logo

ఠాణాలో రూ.75 లక్షల సొత్తు మాయం

కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో రూ.75 లక్షల సొత్త్తు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసి సంచలనంగా మారింది.

Published : 30 Mar 2023 02:43 IST

కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో రూ.75 లక్షల సొత్త్తు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసి సంచలనంగా మారింది. 2021 జనవరి 28 రాత్రి కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద సెబ్‌ సీఐ లక్ష్మీదుర్గయ్య వాహనాలు తనిఖీ చేపట్టారు. హైదరాబాద్‌ వైపు నుంచి వస్తున్న తమిళనాడు రిజిస్ట్రేషన్‌ కారును ఆపి తనిఖీ చేయగా శాతనభారతి, మణికందన్‌(తమిళనాడు) అనే ఇద్దరు వ్యాపారుల వద్ద 105 కిలోల వెండి ఆభరణాలు, రూ.2.05 లక్షల నగదును గుర్తించారు. వీటికి ఎలాంటి ఆధారపత్రాలు లేకపోవటంతో తనిఖీ అధికారులు సొత్తును సీజ్‌ చేసి అప్పటి కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌ సీఐ విక్రమ్‌సింహాకు అప్పగించారు. వాణిజ్యపన్నులశాఖకుగాని ఆదాయపన్నులశాఖకు అప్పగించలేదు. పోలీసుఅధికారులు సదరు సొత్తును పోలీసుస్టేషన్‌లోని బీరువాలో ఉంచారు. ఓ మహిళా కానిస్టేబుల్‌కు పర్యవేక్షణా బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. తర్వాత సీఐ విక్రమ్‌సింహా బదిలీ అయిన తర్వాత సీఐ కంబగిరి రాముడు కొంతకాలం పనిచేసి అవినీతి ఆరోపణలతో సస్పెండ్‌ అయ్యారు. ఆతర్వాత 2022 మార్చి నెలలో సీఐ శేషయ్య సదరు స్టేషన్‌ సీఐగా బాధ్యతలు చేపట్టారు. 2022 నవంబరులో సీఐ శేషయ్య బదిలీ కాగా సీఐ రామలింగయ్య వచ్చారు. అప్పటి వరకు వెండికి సంబంధించిన వ్యాపారులు స్టేషన్‌కు రాలేదు. ఈనెల 27వ తేదీన వెండి యజమానులైన వ్యాపారులుశాతనభారతి, మణికందన్‌ న్యాయస్థానం నుంచి అనుమతి పొంది కర్నూలు తాలుకా అర్బన్‌ స్టేషన్‌కు వచ్చి సొత్తు అప్పగించమని అడిగారు. సీఐ రామలింగయ్య బీరువా తెరిచి చూసి కంగుతిన్నారు. అసలు బీరువాలో 105 కిలోల వెండిగానీ, డబ్బుగానీ లేకపోవటంతో నిర్ఘాంతపోయారు. 

ఇంటి దొంగలు ఎవరు..: తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌ 105 కిలోల వెండిని తస్కరించిన ఇంటి దొంగలు ఎవరన్నది మిస్టరీగా మారింది. 2021 నుంచి సీఐ విక్రమ్‌సింహాతో సహా ముగ్గురు సీఐలు బదిలీ అయి ప్రస్తుతం నాలుగో సీఐగా రామలింగయ్య పనిచేస్తున్నారు. అధికారులతోపాటు సిబ్బంది  పలువురు బదిలీ అయ్యారు. ఏ సీఐ హయాంలో వెండి అపహరణకు గురైందనేది అంతుచిక్కకుండా ఉంది. ఉన్నతాధికారులు నలుగురు సీఐలందరినీ విచారించినట్లు తెలిసింది. గతంలో మద్యం సీసాలు తస్కరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న హెడ్‌కానిస్టేబుల్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెండి అమ్ముకుని సొమ్ము చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దొంగలను పట్టుకుంటారా లేక కేసు ఏ విధంగా చేధిస్తారన్నది ఉత్కంఠగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని