logo

సార్వత్రిక సమరం.. సిబ్బంది సిద్ధం..!

సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఓటరు నమోదు నుంచి అభ్యర్థుల నామినేషన్లు, పోలింగ్‌, కౌంటింగ్‌ వరకు ప్రతి ఘట్టంలో అధికారులు, ఎన్నికల సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తారు.

Published : 29 Mar 2024 02:27 IST

సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఓటరు నమోదు నుంచి అభ్యర్థుల నామినేషన్లు, పోలింగ్‌, కౌంటింగ్‌ వరకు ప్రతి ఘట్టంలో అధికారులు, ఎన్నికల సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తారు. వీరి ఎంపిక ప్రక్రియను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా జిల్లాల యంత్రాంగాలు కొన్ని నెలల ముందే ప్రారంభించాయి. ఎన్నికల సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియను కలెక్టర్లు ఇటీవల పూర్తిచేశారు.

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం

ఆర్‌ఓగా కలెక్టర్‌

శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌ఓ)ని నియమిస్తుంది. ప్రతి లోక్‌సభ స్థానానికి సంబంధిత జిల్లా కలెక్టర్‌ ఆర్‌ఓగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ  స్థానాలకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆర్‌ఓలుగా వ్యవహరిస్తారు. నామినేషన్‌ ప్రక్రియ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోలింగ్‌ సిబ్బంది నియామకం- శిక్షణ, ఈవీఎంల ర్యాండమైజేషన్‌, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి వంటి అంశాలు సదరు ఆర్‌ఓ పర్యవేక్షణలో జరుగుతాయి.

సహాయ రిటర్నింగ్‌ అధికారులుగా..  

గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఆర్‌ఓను ఎన్నికల సంఘం నియమించింది. అలాంటి వారందరూ లోక్‌సభ ఎన్నికల సమయంలో సహాయ రిటర్నింగ్‌ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని పది శాసనసభ నియోజకవర్గాలకు పది మంది ఏఆర్‌ఓలుగా వ్యవహరిస్తారు. ఎన్నికల నిర్వహణలో ఆర్‌ఓకు సహకరించటంతో పాటు సంబంధిత శాసనసభ నియోజకవర్గాల పరిధిలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటారు.

సెక్టోరల్‌ అధికారుల పాత్ర కీలకం

ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగటంలో సెక్టోరల్‌ అధికారుల పాత్ర కీలకం. వీరి పరిధిలో 6-9  చొప్పున పోలింగ్‌ కేంద్రాలు ఉండొచ్చు. పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంపులు, నీరు, విద్యుత్తు, ఫ్యాన్లు తదితర మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత వీరిదే. ఖమ్మం జిల్లాలో 210, భద్రాద్రిలో 171 మంది సెక్టోరల్‌ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు.

ప్రతి పోలింగ్‌ కేంద్రానికి నలుగురు సిబ్బంది

ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఓ ప్రిసైడింగ్‌ అధికారి(పీఓ)ని నియమిస్తారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను పోలింగ్‌ కేంద్రానికి తీసుకొచ్చి.. ఓటింగ్‌ అనంతరం వాటిని స్ట్రాంగ్‌ రూంకు చేర్చే వరకు పీఓ బాధ్యత వహిస్తారు. సహాయకారిగా అదనపు ప్రిసైడింగ్‌ అధికారి ఉంటారు. వీరితో పాటు ఇద్దరు పోలింగ్‌ అధికారులు విధులు నిర్వర్తిస్తారు. ఒకరు ఓటర్లకు ఇంకు పూస్తారు. మరొకరు ఈవీఎంల పనితీరును పర్యవేక్షిస్తారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి నలుగురు చొప్పున సిబ్బందిని నియమిస్తూ అదనంగా 20శాతం మంది ఉద్యోగులను రిజర్వ్‌లో ఉంచేలా ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కనీస వేతనం ఆధారంగా పీఓ, ఏపీఓ, ఓపీఓలను నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని