logo

భారాస గెలిస్తేనే రాష్ట్రానికి మేలు

భారాస కార్యకర్తల కృషి, ఐదు నెలల్లోనే కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో తాను మరోసారి విజయం సాధిస్తానని ఖమ్మం లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు.

Updated : 06 May 2024 05:59 IST

ఖమ్మం లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావుతో ముఖాముఖి

భారాస కార్యకర్తల కృషి, ఐదు నెలల్లోనే కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో తాను మరోసారి విజయం సాధిస్తానని ఖమ్మం లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజల కష్టసుఖాల్లో ఒకడిగా ఉన్నానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో భారాస అత్యధిక స్థానాల్లో గెలిస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని తెలిపారు. ‘ఈనాడు’తో ఆయన ముచ్చటించారు. ఆ వివరాలు మీ కోసం..

ఈటీవీ, ఖమ్మం

ప్రచారానికి విశేష స్పందన

ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శాసనసభ ఎన్నికల సమయంలో అలవికాని హామీలు ఇచ్చి మోసగించిన కాంగ్రెస్‌ పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో హస్తం పార్టీకి బుద్ధి చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. భారాస హయాంలో అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాం.

తెలంగాణ ఆత్మగౌరవమే మా నినాదం

తెలంగాణ ఆత్మగౌరవం నినాదంతోనే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్తున్నాం. పార్లమెంట్‌లో తెలంగాణ వాణి వినిపించాలంటే భారాస అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించాలి. పునర్విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి దక్కాల్సిన వాటా, రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై గతంలోనూ భారాస ఎంపీలే గళం వినిపించారు. రాష్ట్రంలో విద్యుత్తు కోతలు, తాగు, సాగునీటి సమస్యలపై చర్చ జరుగుతోంది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు ప్రజలు పట్టం కడతారు.

సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చా

రెండుసార్లు ఎంపీగా గెలిపిస్తే ఖమ్మం, భద్రాద్రి జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చాను. జాతీయ రహదారులకు ఖమ్మం జిల్లా హబ్‌గా మారేందుకు కృషి చేశా. భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్‌ సాధనకు రైల్వే శాఖ మంత్రిపై ఒత్తిడి తెచ్చి సఫలీకృతమయ్యాను. ఖమ్మం, మధిర, కొత్తగూడెం రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు నిధులు మంజూరయ్యేలా చొరవ తీసుకున్నా. తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయం కోసం పార్లమెంట్‌లో గళమెత్తాను. ప్రజలు మరోసారి గెలిపిస్తే బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధనకు ప్రయత్నిస్తా. ఖమ్మం జిల్లాలో గ్రానైట్‌ పరిశ్రమకు జవసత్వాలు నింపేందుకు కృషిచేస్తాను. జిల్లాకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తా. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం పరిశ్రమలు నెలకొల్పేలా చొరవ చూపుతా.

ఆశీర్వదించండి.. అండగా నిలుస్తా

రైతు బిడ్డను. ఖమ్మం జిల్లా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నాను. దశాబ్దాలుగా సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నా. నా ప్రత్యర్థులు ఎలాంటి వారో, ఎక్కడి నుంచి వచ్చారో ప్రజలకు తెలుసు. జిల్లా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్లు ఎక్కడున్నారు. గోదావరి వరదలు, ఖమ్మం నగరంలో వరదలు వచ్చినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ అండగా నిలిచాను. బయట నుంచి వచ్చిన వారిని మళ్లీ అక్కడికి ఎలా పంపించాలో ప్రజలకు తెలుసు. ఖమ్మం బిడ్డను ఎలా కాపాడుకోవాలో తెలుసు. మూడోసారి ఎంపీగా గెలిపిస్తే ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలుస్తాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని