logo

ఆదాయ వేలం.. అధికార పంతం

వారం రోజుల్లో 2022-23 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో మార్కెట్‌ వేలం పాటలకు పీటముడి పడింది.

Published : 25 Mar 2023 01:47 IST

వాయిదా వేస్తున్న అధికారులు
వారం రోజుల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం

ఆదోని పట్టణంలో కూరగాయల మార్కెట్‌

న్యూస్‌టుడే, ఆదోని పురపాలకం: వారం రోజుల్లో 2022-23 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో మార్కెట్‌ వేలం పాటలకు పీటముడి పడింది. అధికార పార్టీ నేతల జోక్యంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేలాలు పూర్తి చేసి గుత్తేదారులకు అప్పగించాల్సి ఉంది.  వేలాల నిర్వహణను పలు పురపాలక సంఘాలు నేటికీ పూర్తిచేయలేదు. పలుచోట్ల ఒప్పందాలు కుదరకపోవడం పాతవారికే కట్టబెట్టాలన్న నేతల పన్నాగంతో ముందుకు సాగడం లేదు.

పుర సంఘాలకు వనరులు

పురపాలక సంఘాలకు మార్కెట్లు, గేట్‌ వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయమే కీలకం. వచ్చిన నిధులతో వార్డుల్లో అభివృద్ధి పనులు చేసుకోవడం, పాలనా పరమైన ఖర్చులు చేసుకొనేందుకు వెసులుబాటు ఉంటుంది. ఏటా ఆర్థిక ఏడాది చివరి నెల లోపు వేలాల ప్రక్రియ పూర్తి చేసి ధరలు నిర్ణయించాలి. అధికారుల నాన్చుడు ధోరణి గుత్తేదారుల ములాఖత్‌కు అవకాశమిచ్చినట్లవుతోంది. ఆలస్యం కావడంతో పోటీ లేక సాధారణ ధరలకే మార్కెట్లు దక్కించుకుని నిర్వహణదారులు లాభపడుతున్నారు.

లారీలకు మినహాయింపు ఉన్నా

లారీల నుంచి వసూలు చేయాల్సిన కిస్తు.. సరకు తెప్పించుకున్న దుకాణదారుడి నుంచి వసూలు చేసుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది. ఇదే విషయంపై ఆదోనిలో ఇటీవల లారీడ్రైవర్‌, గుత్తేదారుడి అనుచరుడి మధ్య మాటామాట పెరిగింది. గుత్తేదారు అనుచరుడు లారీ డ్రైవర్‌ను పాదరక్షతో కొట్టడం వివాదాస్పదమైంది. లారీడ్రైవర్లు ఆందోళన బాటపట్టి కేసు నమోదు చేయించారు. అప్పటి నుంచి లారీ డ్రైవర్లు తీర్పు పత్రాలు చూపుతూ చెల్లించడం లేదు. గుత్తేదారులకు వచ్చే మొత్తం ఆదాయంలో ఇదే 30-40 శాతం ఉండటం గమనార్హం.  

* నంద్యాలలో మార్కెట్‌వేలాలతో పాటు దుకాణాల వేలాలు నిర్వహించాల్సి ఉన్నా నేటికీ పూర్తిచేయలేదు. ఆత్మకూరు పట్టణంలో రోజువారీ మార్కెట్‌, బస్టాండు, కబేలా, మాంసం దుకాణాల ద్వారా సుమారు రూ.30 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఓ సారి వేలం నిర్వహించి వాయిదా వేశారు. ఆళ్లగడ్డలో సంతమార్కెట్‌, దినసరి మార్కెట్‌, కబేలా వాహనాల గేట్‌ ఏడాదికి రూ.20 లక్షల ఆదాయం వస్తోంది. ఇక్కడా ఓ గుత్తేదారు ధరావతు చెల్లించలేదని వేలాలు వాయిదా వేశారు.

అర్ధాంతరంగా ముగిస్తున్నారు

* ఆదోనిలో జేఎల్‌బీ మార్కెట్‌, పశువులు, గొర్రెల సంత మార్కెట్లున్నాయి. వీటి ద్వారా ఏటా రూ.కోటి ఆదాయం వస్తుంది. గుత్తేదారులు రాలేదని మొదటిసారి, అధికారులు లేరని రెండో సారి , ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉందని మరోసారి, ధరలు తగ్గించాలని గుత్తేదారులు కోరడం ఇంకోసారి .. ఇలా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా 25వ తేదీన వేలం నిర్వహణకు ప్రకటన జారీ చేశారు.

అధిక ధరలు వసూళ్లు

పురమార్కెట్‌ గేట్‌ వసూళ్లను గుత్తేదారులు నిర్ణీత ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు.. రహదారిపై నిలిపి ఉండే బండికి రూ.10 తీసుకోవాలి కానీ రూ.20-30 వసూలు చేస్తున్నారు లారీలకు రూ.300-500, కూరగాయల మార్కెట్లో గంపకు రూ.1-2 తీసుకోవాల్సిన చోట రూ.5-10, వాహనాల పార్కింగ్‌ దగ్గర రూ.10 ఇలా ఇష్టారీతిగా వసూలు చేస్తున్నారు. వారికి నాయకుల అండదండలుండటంతో ఎవరూ పట్టించుకోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని