logo
Updated : 25 May 2022 07:01 IST

‘రణ’రంగం

ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసుల విశ్వ ప్రయత్నం

ఈనాడు, అమలాపురం- న్యూస్‌టుడే, అమలాపురం, పట్టణం, అల్లవరం, పి.గన్నవరం : కోనసీమ జిల్లా పేరు మార్పు అంశం చిచ్చు రేపింది.. కోనసీమ ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది.. వేలాదిగా యువత రోడ్లెక్కడంతో పరిస్థితి అదుపు తప్పింది.. ఆందోళనకారులను నిలువరించే క్రమంలో పోలీసులు లాఠీలకు పనిచెబితే.. వారిని ప్రతిఘటించే క్రమంలో రాళ్లదాడి చోటుచేసుకుంది. మంత్రి, ఎమ్మెల్యే నివాసాలకు నిప్పంటించి.. పలు వాహనాలను ధ్వంసం చేసి అగ్నికి ఆహుతి చేశారు. మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ఉన్న కోనసీమ తాజా పరిణామాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉద్యమ ఉద్రిక్తతలో అటు పోలీసులు, ఇటు ఆందోళనకారులు పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. పొరుగు జిల్లా ప్రత్యేక బలగాలు రంగప్రవేశం చేయడంతో అమలాపురంలో ఉద్రిక్తత సద్దుమణిగింది. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏలూరు రేంజి డీఐజీ పర్యవేక్షణలో పలు జిల్లాల ఎస్పీలు అమలాపురంలో శాంతిభద్రతలపై నిఘా వేశారు.

అగ్నికీలల్లో మంత్రి విశ్వరూప్‌ కార్యాలయం

వాట్సప్‌ సమాచారంతో రచ్చ..

‘కోనసీమ జిల్లా ముద్ధు. వేరే పేరు వద్దు’ నినాదంతో కోనసీమ జిల్లా సాధన సమితి చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. ఈ సమాచారం చలో అమలాపురం, జయహో కోనసీమ పేరుతో వాట్సప్‌లో హల్‌చల్‌ చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు 300 మందితో అమలాపురం పట్టణానికి పది కిలోమీటర్లు వెలుపల నుంచే బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్లు చెక్‌చేసి పంపించారు. 25 చోట్ల మోహరించి.. సోదాలు చేశారు. అమలాపురం మున్సిపల్‌ కార్యాలయానికి చేరువలో శుభ కలశం దగ్గరకు అందరూ చేరాలనే సమాచారం ఉన్నా... తొలుత పదుల సంఖ్యలో గడియార స్తంభం వద్దకు చేరుకున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆ సంఖ్య వేలకు చేరుకోవడంతో పోలీసులే విస్తుపోయారు. ఏకంగా ఎస్పీ సుబ్బారెడ్డి సైతం రోడ్డుమీదకు వచ్చి విధులు నిర్వహించి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు.


బస్సు ధ్వంసం

వేడెక్కి.. అదుపు తప్పి..

తొలుత గడియార స్తంభం సెంటర్‌కు ఆందోళనకారులు భారీగా చేరుకోగా.. అప్రమత్తమైన పోలీసులు లాఠీఛార్జితో పరుగులు తీయించారు. దొరికిన వారిని అదుపులోకి తీసుకుని వాహనాలు ఎక్కించారు. మిగిలిన వారు.. నల్లవంతెన వద్దకు చేరుకుని.. పోలీసుల వజ్ర వాహనం, ఇతర వాహనాలు, పోలీసు సమూహాన్ని ఛేదించి.. కలెక్టరేట్‌ వైపు వెళ్లారు.ఆపై వాహనాల దహనం దాడులు కొనసాగాయి. అంబేడ్కర్‌ భవనం, కలెక్టరేట్‌, అక్కడి వాహనాలపైనా రాళ్లు రువ్వారు. ఇదేక్రమంలో మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ ఇళ్లపైనా దాడులకు దిగారు. అగ్నికీలలు రేగుతున్నా అగ్నిమాపక శకటం వచ్చి మంటలు ఆర్పే సాహసం చేయలేదు. ఈ పరిణామాలతో 100 మంది వరకు గాయపడగా.. ఆరుగురు పోలీసులు, ఒక బస్సు డ్రైవర్‌ చికిత్సపొందుతున్నారు. మంత్రి ఇంట్లో వంట మనిషికి కాలిన గాయాలయ్యాయి.

కలెక్టరేట్‌లో అగ్నికి ఆహుతి అవుతున్న బస్సు

ముందే మేల్కొన్నా..

ఈనెల 20న కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వేల మంది కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఆరోజు పరిస్థితి అదుపు తప్పుతుందని పోలీసులు భావించారు. అంతా ప్రశాంతంగా సాగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం డీఆర్సీ సమావేశం.. స్పందన నేపథ్యంలో ఆందోళనకు ఆస్కారం ఉందని పోలీసులు అంచనాకు వచ్చారు. ఈనెల 23 నుంచి పోలీసులు అమలాపురంలో ఆంక్షలు విధించారు. వారం రోజులు 144 సెక్షన్‌, జూన్‌ 30 వరకు పోలీసు యాక్ట్‌ 30 అమల్లో ఉంటుందని ఎస్పీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో డీఆర్సీ మీటింగ్‌ జరిగిన క్షత్రియ కల్యాణ మండపం దగ్గర భారీ బందోబస్తు పెట్టారు. కలెక్టరేట్‌ దగ్గర స్పందనకు వచ్చినవారినీ తనిఖీ చేసి పంపించారు

వదంతులు నమ్మొద్దు : డీఐజీ

కోనసీమ జిల్లా పేరు మార్పుపై చెలరేగిన హింసాత్మక ఘటనలు అదుపులోకి వచ్చాయని, అమలాపురం పూర్తిగా పోలీసుల అదుపులో ఉందని ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులను ప్రజలు నమ్మొద్దని, హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడులు చేసిన ఆందోళనకారులను సీసీ ఫుటేజీల ఆధారంగా గుర్తించి, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

 

వినతుల పేచీ...

ఎవరు వినతి పత్రం ఇవ్వాలన్నా.. ఒక్కరే కలెక్టరేట్‌కు రావాలని.. సామూహికంగా వినతులు ఇవ్వకూడదని ఆంక్షలు విధించారు. జిల్లా పేరు మార్పునకు అభ్యంతరాలు, అభిప్రాయాలు చెప్పడానికి 30 రోజులు గడువు ఇచ్చిన ప్రభుత్వం ఆంక్షలతో అడ్డుకుంటే తమ అభిప్రాయాలు ఎలా చెప్పగలమని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాలతోపాటు సచివాలయ స్థాయిలో రశీదులు ఇచ్చేలా వినతులు స్వీకరిస్తే ఈ పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదన్న వాదనా వినిపిస్తోంది.

 

పట్టణంలో మోహరించిన పోలీసు బలగాలు

కోనసీమ అష్టదిగ్బంధం..

ఉద్రిక్త పరిస్థితులతో అమలాపురాన్ని అష్టదిగ్బంధం చేశారు. పలు జిల్లాల నుంచి ప్రత్యేక బలగాలు రప్పించారు. దీంతో పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు అమలాపురంలో బసచేసి పరిస్థితిని చక్కదిద్దారు. హింసాత్మక సంఘటనలకు ఎవరు పాల్పడినా చట్టరీత్యా చర్యలు తప్పవని డీఐజీ హెచ్చరించారు.


ద్విచక్ర వాహనం ఆహుతి


ఉత్కంఠ.. ఉద్రిక్తత..ఎమ్మెల్యే పొన్నాడ కార్యాలయం..

ధ్వంసమైన మంత్రి విశ్వరూప్‌ ఇంట్లోని ఓ గది


ఎస్పీ సుబ్బారెడ్డికి చికిత్స


దహనమైన సూపర్‌లగ్జరీ, పల్లెవెలుగు బస్సులు

Read latest Konaseema News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని