూడ్లిగి 27.93, సండూరు 25.70, విజయనగర 27.79 శాతం నమోదైంది. మొత్తం 4,98,735 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • మధ్యాహ్నం 1 గంటలకు 44.36 శాతం నమోదైంది. బళ్లారి గ్రామీణ 44.05, బళ్లారి నగర 40.98, హూవినహడగలి 40.30 హగరిబొమ్మనహళ్లి 43.34, కంప్లి 50.46, కూడ్లిగి 47.46, సండూరు 44.56, విజయనగర 44.28శాతం నమోదైంది. మొత్తం 8,35,785 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • మధ్యాహ్నం 3 గంటలకు 56.76 శాతం నమోదైంది. బళ్లారి గ్రామీణ 55.36, బళ్లారి నగర 50.77, హూవినహడగలి 56.56, హగరిబొమ్మహళ్లి 58.16, కంప్లి 63.03, కూడ్లిగి 60.63, సండూరు 56.97, విజయనగర 54.57 శాతం నమోదైంది. మొత్తం 10,67,907 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • సాయంత్రం 5 గంటల వరకు 68.94 శాతం ఓటింగ్‌ నమోదైంది. బళ్లారి గ్రామీణ 67.53, బళ్లారి నగర 60.33, హూవినహడగలి 70.72, హగరిబొమ్మనహళ్లి 72.12, కంప్లి 74.61, కూడ్లిగి 73.29, సండూరు 70.09, విజయనగర 65.61శాతం నమోదైంది.12,98,749 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని