logo

యువ దళం.. సేవే బలం

విద్యార్థి దశలో నాయకత్వ లక్షణాలు.. దేశభక్తి పెంపొందించడంలో ఎన్‌సీసీ పాత్ర కీలకం. వారికి సైనిక శిక్షణ ఇవ్వడమే కాదు.. సామాజిక కార్యక్రమాల్లో ముందుండి నడిపించేలా తర్ఫీదు ఇస్తున్నారు.

Published : 27 Nov 2022 02:34 IST

నేడు ఎన్‌సీసీ దినోత్సవం

సామాజిక కార్యక్రమాల్లో ఎన్‌సీసీ విద్యార్థులు

విద్యార్థి దశలో నాయకత్వ లక్షణాలు.. దేశభక్తి పెంపొందించడంలో ఎన్‌సీసీ పాత్ర కీలకం. వారికి సైనిక శిక్షణ ఇవ్వడమే కాదు.. సామాజిక కార్యక్రమాల్లో ముందుండి నడిపించేలా తర్ఫీదు ఇస్తున్నారు. పలువురు విద్యార్థులు దిల్లీ స్థాయిలో రాణించి ప్రశంసలు అందుకున్నారు. ఎన్‌సీసీలో చేరేందుకు విద్యార్థులు పెద్దఎత్తున మొగ్గు చూపుతున్నారు. ఆదివారం ఎన్‌సీసీ దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

కర్నూలు, అనంతపురం జిల్లాలకు కలిపి కర్నూలు కేంద్రంగా 2022లో ఎన్‌సీసీ కర్నూలు గ్రూప్‌ ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల్లో 113 కళాశాలల్లో 4,350 మంది బాలురు, 5,950 మంది మహిళలు ఎన్‌సీసీలో శిక్షణ పొందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పాఠశాలల స్థాయిలో.. 50 బడుల్లో 9 వేల మంది బాలబాలికలు ఎన్‌సీసీలో ఉన్నారు. పాఠశాల స్థాయిలో రెండేళ్లపాటు శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ‘ఎ’ సర్టిఫికెట్‌ ఇస్తారు. కీలకమైన ఆర్డీసీ, తల్‌సైనిక్‌ శిబిరాల్లో పాల్గొన్న ఎన్‌సీసీ విద్యార్థులకు గ్రేడింగ్‌ సైతం ఇస్తారు.

దేశభక్తి పెంపొందించేలా..

దేశవ్యాప్తంగా ఏటా ప్రతి గ్రూపు నుంచి సుమారు 24 శిబిరాలు నిర్వహిస్తారు. దీనికి ప్రత్యేకంగా నిధులు సైతం కేటాయిస్తారు. సైనికులకు ఇచ్చే శిక్షణ ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా ప్రతి ఎన్‌సీసీ దినోత్సవం రోజున శ్రమదానం, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు.

* కరోనా ప్రభావంతో గత రెండేళ్లపాటు ప్రత్యేక శిబిరాలు జరపలేదు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఈ ఏడాది కర్నూలు నుంచి ముగ్గురు విద్యార్థులు దిల్లీలో జరిగిన తల్‌సైనిక్‌ శిబిరంలో పాల్గొని వచ్చారు. కర్నూలు గ్రూప్‌ నుంచి ఆర్డీసీ కోసం ప్రీఆర్డీసీ శిబిరంలో గ్రూపు నుంచి ఐదుగురు సికింద్రాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పలు కళాశాలల్లో ఎన్‌సీసీ ఎంపికలు జరుగుతున్నాయి.


దేశ సేవ చేసేందుకు..

ఈ చిత్రంలోని విద్యార్థి పేరు సాయికుమార్‌స్వామి. కర్నూలు మండలానికి చెందిన ఇతను తొమ్మిదో తరగతి చదువుతున్నారు. అతని తల్లిదండ్రులు హైమావతి, నారాయణ. ఇతను ఈ ఏడాది అనంతపురంలో జరిగిన పలు శిబిరాల్లో ఫైరింగ్‌లో విభాగంలో పాల్గొని సత్తా చట్టారు.. దిల్లీలో ఇటీవల జరిగిన తల్‌సైనిక్‌ శిబిరానికి హాజరయ్యారు. దేశ సేవ చేసేందుకు ఎన్‌సీసీలో చేరినట్లు సాయికుమార్‌స్వామి పేర్కొన్నారు.


పలు శిబిరాలకు హాజరు

ఈ చిత్రంలోని విద్యార్థి పేరు మహమ్మద్‌ హనీఫ్‌. నగరంలోని ఉస్మానియా కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. ఇతను సైతం ఎన్‌సీసీలో రాణిస్తున్నారు. తల్‌సైనిక్‌ శిబిరంలో పాల్గొని అధికారుల మన్ననలు పొందారు. అనంతపురం, సికింద్రాబాద్‌లో జరిగిన సీఏటీసీ శిబిరాల్లో పాల్గొని ప్రతిభ చూపారు. ఎన్‌సీసీ.. సి.. సర్టిఫికెట్‌ పొంది రక్షణ రంగంలో ఉద్యోగం సాధించడమే లక్ష్యమని మహమ్మద్‌ హనీఫ్‌ తెలిపారు.


ఎన్నో అవకాశాలు - సునీల్‌కన్నా,

ఎన్‌సీసీ అధికారి, సిల్వర్‌ జూబ్లీ కళాశాల

విద్యార్థి దశలోనే దేశభక్తి పెంపొందించడమే లక్ష్యంగా ఎన్‌సీసీ ఏర్పాటైంది. పాఠశాల, కళాశాల స్థాయిలో సుమారు 20 వేల మంది శిక్షణ పొందుతున్నారు. శిక్షణ పూర్తి చేసుకుంటే పాఠశాల స్థాయిలో ‘ఎ’ సర్టిఫికెట్‌ ఇస్తారు. ఇది ఉన్నత విద్యలో ఎంతగానో ఉపయోగపడుతుంది. కళాశాలస్థాయిలో పూర్తి చేసుకున్నవారికి సి పత్రం అందుతుంది. దీనిని పొందినవారికి ఉన్నత విద్య, ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని