logo

దశదిశలా తెలంగాణ ఖ్యాతి

ఆరు దశాబ్దాల పోరాటంతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనిక పాలనలో అద్భుత ప్రగతి సాధిస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 03 Jun 2023 06:35 IST

రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల్లో మంత్రి

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ఆరు దశాబ్దాల పోరాటంతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనిక పాలనలో అద్భుత ప్రగతి సాధిస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా కలెక్టరేట్‌ ఆవరణలో జాతీయజెండాను శుక్రవారం ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు బైపాస్‌రోడ్డులో తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళి అర్పించారు. పెవిలియన్‌ మైదానం వద్ద అమరవీరుల స్తూపం వద్ద అంజలి ఘటించారు.

ఖమ్మం: తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జై తెలంగాణ అంటూ నినదిస్తున్న మంత్రి అజయ్‌కుమార్‌, జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు, కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ విష్ణు వారియర్‌, కృష్ణ తదితరులు

అభివృద్ధిలో ఆదర్శం

సీఎం కేసీఆర్‌ తొమ్మిదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి పువ్వాడ అన్నారు. కలెక్టరేట్‌ వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘తెలంగాణ ఆచరిస్తుంది- దేశం అనుసరిస్తుంది’ అని చెప్పుకొనే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. నిర్మాణాత్మక ఆలోచన, దార్శనిక ప్రణాళిక, మానవీయ దృక్పథం, పారదర్శక పాలనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్నామన్నారు. ఆర్థికమాంద్యం, కొవిడ్‌ వంటి సంక్షోభాలను తట్టుకుని బలీయమైన ఆర్థిక శక్తిగా నిలిచామని గుర్తు చేశారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడ్డాయని, వందేళ్ల పాటు కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు.

అన్నదాతలకు  అండగా..

ఖమ్మం జిల్లాలో 2014-15లో 1.63 లక్షల ఎకరాల్లో పంటల సాగుతో 2.94 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులు వచ్చేవని మంత్రి పువ్వాడ తెలిపారు. 2022-23 నాటికి 2.90 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తూ 7.25 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట ఉత్పత్తులు సాధించామన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, పంట రుణమాఫీ, రైతువేదికల నిర్మాణం, ఏఈఓల నియామకంతో వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్‌ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. రైతులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తోందన్నారు. రైతుబంధు పథకం కింద 3,16,174 మంది కర్షకులకు ఇప్పటివరకు రూ.3,121.49 కోట్ల పెట్టుబడి సాయమందించామని గుర్తు చేశారు. పంట ఉత్పత్తుల నిల్వకు పెద్దఎత్తున గోదాములు నిర్మించామన్నారు. ఖమ్మం నగరంలో సమీకృత వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని బీడు భూములకు మళ్లించే పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మిషన్‌ కాకతీయ పథకం ద్వారా రూ.180.15 కోట్లతో 869 చెరువులను పునరుద్ధరించామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.205.37 కోట్లతో 27,369 గొర్రెల యూనిట్లను మత్స్యకారులకు పంపిణీ చేశామని తెలిపారు.

ప్రతి ఇంటికీ శుద్ధజలం

రూ.1,308 కోట్లతో మిషన్‌ భగీరథ పథకం పూర్తి చేసి జిల్లాలోని ప్రతి ఇంటికీ శుద్ధజలం అందిస్తున్నామని మంత్రి చెప్పారు. ధరణి పోర్టల్‌ ద్వారా దీర్ఘకాలిక భూ సమస్యలను సులువుగా పరిష్కరిస్తున్నామన్నారు. ఉత్తర్వులు- 58, 59 కింద అర్హులకు ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు వివరించారు. విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీలో అనూహ్య అభివృద్ధి సాధించామన్నారు. 2014లో జిల్లాలో తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు ఉండగా 2023 నాటికి 2,140 యూనిట్లకు చేరిందని వెల్లడించారు. నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నామని తెలిపారు.

పేదల సంక్షేమానికి ప్రాధాన్యం

దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా పేదల సంక్షేమానికి పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తున్నట్లు మంత్రి అజయ్‌ వివరించారు. ఖమ్మంలో ప్రభుత్వ వైద్య విద్య కళాశాల ఏర్పాటవుతోందని, ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలను స్థాపిస్తామని తెలిపారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 5,91,503 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. మన ఊరు- మన బడి/మన బస్తీ కార్యక్రమం కింద రూ.178 కోట్లతో 426 ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

కలెక్టరేట్‌ ఆవరణలో నృత్యం చేస్తున్న విద్యార్థినులు

వివిధ పాఠశాలల విద్యార్థులు, తెలంగాణ సాంస్కృతిక సారథులు వేదికపై ప్రదర్శించిన నృత్యాలు, ఆలపించిన గీతాలు ఆహుతులను అలరించాయి. కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌, అదనపు కలెక్టర్లు స్నేహలత, మధుసూదన్‌, శిక్షణ కలెక్టర్లు రాధిక గుప్తా, మయాంక్‌సింగ్‌, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ ఛైర్మన్‌ కూరాకుల నాగభూషయ్య, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ రాయల శేషగిరిరావు, రైబస జిల్లా సమన్వయకర్త నల్లమల వెంకటేశ్వరరావు, మేయర్‌ నీరజ, సుడా ఛైర్మన్‌ విజయ్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

లకారం ట్యాంకుబండ్‌ వద్ద పేరిణి నృత్య ప్రదర్శన‌్ర

స్వరాష్ట్రంలో సకల సౌకర్యాలు

ఖమ్మం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: స్వరాష్ట్రంలో ప్రజలకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్‌అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా లకారం ట్యాంకుబండ్‌పై శుక్రవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రారంభించారు. ఖమ్మం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై రూపొందించిన వీడియోను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌, మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా ఛైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్లు స్నేహలత, మధుసూదన్‌, కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, కార్పొరేటర్‌ కర్నాటి కృష్ణ పాల్గొన్నారు.

ఉద్యోగులు భాగస్వాములు కావాలి: కలెక్టర్‌

ఖమ్మం నగరం: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, అదే స్ఫూర్తితో తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 22 వరకు నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో ఉద్యోగులు భాగస్వాములు కావాలన్నారు. శనివారం నిర్వహించనున్న రైతు దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, శిక్షణ కలెక్టర్‌ రాధిక గుప్తా, డీఆర్వో శిరీష, సీపీవో శ్రీనివాస్‌, ఏవో కారుమంచి శ్రీనివాసరావు  పాల్గొన్నారు.

బంగారు తెలంగాణకు కృషి చేయాలి: జడ్జి

ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేందుకు ప్రతి ఒక్కరూ  పాటుపడాలని జిల్లా జడ్జి బి.ఎస్‌.జగ్జీవన్‌కుమార్‌ అన్నారు. జిల్లా కోర్టులో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రావతరణ వేడుకల్లో జాతీయ జెండాను న్యాయమూర్తి ఆవిష్కరించి మాట్లాడారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో...

కోర్టులో జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న జిల్లా జడ్జి జగ్జీవన్‌కుమార్‌, చిత్రంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డి.కృష్ణారావు తదితరులు

ఖమ్మం నేరవిభాగం:రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించారు. ఆచార్య జయశంకర్‌ చిత్రపటానికి సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ నివాళి అర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పాత పోలీసు కమిషనర్‌(డీపీవో) కార్యాలయంలో అదనపు డీసీపీ(లా అండ్‌ ఆర్డర్‌) సుభాశ్‌చంద్రబోస్‌, పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో అదనపు డీసీపీ కుమారస్వామి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. శిక్షణ ఐపీఎస్‌ అవినాశ్‌కుమార్‌, ఏసీపీలు రామోజు రమేశ్‌, ప్రసన్నకుమార్‌, గణేశ్‌, బస్వారెడ్డి, రహెమాన్‌, వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, ఏవో అక్తరున్నీసాబేగం పాల్గొన్నారు.

మన్యంలో వెల్లివిరుస్తోన్న గిరిజన ప్రగతి

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం మన్యంలోని గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ఉండటంతో స్పష్టమైన ప్రగతి కనిపిస్తోందని ఐటీడీఏ పీఓ గౌతమ్‌ అన్నారు. గిరిజన రైతులకు అటవీ హక్కుల చట్టం, రైతుబంధు పథకాన్ని వర్తింపజేస్తున్నామని తెలిపారు. అడవి బిడ్డల సమగ్రాభివృద్ధికి అధికారులంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. ఐటీడీఏ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల్లో పీఓ మాట్లాడారు. తొమ్మిదేళ్లలో ప్రధాన రంగాల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తోందని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతుల కల్పన, తాగునీరు, స్వయం ఉపాధి రంగాలలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ఆర్థికాభివృద్ధి దిశగా ట్రైకార్‌, సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రిన్యూర్‌, డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌, గ్రామీణ రవాణా, సీఎం గిరివికాసం, సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమల పథకాలను అందించడంతో జీవనశైలిలో ఆశాజనకమైన ప్రగతి వెల్లివిరుస్తోందన్నారు. కొండరెడ్లు అన్నిరంగాలలో రాణించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జీసీసీ, మత్స్యశాఖ సేవలు విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. ఏపీఓ జనరల్‌ డేవిడ్‌రాజ్‌, ఏఓ భీం, ఎస్‌ఓ సురేశ్‌బాబు, జీసీసీ డీఎం విజయ్‌కుమార్‌, ఈఈ తానాజీ తదితరులు పాల్గొన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని