logo

చుట్టేస్తోంది.. జాగ్రత్త పడదాం..

జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో 10మందికిపైగా ఉద్యోగులు కొవిడ్‌ బారిన పడ్డారు. మరో 40మందికిపైగా నిర్ధరణ పరీక్షలు చేశారు. వీరిలో చాలామందికి పాజిటివ్‌ వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పలు పీహెచ్‌సీలతోపాటు

Published : 21 Jan 2022 03:11 IST

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

మల్లవోలు పీహెచ్‌సీలో పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది

జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో 10మందికిపైగా ఉద్యోగులు కొవిడ్‌ బారిన పడ్డారు. మరో 40మందికిపైగా నిర్ధరణ పరీక్షలు చేశారు. వీరిలో చాలామందికి పాజిటివ్‌ వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పలు పీహెచ్‌సీలతోపాటు కరోనా విధుల్లో పాల్గొన్న 20మందికి పైగా సోకడంతో హోం ఐసొలేషన్‌లో ఉన్నారు.

పెడన, బంటుమిల్లి, ముదినేపల్లి తదితర మండలాల్లో ఉపాధ్యాయులతోపాటు కొంతమంది విద్యార్థులకు కూడా కొవిడ్‌ సోకడంతో చికిత్స తీసుకుంటున్నారు. పట్టణాలు, పల్లెలు అన్న తేడాలేకుండా చుట్టేస్తోంది. కట్టడి చేసేందుకు అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

400కి చేరువ

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈనెలలో పదో తేదీన 200లోపు కేసులు నమోదైతే ప్రస్తుతం వాటి సంఖ్య 400కు చేరువ అవుతోంది. కొవిడ్‌ సోకినా విధులు బాధ్యత తప్పడం లేదని వైద్యశాఖకు చెందిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి క్లిష్టతరంగా ఉండటంతో ఉన్నతాధికారులు హోం క్వారంటైన్‌లో ఉన్నా విధులు నిర్వహించాల్సిందే అని చెప్పడంతో ఇళ్ల నుంచే చేస్తున్నారు. మిగిలిన కార్యాలయాలోనూ అనేక మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు.

కేంద్రాల్లో చేరుతున్న రోగులు

అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ, జగ్గయ్యపేట, కైకలూరు, మైలవరం, మచిలీపట్నం, నందిగామ, నూజివీడు, పెనమలూరు, పెడన, తిరువూరుతోపాటు విజయవాడలోని గూడవల్లిలో కొవిడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో దానిలో మూడు షిఫ్టులుగా 24గంటలూ విధులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ప్రస్తుతం గూడవల్లి కేంద్రంలో 22మంది సేవలు పొందుతున్నారు. మచిలీపట్నంలోని జిల్లా ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటీవల వరకు 20మందిలోపు రోగులు ఉంటే ప్రస్తుతం 42మంది చికిత్స పొందుతున్నారు.

ఆందోళన వద్దు

జిల్లాలో గత కొన్ని రోజులుగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి..ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలి. కరోనా బారిన పడి ఇంట్లో ఉండేందుకు అవకాశం లేనివారు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను వినియోగించుకోవాలని కోరుతున్నాం. అక్కడ అవసరమైన అన్ని వసతులు కల్పించాం. పలువురు వైద్యులు, సిబ్బంది కొవిడ్‌ బారిన పడిన మాట వాస్తవమే. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలిక సిబ్బందిని నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలోనే వీరు అందుబాటులోకి వస్తారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. - డా.ఎం.సుహాసిని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని