logo

కళాశాల వేదిక.. స్వర్ణోత్సవ వేడుక

చదువే ప్రగతికి మూలమని గ్రహించారు ఆ విద్యార్థులు. తమ భవితకు పునాదులు వేసి సమాజంలో తమకు గుర్తింపు తెచ్చిన తమ చదువుల తల్లి ఒడికి 50 ఏళ్లు నిండిన సందర్భంగా ఈ నెల 11న స్వర్ణోత్సవ సంబరాలకు పూర్వ విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు.

Published : 09 Dec 2022 03:44 IST

11న పత్తికొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఉత్సవం
న్యూస్‌టుడే, పత్తికొండ, పత్తికొండ పట్టణం

పూర్వ విద్యార్థుల సౌజన్యంతో నిర్మించిన కళావేదిక

చదువే ప్రగతికి మూలమని గ్రహించారు ఆ విద్యార్థులు. తమ భవితకు పునాదులు వేసి సమాజంలో తమకు గుర్తింపు తెచ్చిన తమ చదువుల తల్లి ఒడికి 50 ఏళ్లు నిండిన సందర్భంగా ఈ నెల 11న స్వర్ణోత్సవ సంబరాలకు పూర్వ విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు. పత్తికొండలో ఏళ్లకు పూర్వమే జూనియర్‌ కళాశాల ఏర్పాటైంది. ఇందులో చదువుకుని ఎంతో మంది తమ భవితకు బంగారు బాట వేసుకున్నారు. వారంతా ఒక్కతాటిపై నిలిచి కళాశాలకు ఉత్సవ కళ తీసుకొచ్చారు.

అలా మొదలైంది..

పత్తికొండలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు ఒక వైపు ప్రభుత్వం అంగీకరిస్తూనే మరోవైపు స్థలం చూపించాలన్న నిబంధన విధించింది. దీంతో ఉన్నత పాఠశాలలో కొన్ని గదులను జూనియర్‌ కళాశాలకు కేటాయించారు. 1971లో ఇటు జూనియర్‌ కళాశాల, అటు హైస్కూలు ఒకే ఆవరణలో నిర్వహణకు కమిటీ శ్రీకారం చుట్టింది. హైస్కూలు స్థాయితో పాటు విద్యార్థులు పెరగడంతో కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత జూనియర్‌ కళాశాల కమిటీపై పడింది. విరాళాల వసూలుకు ముందడుగు వేశారు. ఈ దశలో జూనియర్‌ కళాశాలలో, ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య వెయ్యికి మించి ఉన్న హైస్కూళ్లను దశల వారీగా విడదీసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పత్తికొండ, నందికొట్కూరు, ఆళ్లగడ్డల్లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి ఉన్నత పాఠశాలలను వేరు చేయాలనే ఉత్తర్వులు జారీ ఆయ్యాయి. దీంతో 1971 నుంచి 98 వరకు హైస్కూలు ఆవరణలోనే కొనసాగిన జూనియర్‌ కళాశాల విడిపోయింది. 1998 నుంచి పాత భవనాల్లోనే కొనసాగుతూ వస్తున్న పత్తికొండ జూనియర్‌ కళాశాలకు 2014లో ప్రముఖ ఆర్డీటీ సంస్థ రూ.1.80 కోట్లతో ఫాదర్‌ ఫెర్రర్‌ పేరుతో కొత్త భవనాలు నిర్మించారు.

విప్లవాత్మక మార్పుల దిశగా..

1971 నుంచి నేటి వరకు ఈ కళాశాలకు ప్రిన్సిపాళ్లుగా 20 మంది పనిచేశారు. 2015 నుంచి ఇప్పటి వరకు జమీర్‌పాషా కొనసాగుతున్నారు. తొలి ప్రిన్సిపల్‌గా 1971-72లో లక్ష్మణ్‌, 1972-76 వరకు సి.లక్ష్మణ్‌రావులు కాగా, 2009-2015వరకు పనిచేసిన కోతిరాళ్ల శ్రీనివాసులు హయాంలో ఈ కళాశాలలో విప్లవాత్మక మార్పులు సంతరించుకున్నాయి. కళాశాలకు కొత్త భవనాల కోసం ప్రముఖ ఆర్డీడీ సంస్థతో సంప్రదింపులు చేయడంతో కొత్త భవనాలు సమకూరాయి. దాతల సాయంతో కొత్తరూపు సంతరించుకుంది.

మాట్లాడుతున్న ఉత్సవాల నిర్వహణ కోర్‌ కమిటీ సభ్యుడు సురేశ్‌కుమార్‌

అభివృద్ధితో పాటు ప్రత్యేకంగా..

* ఏకరూప దుస్తులు (యూనిఫాం) ఉండే ప్రభుత్వ కళాశాలలు సామాన్యంగా ఉండవు ఇక్కడ విద్యార్థిని, విద్యార్థులు శనివారం మినహా అన్ని రోజుల్లో ఏకరూప దుస్తుల్లో రావాల్సిందే.
* ఈ కళాశాలకు ప్రభుత్వం ఇద్దరు బోధకులతో కంప్యూటర్‌ విద్య మంజూరుతోనే సరిపుచ్చుకుంది. కంప్యూటర్లు ఇవ్వలేదు. దీంతో పూర్వ విద్యార్థి వై.కల్యాణ్‌ (సాధన మైక్రో ఫైనాన్స్‌)ను సాయం కోరారు. ఆయన 8 కంప్యూటర్లు ఇవ్వగా కోర్సు మొదలైంది.
* సభలు, సమావేశాల నిర్వహణకు ప్రత్యేకంగా వేదిక ఏర్పాటుకు పూర్వ విద్యార్థులను సంప్రదించారు. వారి సాయంతో సుమారు రూ.2 లక్షల అంచనా వ్యయంతో కళావేదిక ఏర్పాటు చేశారు.
* ఉత్తీర్ణత 15 నుంచి 86 శాతం పెరిగింది. విద్యార్థుల సంఖ్య 300 నుంచి 1200కు చేరింది.
* పత్తికొండలో వృత్తి విద్యాకోర్సులున్నా ప్రయోగాత్మకంగా నేర్చుకునేందుకు ఎలాంటి బోధనోపకరణాలు, సామగ్రి లేదు. పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసకెళ్లడంతో జిల్లాలోని కళాశాలల్లో వృత్తి విద్యాకోర్సులకు నిధుల మంజూరులో పత్తికొండ కళాశాలకు ప్రాధాన్యం లభించింది. పత్తికొండ మినహా మిగిలిన కళాశాలలకు రూ.10 లక్షలు మాత్రమే మంజూరు కాగా పత్తికొండ కళాశాలకు రూ.12 లక్షలు కేటాయించారు.

జయప్రదం చేయండి..

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పత్తికొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 50 వసంతాల ఉత్సవాల సందర్భంగా ఈ నెల 11న నిర్వహించే వేడుకలకు పూర్వ విద్యార్థులు తరలి రావాలని ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు సురేశ్‌కుమార్‌, రామ్మోహన్‌, వీరేశ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. కళాశాల ప్రారంభం నుంచీ ఇప్పటి వరకు చదువుతున్న సుమారు 50 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు పాల్గొంటున్న వేళ పెద్దఎత్తున సంబరాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారు దశాబ్దాల తర్వాత స్నేహితులను, సహాధ్యాయులను, గురువులను కలుసుకొనేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నట్లు వారు తెలిపారు. వేదిక, భోజన వసతి, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. కమిటీ సభ్యులు రాజేశ్‌, ప్రసాద్‌, సాయిబాబా, కళాశాల ప్రిన్సిపల్‌ రామలింగం, గోవిందరాజులు, అంజనేయులు తదితరులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

దాతల చేయూతతోనే.. : - శ్రీనివాసులు, విశ్రాంత ప్రిన్సిపల్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల సంఘం అధ్యక్ష హోదాలో కళాశాలల పరిస్థితిని పరిశీలించా. 2009లో పత్తికొండ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టా. దాతలను ఆశ్రయించి పరిస్థితి వివరిస్తూ వారిని చైతన్యవంతులను చేశాం. వారి సాయంతో అభివృద్ధికి మార్గం సుగమం అయింది. ఈ ఖ్యాతి అంతా దాతలదే. పూర్వ విద్యార్థులతో పాటు, దాతలు కళాశాల అభివృద్ధిలో మమేకమయ్యారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని