logo

రైతులు ఇబ్బందులు పడుతుంటే సంబరాలా?: కాంగ్రెస్‌

కాంటాలు వేసిన మొక్కజొన్న బస్తాలు రవాణా కాక రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ ప్రభుత్వం రైతు ఉత్సవాలు చేయటం ఎంత వరకు సమంజసమని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ విమర్శించారు.

Published : 04 Jun 2023 02:23 IST

పాతర్లపాడులో పోస్ట్‌కార్డులను చూపుతున్న డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల తదితరులు

చింతకాని, బోనకల్లు, న్యూస్‌టుడే: కాంటాలు వేసిన మొక్కజొన్న బస్తాలు రవాణా కాక రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ ప్రభుత్వం రైతు ఉత్సవాలు చేయటం ఎంత వరకు సమంజసమని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ విమర్శించారు. రైతుల ఇబ్బందులు గురించి జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పోస్ట్‌కార్డు ఉద్యమం శనివారం చేపట్టారు. రైతు రుణమాఫీ, మొక్కజొన్న పంట నష్టపరిహారం, మొక్కజొన్న రవాణాలో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులు పోస్ట్‌కార్డు ద్వారా ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో లక్ష పోస్ట్‌ కార్డుల ఉద్యమం చేపట్టినట్లు దుర్గాప్రసాద్‌ పేర్కొన్నారు. బోనకల్లు మండలం రామాపురంలో నిర్వహించిన పోస్టు కార్డు ఉద్యమంలో పువ్వాళ్ల మాట్లాడారు. కార్యక్రమాల్లో  పీసీసీ సభ్యుడు పైడిపల్లి కిషోర్‌కుమార్‌, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు శేఖర్‌గౌడ్‌, నాయకులు అంబటి వెంకటేశ్వరరావు, కొప్పుల గోవిందరావు, బొర్రా శేషగిరి, మద్దిన్ని నాగేశ్వరరావు, మద్ది వీరారెడ్డి, గాలి దుర్గారావు, భద్రునాయక్‌, రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

భోజనాలు కాదు రుణమాఫీ అవసరం

వేంసూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల రుణమాఫీ చేయకుండా భోజనాలు పెట్టి మభ్యపెడుతున్నారని మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్‌ విమర్శించారు. దూళ్లకొత్తూరు, రాయుడుపాలెం గ్రామాల్లో నిర్వహించిన హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో ఆయన పాల్గొన్నారు. డీసీసీ ఉపాధ్యక్షుడు పుచ్చకాయల సోమిరెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాసర చంద్రశేఖరరెడ్డి, కోట సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, నాగేశ్వరరావు, దుర్గారావు, వీరరాఘవులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాధనం దుర్వినియోగం

సత్తుపల్లి, న్యూస్‌టుడే: రైతు సంబురాలు కాదు ముందు రైతులకు రుణమాఫీ చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్‌ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. సంబరాలు, ఆడంబరాలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తగదన్నారు. ఇదిలా ఉండగా సత్తుపల్లి, కాకర్లపల్లి మామిడి తోటలు పేకాటకు అడ్డాగా మారాయని ఈ అంశమై సీపీకి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.

* ఈనెల 18న నిర్వహించతలపెట్టిన రాజీవ్‌గాంధీ క్విజ్‌ పోటీల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్‌ పిలుపునిచ్చారు. గంగారం సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు కరపత్రాలను పంపిణీ చేసి అవగాహన కల్పించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని