logo

ప్రతిజ్ఞ చేద్దాం

భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం దీనికి అర్హత పొందడానికి సర్వదా  ను కృషి చేస్తాను నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని పెద్దలందర్ని గౌరవిస్తాను ప్రతి వారితోను మర్యాదగా నడుచుకుంటాను జంతువుల పట్ల దయతో ఉంటాను నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవా నిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.

Published : 14 Aug 2022 01:08 IST

ఈనాడు, కర్నూలు

భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం దీనికి అర్హత పొందడానికి సర్వదా  ను కృషి చేస్తాను నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని పెద్దలందర్ని గౌరవిస్తాను ప్రతి వారితోను మర్యాదగా నడుచుకుంటాను జంతువుల పట్ల దయతో ఉంటాను నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవా నిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.

నిత్యం బడిలో గంట మోగగానే విద్యార్థులంతా భారతీయ ప్రతిజ్ఞ చేస్తారు. ఇందులో దేశం ఔన్నత్యాన్ని వర్ణించడంతోపాటు మానవ సంబంధాలు, కుటుంబ విలువలు, సోదరభావం తదితర విషయాల గురించి చక్కగా వివరించారు. ప్రతిజ్ఞ అంటే హామీ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. రాజ్యాంగంలో ఉన్న విలువల్ని ప్రతిజ్ఞలోని పదాలు తెలియజేస్తాయి. పౌరుల హక్కులతోపాటు విధులను ఇది గుర్తు చేస్తుంది. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత, నైతిక విలువలను పెంపొందించడానికి దోహదపడుతుంది. ప్రతిజ్ఞలో పొందుపరిచిన వాక్యాలను అందరూ పాటిస్తే భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దాం.. అందులోని అంశాలను పాటిద్దాం.. ‘నవ’భారతాన్ని నిర్మిద్దాం.

ఆత్మకూరు మండలం వెంకటాపురం


ప్రగతికి ప్రతిన బూనుదాం

పుట్టిన గడ్డ ప్రగతికి అహర్నిశలు కృషి చేస్తానని ప్రతి ఒక్కరూ ప్రతిన బూనుదాం. పుట్టిన గ్రామానికి సేవ చేయడమంటే.. బాధ్యతగా పచ్చదనం పెంపొందించి, విద్య, వైద్యం అందుబాటులో ఉంచి భావితరాలకు బాటలు వేయాలి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నేటికీ ఎన్నో గ్రామాలకు సరైన రోడ్లు లేవు. బిందెడు మంచినీరు దొరక్క అల్లాడిపోతున్న పల్లెలున్నాయి. ఉపాధి పనుల్లేక పశ్చిమ ప్రాంతవాసులు నేటికీ వలస బాట పడుతున్నారు. ఇక్కడ అక్షరాస్యత తక్కువే. వీటన్నింటిని పారదోలితే మాతృభూమి ఎంతో గర్విస్తుంది.. ఇదే బాటలో ముందుకెళ్తున్నారు కొందరు... కర్నూలుకు చెందిన పొట్లూరి రవి, ఎన్నారై ఫౌండేషన్‌ ద్వారా 200 మంది నిరుపేద విద్యార్థులకు రూ.40 లక్షల ఉపకార వేతనాలు, ల్యాప్‌టాప్‌లు అందించారు. ఓర్వకల్లు పొదుపు సంఘం నిర్వహిస్తున్న పాఠశాలకు రూ.20 లక్షలు అందించారు. అమెరికాలో ఉంటున్న శృంగవరపు నిరంజన్‌కుమార్‌ తన సొంత గ్రామమై శిరివెళ్ల మండలం రాజనగరంలో పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు.


ప్రశాంతతకు చిరునామాగా నిలుద్దాం

సమాజంలో కులమతాలకు అతీతంగా అందరినీ సోదర సమానంగా చూస్తానని.. తోటివారితో కలిసిమెలిసి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మనస్పర్థలు పెరిగాయి.. కక్షలు కత్తి దూస్తున్నాయి. సొంత అన్నదమ్ముల మధ్యే భూతగాదాలు, ఆస్తి గొడవలతో ఘర్షణలకు, హత్యలకు పాల్పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు, ఆకృత్యాలు ఎక్కువయ్యాయి. ఉమ్మడి జిల్లాలో గతేడాది 66 మందిపై అత్యాచారాలు, 77 మంది మహిళల అపహరణలు చోటుచేసుకోగా వేధింపుల కేసులు 612 వరకు నమోదయ్యాయి. వీటికి అడ్డుకట్ట వేస్తే దేశం ప్రశాంతతకు చిరునామాగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.


నవభారతాన్ని లిఖిద్దాం

దేశాన్ని ప్రేమించడమే కాదు, దేశ రక్షణలో ముందుంటామంటున్నారు కొందరు యువకులు. మద్దికెర మండలం ఎం.అగ్రహారంలో సుమారు 200 మంది వరకు దేశ రక్షణలో పని చేస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి అమరలైన వారూ జిల్లాలో ఉన్నారు.  కొందరు యువకులు మద్యం, మత్తుకు బానిసలై నేరాలకు పాల్పడుతున్నారు. నైజీరియన్లతో చేతులు కలిపి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. గతేడాది ముగ్గురు నైజీరియన్లతోపాటు, మణిపూర్‌కు చెందిన ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు.  క్రికెట్‌ బెట్టింగ్‌లతో పెడదారిపడుతున్నారు. వనరులు సద్వినియోగం చేసుకొంటూ  ‘నవ’భారతాన్ని నిర్మిద్దాం


వారసత్వ  సంపదను కాపాడుకుందాం

సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అంటూ ప్రతిజ్ఞ చేస్తున్నాం.. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. చారిత్రక కట్టడాలు పది కాలాలపాటు కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. వారసత్వ సంపదలే మన జవసత్వాలు అనే నిజాన్ని గుర్తించాలి. వీటిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ చొరవ చూపాల్సి ఉంది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని బెలూం గుహలు, కర్నూలు కొండారెడ్డి బురుజు, కేతవరం గుహలు, జొన్నగిరి అశోకుడి శిలా శాసనాలు, రాతివనాలు ఇలా వీటిని పరిరక్షించడంలో నిర్లక్ష్యం వెంటాడుతోంది. సందర్శకులతో ఆదాయ ఆర్జన చూస్తున్నారే తప్ప పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. యాగంటి, శ్రీశైలం, అహోబిలం, మహానంది వంటి పుణ్యక్షేత్రాలు గర్వకారణంగా నిలుస్తున్నాయి. గుప్త నిధుల కోసం పురాతన ఆలయాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారు.


గౌరవం పెంచుదాం

నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలందరినీ గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాం.. కానీ కొందరు తల్లిదండ్రులను గౌరవించడం మరిచారు. కష్టపడి చదివించి ఉన్నత స్థితికి చేర్చిన కన్నవారికి కడుపు నింపడమే కష్టంగా భావిస్తున్నారు. విధి లేక వృద్ధులు ఆశ్రమాల బాట పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 67 వృద్ధాశ్రమాలు, నాలుగు నిరాశ్రయ ఆశ్రమాలు ఉన్నాయి. కన్నబిడ్డల ప్రేమకు నోచుకోని సుమారు 3-4 వేల మంది ఆయా ఆశ్రమాల్లో దినదిన గండంలా గడుపుతున్నారు. విద్యాబుద్ధులు బోధించే గురువులపైనా కొందరు కోపం పెంచుకుని దాడులకు పాల్పడుతున్న యువత లేకపోలేదు. ఉమ్మడి జిల్లాలో తల్లిదండ్రులు, పెద్దలను అవమానించిన కేసులు గతేడాది 431 వరకు నమోదయ్యాయి. పెద్దలను గౌరవించడం చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాల్సినవసరం ఉంది.


మంటగలుస్తున్న  మర్యాద

ఎదుటి వారితో మర్యాదపూర్వకంగా ఉండటం ‘మాట’ తప్పుతోంది. ఆదర్శంగా ఉండాల్సిన నేతలు బహిరంగ సమావేశాల్లో మాటల యుద్ధం చేస్తూ దుర్భాషలాడుతున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన ఠాణాల్లో బాధితుల పట్ల పోలీసులు అమర్యాదగా మాట్లాడుతున్నారు. ఇలా మితిమీరిన ప్రవర్తనతో పలువురు సస్పెన్షన్‌ వేటుకు గురైన ఘటనలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. నాలుగో స్తంభంగా పేర్కొన మీడియా స్వేచ్ఛను బాహాటంగానే హరించేస్తున్నారు. దీనికి తార్కాణమే ఓ వార్తపై ప్రజాప్రతినిధి ‘మీడియా వీపులు పగలగొడతాం’ అంటూ హెచ్చరించడమే. ఆదర్శంగా ఉండాల్సిన వారే ఈ తరహా మాట్లాడుతుండటంతో యువత పక్కవారితో మర్యాదగా నడుచుకోవడం మరిచారు.


సేవానిరతికి జనహారతి పడదాం

తోటి వ్యక్తి కళ్లముందు ఆపదలో ఉన్నా స్పందించే తీరు కరవైంది. దీనికి తార్కాణమే ఈ నెల 7న నంద్యాలలో ఓ కానిస్టేబుల్‌ను రాత్రి 9 గంటల సమయంలో కొందరు బీరు సీసాలతో కొట్టి, కత్తులతో వెంబడిస్తే అడ్డుకోకపోగా, కనీసం 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఫలితంగా నిండు ప్రాణం బలైంది. ఇలాంటి వాటికి ఇకనైనా అడ్డుకట్ట వేద్దాం. కర్నూలు ఉమ్మడి జిల్లాలో పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రత్యేకత చాటుతున్నాయి. కొందరు యువత ఒక్కటై అనాథ శవాలకు దహన సంస్కారాలు చేయడం, మతిస్థితిమితం లేని వారిని అక్కున చేర్చుకుని బాగోగులు చూస్తున్నారు. మరికొందరు ఆహారాన్ని అందిస్తున్నారు. జంతు ప్రేమికులు సైతం గాయపడిన జంతువులను ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సేవా నిరతి అలవర్చుకుంటే అద్భుతమైన సమాజం ఆవిష్కరించొచ్చు.

ఆళ్లగడ్డ పట్టణంలో..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని