logo

ఓటరు దేవుడు.. మొండికేశాడు

కర్ణాటకలో రెండో విడత లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మంగళవారం ముగిసింది. మొదటి విడతలో 69 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా, ఈ విడత పూర్తి గ్రామీణ ప్రాంతాలున్నా..

Published : 08 May 2024 02:41 IST

ఆశించిన స్థాయిలో స్పందన కరవు

భర్తతో కలిసి స్వీయచిత్రాన్ని తీసుకుంటున్న శివమొగ్గ కాంగ్రెస్‌ అభ్యర్థి గీతా శివరాజ్‌ కుమార్‌

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : కర్ణాటకలో రెండో విడత లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మంగళవారం ముగిసింది. మొదటి విడతలో 69 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా, ఈ విడత పూర్తి గ్రామీణ ప్రాంతాలున్నా.. ఆశించిన స్థాయిలో పోలింగ్‌ నమోదు కాలేదన్నది రాజకీయ పండితుల నిరాశకు కారణం. సాయంత్రం ఆరు గంటలకు అందిన సమాచారం ప్రకారం (అప్పటికింకా కొద్ది మంది ఓటేయడానికి వరుసల్లో ఉన్నారు) 67 శాతం మాత్రమే ముందుకు వచ్చారు. పోటీలో ఉన్న 227 మంది అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఓటు వేశారు. బాగలకోటె, దావణగెరె, బెళగావిలలో కొందరు మఠాధిపతులు ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బసవజయ మృత్యుంజయ స్వామి పిలుపునిచ్చారు. బెళగావిలో 104 ఏళ్ల రాజేంద్ర కలఘటగి, స్కూటీ తానే నడుపుకొని వచ్చి ఆనగోళ ప్రభుత్వ మరాఠీ ప్రభుత్వ పాఠశాలలో ఓటు వేశారు. బెళగావి జిల్లా కాగవాడ తాలూకా కెంపవాడ గ్రామంలో 103 ఏళ్ల నీలవ్వ, దావణగెరె జిల్లా హరిహర తాలూకా హనగవాడి గ్రామంలో యల్లమ్మ (102) అనే వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెళగావి జిల్లాలో అత్యధిక సంఖ్యలో 1259 మంది ఓటర్లు వందేళ్లకు పైబడిన వయసు కలిగి ఉన్నారు. బరిలో ఉన్న ప్రముఖులలో మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ బొమ్మై, జగదీశ్‌ శెట్టర్‌, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి, ఎంపీలు భగవంత ఖూబా, రమేశ్‌ జిగజిణగి, శివమొగ్గలో యడియూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర, మంత్రుల కుటుంబ సభ్యులు డాక్టర్‌ ప్రభా మల్లికార్జున్‌, మృణాల్‌ హెబ్బాళ్కర్‌, ప్రియాంక జార్ఖిహొళి, సంయుక్త పాటిల్‌, సాగర్‌ ఖండ్రే, రాధాకృష్ణ దొడ్డమని, గీతా శివరాజ్‌ కుమార్‌ ఉన్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి భద్రతను కల్పించారు. ఈవీఎంలను ఆయా జిల్లా కేంద్రాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేర్చి, గట్టి భద్రత కల్పించారు.


ఉచిత అల్పాహారం, తేనీరు

హోటల్‌ వద్ద వరుసలో నిలబడిన ఓటర్లు..

శివమొగ్గ, న్యూస్‌టుడే : పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు శివమొగ్గలోని ఓ హోటల్‌ యాజమాన్యం ఉచిత అల్పాహారం, తేనీరు, కాఫీలను అందించింది. వేలిపై సిరా గుర్తు చూపించిన ఓటర్లకు మంగళవారం మధ్యాహ్నం వరకు నిర్వాహకులు మసాలాదోసె, పులావ్‌, టీ, కాఫీ ఉచితంగా అందించారు. రోజూ ఇలా ఉచితంగా అందించడాన్ని తాను నష్టంగా భావించనని, ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకుని, ప్రజాస్వామ్య వ్యవస్థకు తాను మద్దతుగా ఉండాలని కోరుకున్నానని హోటల్‌ యజమాని తెలిపారు.

తన బావ, కలబురగి కాంగ్రెస్‌ అభ్యర్థి రాధాకృష్ణ దొడ్డమనితో కలిసి గుండగుర్తి పోలింగ్‌ బూత్‌ వెలుపల సిరా చుక్క చూపిస్తున్న మంత్రి ప్రియాంక్‌ ఖర్గే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని