logo

యువత చేతుల్లోనే.. దేశ భవిష్యత్తు

యువత చేతుల్లో దేశ భవిష్యత్తు ఉందని.. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు కోరారు.

Published : 26 Jan 2023 01:49 IST

ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌ కోటేశ్వరరావు, జేసీ రామ్‌సుందర్‌రెడ్డి, డీఆర్వో నాగేశ్వరరావు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: యువత చేతుల్లో దేశ భవిష్యత్తు ఉందని.. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు కోరారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని యువత ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారం వారికే ఉందన్నారు. మన భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకులను ఎన్నుకోవాలన్నారు. జేసీ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి మాట్లాడుతూ ఏడాదిలో నాలుగు సార్లు ఓటరుగా నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. డీఆర్వో నాగేశ్వరరావు మాట్లాడుతూ యువత ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. నూతనంగా నమోదు చేసుకున్న యువ ఓటర్ల అభిప్రాయాలను కలెక్టర్‌ తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీవో హరిప్రసాద్‌ అందరి చేత ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఎనిమిది మంది యువ ఓటర్లు, ఆరుగురు వృద్ధ ఓటర్లు, ఏడుగురు విభిన్న ప్రతిభావంతులను సన్మానించారు. ఓటరు దినోత్సవ కార్యక్రమంపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి జ్ఞాపికలు అందించారు. ఉత్తమ సేవలు కనబరిచిన జేసీ రామ్‌సుందర్‌రెడ్డి, డీఆర్వో నాగేశ్వరరావు, ఆర్డీవో హరిప్రసాద్‌, కర్నూలు అర్బన్‌, కల్లూరు తహసీల్దార్లు విజయశ్రీ, టి.వి.రమేష్‌బాబును కలెక్టర్‌ సన్మానించారు. అనంతరం కలెక్టర్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాసర రెడ్డి, సెట్కూరు సీఈవో పి.వి.రమణ, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ విజయ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని