logo

స్వయం ప్రేరణతో పోలింగ్‌ మెరుగు

తాజా లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో రెండు దశల పోలింగ్‌ ముగిసింది. చాలా పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో మునుపటి (2019) ఎన్నికల కంటే తక్కువ పోలింగ్‌ శాతం నమోదైంది.

Published : 30 Apr 2024 05:04 IST

వినూత్న ప్రయత్నాలతోనే చైతన్యం
కొత్తగూడెం, న్యూస్‌టుడే

తాజా లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో రెండు దశల పోలింగ్‌ ముగిసింది. చాలా పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో మునుపటి (2019) ఎన్నికల కంటే తక్కువ పోలింగ్‌ శాతం నమోదైంది. ఖమ్మం పార్లమెంట్‌ స్థానంలోనూ 2019 ఎన్నికల్లో నాలుగో వంతు మంది ఓటుకు దూరంగా ఉన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలున్న నియోజకవర్గాలతో పోల్చిచూస్తే ఖమ్మం నగరంలోనే తక్కువ పోలింగ్‌ (73.14%) నమోదైంది. ‘నేకొక్కడినే ఓటేయకుంటే ఏమవుతుంది?’ అనే ఉదాసీనతలోంచి బయటపడేసి.. ఓటర్లంతా స్వయం ప్రేరణతో కేంద్రాలకు తరలివచ్చేలా ఎన్నికల యంత్రాంగం చైతన్యం కల్పించాలి. రాజకీయ పార్టీలు సైతం సహకరించాలి.


ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, సులభతరంగా ఓటు వినియోగించుకోవడమే లక్ష్యమని ఉమ్మడి జిల్లాల ఎన్నికల యంత్రాంగం చెబుతోంది. కానీ, మెరుగైన ఓటింగ్‌ నమోదుకు అనుసరించే పద్ధతులు తేలిపోతున్నాయి. వసతుల కల్పన, ఓటరు చైతన్యానికి అనుసరిస్తున్న ‘అందరికీ ఒకే పద్ధతి’ వ్యూహం సత్ఫలితాలివ్వడం లేదు. నగరాలు, పట్టణం, పల్లెలు, గిరిజన గూడేలకు వేర్వేరు వ్యూహాలు అనుసరించాలి. ఓటరు సంఖ్యకు తగ్గట్టు పోలింగ్‌ కేంద్రాల పెంపు, దూరప్రాంతాలకు ప్రజా రవాణాపై దృష్టిపెట్టాలి. దీనికి బూత్‌ల వారీ కార్యాచరణ రూపొందించి అమలు చేయాలి. వేసవి ఎండల దృష్ట్యా కేంద్రాల్లో రద్దీ నిర్వహణకు చర్యలు చేపట్టాలి. చీమల్లాంటి బారులను చూసి ఓటేసేందుకు రానివారే ఎక్కువని గత ఎన్నికల్లో రుజువైంది. పోలింగ్‌ ప్రక్రియ వేగంగా కొనసాగేలా సిబ్బందిని అప్రమత్తం చేయడం, రద్దీ నియంత్రణలో ఉండేలా చూడటం, షామియానాలు, తాగునీరు, ఓఆర్‌ఎస్‌, మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించడం ముఖ్యం. పట్టణాల్లో షెల్టర్లు, పార్కింగ్‌ వంటివి ఏర్పాటు చేయాలి. 85 ఏళ్లుదాటిన వృద్ధులు, నలభై శాతం వికలత్వం గల దివ్యాంగులందరూ ఇళ్ల వద్ద వంద శాతం ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటేసే యువత, మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక కేంద్రాలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వీటి సంఖ్య పెంచి వంద శాతం పోలింగ్‌ లక్ష్యంగా ప్రోత్సహించాలి. స్థానిక నేపథ్యంతోనూ కేంద్రాలను తీర్చిదిద్ది ఓటర్లను రప్పించవచ్చు.

  • వేలి సిరా చుక్క చూపుతూ దిగిన చిత్రాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు పలు రాష్ట్రాల్లో యువ ఓటర్లు ఉత్సాహం చూపారు. ఇలా అన్నివర్గాల ఓటర్లను ఆకర్షించేలా ఉమ్మడి జిల్లాల ఎన్నికల యంత్రాంగం, ‘స్వీప్‌’ విభాగం ప్రత్యేక చొరవచూపాలి.
  • నాలుగో దశలో (మే 13న) పోలింగ్‌ జరిగే నేపథ్యంలో 5కె రన్‌, వాకథాన్‌, మారథాన్‌ వంటి కార్యక్రమాలను ముందే నిర్వహించి ఉత్సాహం నింపాలి.

  • రెండో దశ లో భాగంగా కేరళలో ఓ పోలింగ్‌ కేంద్రాన్ని ‘అడవి థీమ్‌’తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఓటేసిన వారికి ఉచిత టిఫిన్‌, రాయితీలు కల్పిస్తూ ‘బృహత్‌ బెంగళూరు హోటల్స్‌ అసోసియేషన్‌’ చేసిన ప్రయత్నాన్ని ఖమ్మం, కొత్తగూడెం వంటి పట్టణాల్లో అనుసరించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని