logo

పార్టీ గళం.. ప్రచార దళం

లోక్‌సభ ఎన్నికలు ప్రధాన పార్టీల ముఖ్యనేతలకు సవాల్‌గా మారాయి. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై అస్త్రశస్త్రాలు సంధిస్తూనే ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

Updated : 28 Apr 2024 05:52 IST

కాంగ్రెస్‌లో అమాత్యులే అంతా తామై..

లోక్‌సభ ఎన్నికలు ప్రధాన పార్టీల ముఖ్యనేతలకు సవాల్‌గా మారాయి. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై అస్త్రశస్త్రాలు సంధిస్తూనే ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. క్షేత్రస్థాయిలో సమన్వయ భేటీలు, సన్నాహక సమావేశాలతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అగ్రనేతల పర్యటనలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఈటీవీ, ఖమ్మం: ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్‌ గెలుపు బాధ్యతలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భుజానికెత్తుకున్నారు. ప్రచార వ్యూహాలు మొదలుకొని, నేతల మధ్య సమన్వయం వరకు అంతా తామై వ్యవహరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి సీతక్క ఈ రెండు స్థానాల్లో ప్రచారం చేసేలా ప్రణాళిక రూపొందించారు. ముఖ్యనేతల ఐక్యతకు ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, పొదెం వీరయ్య ఆయా జిల్లాల్లో పార్టీ శ్రేణులను సమన్వయపరుస్తున్నారు. మే 11 వరకు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ముఖ్యనేతల రోడ్‌షోలు, ప్రచార సభలు పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఉవ్విళ్లూరుతున్న భాజపా

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో భాజపా నాయకులు ఈసారి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రధాని మోదీ చరిష్మాను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పార్టీ   అభ్యర్థులు తాండ్ర వినోద్‌రావు, సీతారాంనాయక్‌కు మద్దతుగా సీనియర్‌ నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కొండపల్లి  శ్రీధర్‌రెడ్డి, గల్లా సత్యనారాయణ, రంగా కిరణ్‌, గరికపాటి మోహన్‌రావు, ప్రేమేందర్‌రెడ్డి, ధర్మారావు వంటి నేతలు ప్రచారం చేస్తున్నారు.

మళ్లీ పాగా వేయాలని భారాస

సిట్టింగ్‌ స్థానాలను మళ్లీ కైవసం చేసుకోవాలని భారాస ప్రయత్నిస్తోంది. పార్టీ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోత్‌ కవితను మరోసారి బరిలో దించింది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్‌, సత్యవతి రాథోడ్‌, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల భారాస అధ్యక్షులు తాతా మధుసూదన్‌, రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు ప్రచార బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవటంతో ద్వితీయశ్రేణి నాయకులు పార్టీ మారారు. గతంలోనూ శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటకపోయినా సార్వత్రిక సమరంలో రెండుచోట్లా విజయదుందుభి మోగించామని, ఈసారీ అలాగే జరగబోతుందని కార్యకర్తలను కార్యోన్ముఖుల్ని చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని