logo

నట్టేట ముంచేలా.. నెట్టింట మోసాలు

సత్తుపల్లికి చెందిన ఓ న్యాయవాది క్రిడెట్‌ కార్డుకు దరఖాస్తు చేశారు. ఆ బ్యాంకు నుంచే ఫోన్‌ చేసినట్లు సైబర్‌ నేరగాళ్లు నమ్మబలికి అతడి వివరాలు సేకరించారు. వెంటనే న్యాయవాది బ్యాంకు ఖాతా నుంచి రూ.75వేలు కాజేశారు.

Updated : 08 Feb 2023 10:07 IST

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే

* సత్తుపల్లికి చెందిన ఓ న్యాయవాది క్రిడెట్‌ కార్డుకు దరఖాస్తు చేశారు. ఆ బ్యాంకు నుంచే ఫోన్‌ చేసినట్లు సైబర్‌ నేరగాళ్లు నమ్మబలికి అతడి వివరాలు సేకరించారు. వెంటనే న్యాయవాది బ్యాంకు ఖాతా నుంచి రూ.75వేలు కాజేశారు. బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఆగమేఘాలపై స్పందించిన పోలీసులు సదరు బ్యాంకు సిబ్బందితో మాట్లాడి నేరగాళ్లు ఆ డబ్బులు డ్రా చేసుకోకుండా నివారించగలిగారు.

* లింకులను క్లిక్‌ చేసి సినిమాలకు రేటింగ్‌ ఇస్తే రూ.వేలు చెల్లిస్తామంటూ పెనుబల్లి మండలం వీఎం బంజరలో ఓ ప్రభుత్వ ఉద్యోగి సెల్‌ఫోన్‌కు సందేశాలు వచ్చాయి. నిజమని నమ్మిన ఉద్యోగి లింకులను ఓపెన్‌ చేశారు. అతడి బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా రూ.50లక్షల వరకు సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. ఇది తెలిసి లబోదిబోమంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.  

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి.

ప్రతి పది మందిలో ఎనిమిది మంది తమ సెల్‌ఫోన్లలో అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు. కావాల్సిన వస్తువులు కొనటం, నచ్చిన సినిమాలు చూడటం, ఇతర పనులు చక్కబెట్టుకునే క్రమంలో సైబర్‌ నేరగాళ్లకు చిక్కుతున్నారు. తేరుకునేలోపే బ్యాంకు ఖాతాల్లో సొమ్ము మాయమవుతుండటంతో నిశ్చేష్టులవుతున్నారు. అంతర్జాల సురక్షిత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

పోలీసులకు సవాలే

ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి తప్పుడు చిరునామాలు, బ్యాంకు ఖాతాలతో సైబర్‌ నేరగాళ్లు విసిరే వలకు అమాయకులు చిక్కుకుని ఆర్థికంగా నష్టపోతున్నారు. నేరస్థులను పట్టుకునే ఆధారాలు సులువుగా దొరకవు. ఒకవేళ వారి ఆచూకీ లభ్యమైనా సొత్తును స్వాధీనపరచుకోవటం పోలీసులకూ అసాధ్యం. సైబర్‌ నేరాల నివారణకు అప్రమత్తతే కీలకమని పోలీసులు చెబుతున్నారు. సైబర్‌ నేరం జరిగిన వెంటనే 1930 నంబర్‌కు లేదా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తే కాసింతైనా ఉపశమనం దొరకవచ్చునని అభిప్రాయపడుతున్నారు.

బాధితుల్లో ఉన్నత విద్యావంతులే అధికం

ఈ ఏడాది జనవరిలోనే ఉభయ జిల్లాల నుంచి రూ.75లక్షల వరకు సైబర్‌ నేరస్థులు కొల్లగొట్టారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం సైబర్‌ నేరాలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. వీటిపై దృష్టి సారించిన రాష్ట్ర పోలీసు శాఖ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఇతర రాష్ట్రాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల సమన్వయంతో పనిచేసేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. బాధితుల్లో సుమారు 70 శాతం మంది ఉన్నత విద్యావంతులేనని గణాంకాలు వెల్లడిస్తుండటం కొసమెరుపు.


అత్యాశకు పోవద్దు.. అప్రమత్తత వీడొద్దు

విష్ణు ఎస్‌ వారియర్‌, సీపీ, ఖమ్మం

సైబర్‌ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఓటీపీలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పొద్దు. ఆన్‌లైన్‌లో సులభంగా సంపాదించవచ్చనే మాయమాటలు నమ్మొద్దు. ఆన్‌లైన్‌ వేదికగా రుణాలు తీసుకోవద్దు. ఇటీవల వర్క్‌ఫ్రమ్‌ హోం అంటూ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. డబ్బులు ఊరకనే రావనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని