logo

విధులకు పిలుపెన్నడు?

ఉపాధి హామీ క్షేత్ర సహాయకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఆ ప్రకటన

Published : 25 May 2022 01:44 IST

657 మంది క్షేత్ర సహాయకుల ఎదురుచూపులు

పెనుబల్లి, చంద్రుగొండ, న్యూస్‌టుడే

పెనుబల్లి మండలంలో గంగదేవిపాడులో ఉపాధి హామీ

పని ప్రదేశంలో కూలీలను ఫొటో తీసి అప్‌లోడ్‌ చేస్తున్న మేట్‌

ఉపాధి హామీ క్షేత్ర సహాయకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఆ ప్రకటన చేసి దాదాపు రెండు నెలలు దాటినా ఉత్తర్వులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు.

* కూలీల హాజరు, ఫొటోలు ఆప్‌లోడ్‌ చేయడం వంటి పనులను మొన్నటి వరకు పంచాయతీ కార్యదర్శులు చూసేవారు. తాజాగా వారి నుంచి సీనియర్‌ మేట్లకు బాధ్యతలు అప్పగించారు.

ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇలా..

వేసవి సీజన్‌లోనే కూలీలకు బాగా పని దొరుకుతుంది. గ్రామసభల తీర్మానాల మేరకు ఆయా గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో రోజుకు దాదాపు 1.03లక్షల మంది, భద్రాద్రి జిల్లాలో 72 వేల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఉపాధి పనుల చిత్రాలు ఆప్‌లోడ్‌ చేసేందుకు 10,266 మంది, భద్రాద్రి జిల్లాలో 7718 మంది మేట్లు పని చేస్తున్నారు. 2022-23 సంవత్సరానికి ఖమ్మం జిల్లాలో 50,491 పనులు గుర్తించగా వాటిలో 30,958 పనులు జరుగుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో 39,889 పనులు గుర్తించగా, 22,254 పనులు జరుగుతున్నాయి.

పెరుగుతున్న పనిభారం..

ఉపాధి పనుల్లో పారదర్శకత పెంచడానికి కేంద్రం నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం అమల్లోకి తీసుకొచ్చింది. పని ప్రదేశంలో కూలీల చిత్రాలు తీసి వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కూలీల సంఖ్య అధికంగా ఉన్న గ్రామాల్లో, పంచాయతీల్లో చిత్రాలు తీయడం, హాజరు నమోదులో ఇబ్బంది ఏర్పడుతోంది. 200 నుంచి 300 కూలీల హాజరు చిత్రాలు తీసుకోవడానికి మధ్యాహ్నమవుతోందని మేట్లు పేర్కొంటున్నారు. క్షేత్ర సహాయకులను విధుల్లోకి తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది.

‘అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు క్షేత్ర సహాయకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. 65 రోజులు దాటినా ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉపాధి పనులు జోరుగా సాగుతున్న సమయంలో విధుల్లోకి తీసుకుంటే కూలీలకు ఇబ్బందులు తప్పుతాయి.’

- కర్రి సదానందం, ఉపాధి క్షేత్ర సహాయకుల జిల్లా అధ్యక్షులు

గతంలో క్షేత్ర సహాయకులు..

ఖమ్మం: 420

భద్రాద్రి: 237

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని