logo

ఓటంటేనే ఓ వేడుక!

ఓ వైపు ఎండలు.. మరో వైపు ఎన్నికల్లో ఓటేయాల్సిన బాధ్యత. ఈ రెండింటితో బాధ్యతతోనే ముందడుగు వేశారు మహిళలు, యువకులు, కొత్త ఓటర్లు!

Published : 08 May 2024 02:26 IST

హావేరిలో ప్రజాస్వామ్య విజయానికి ముందడుగు వేసిన పెద్దాయన

ధార్వాడ, న్యూస్‌టుడే : ఓ వైపు ఎండలు.. మరో వైపు ఎన్నికల్లో ఓటేయాల్సిన బాధ్యత. ఈ రెండింటితో బాధ్యతతోనే ముందడుగు వేశారు మహిళలు, యువకులు, కొత్త ఓటర్లు! మధ్య కర్ణాటక, ఉత్తర కర్ణాటక, కల్యాణ కర్ణాటక ప్రాంతాల్లో అత్యధికంగా మహిళలు ఓటేయడానికి ఆసక్తిగా ముందుకు రావడం కనిపించింది. యువకులైతే ఓటేసిన ఆనందంలో సెల్ఫీలు తీసుకుంటూ..సందడి చేశారు.

బెళగావి : యమకనమరడిలో ఓ పోలింగ్‌ బూత్‌లో మహిళల వరుస

భర్త చనిపోయిన బాధలోనూ..

శివమొగ్గ, న్యూస్‌టుడే : తీర్థహళ్లి తాలూకా ఆడుగోడికి చెందిన కళావతి అనే గృహిణి భర్త వెంకటేశ్‌ మంగళూరులోని వెన్‌లాక్‌ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తన భర్త తరచూ చెప్పే మాటల్ని గుర్తు చేసుకున్న కళావతి.. ఇంటి నుంచి నేరుగా పోలింగ్‌ బూత్‌కు వెళ్లారు. ఓటు వేసిన తర్వాత ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వెన్‌లాక్‌ ఆసుపత్రికి వెళ్లి భర్త భౌతికకాయాన్ని ఇంటికి తెచ్చుకుని.. శాస్త్రోక్తాలు కొనసాగించారు.

హావేరిలో ఓటేయడానికి మహిళల ఉత్సాహం

విధి నిర్వహణలో అధికారి కన్నుమూత

బీదర్‌, న్యూస్‌టుడే : కర్ణాటకలో రెండో విడత ఎన్నికల విధులకు హాజరైన సహాయక వ్యవసాయ అధికారి ఆనంద్‌ తెలంగ్‌ (32) సోమవారం రాత్రి మరణించారు. కుడుంబల్‌లో ఎన్నికల విధులను నిర్వహించేందుకు వచ్చిన ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో, ఇతర సిబ్బంది చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. ఇలాంటి సమస్యతోనే మధ్యకర్ణాటకలో సోమవారం ఓ ఉద్యోగి చనిపోవడం తెలిసిందే.

కూడ్లిగి తాలూకా గుండుమనుగులో లక్ష్మిదేవి.. ఉత్సాహంగా ఓటేశారిలా..

పోలింగ్‌ కేంద్రంలో స్వీయ చిత్రం

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి చరవాణిలో స్వీయ చిత్రం తీసుకుని వాట్సాప్‌స్టేటస్‌లో పెట్టిన బళ్లారి నగర పాలికె కార్పొరేటర్‌ కోనంకి తిలక్‌కుమార్‌పై కేసు నమోదైంది. బళ్లారి నగర పాలికె 10వ వార్డు(మర్రిస్వామి మఠం) కార్పొరేటర్‌ కోనంకి తిలక్‌కుమార్‌ బళ్లారి నగర వాసవీ ఆంగ్లమాధ్యమ పాఠశాలలోని పోలింగ్‌ బూత్‌ నంబరు 63లో ఓటు వేశారు. ఓటు వేస్తున్న సమయంలో స్వీయ చిత్రం తీసుకుని స్టేటస్‌ పెట్టారు. ఈ ఘటనపై బళ్లారి కౌల్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలింగ్‌ కేంద్రంలోకి చరవాణి తీసుకుని వెళ్లడానికి అవకాశం కల్పించిన భద్రత సిబ్బంది, పోలింగ్‌ కేంద్రం అధికారికి నోటీసు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. ఈవిషయంపై కార్పొరేటర్‌ కోనంకి తిలక్‌కుమార్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా, నేను ఎలాంటి ఫొటో తీసుకోలేదు. గతంలో ఉన్న పాత ఫొటోను స్టేటస్‌లో పెట్టుకున్నాను. వెంటనే దాన్ని తొలగించినట్లు తెలిపారు.

నియోజకవర్గ కేంద్రం అరబావిలో ఉదయమే కదలివచ్చిన నారీమణులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని