logo

దుంగల దొంగలు

నంద్యాల జిల్లా పరిధిలో ఎర్రచందనం దొంగలు రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా నరికేస్తూ తరలిస్తున్నారు. ఇప్పటికే రుద్రవరం పరిధిలోని నల్లమల అటవీ రేంజ్‌ పరిధిలో ఎర్రచందనం దాదాపు అంతర్థానమైంది.

Published : 31 May 2023 03:39 IST

నల్లమలలో తమిళ కూలీల హల్‌చల్‌
మాయమవుతున్న విలువైన సంపద

ఇటీవల కూలీలను పట్టుకున్న అటవీ అధికారులు

ఆళ్లగడ్డ, బనగానపల్లి, న్యూస్‌టుడే : నంద్యాల జిల్లా పరిధిలో ఎర్రచందనం దొంగలు రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా నరికేస్తూ తరలిస్తున్నారు. ఇప్పటికే రుద్రవరం పరిధిలోని నల్లమల అటవీ రేంజ్‌ పరిధిలో ఎర్రచందనం దాదాపు అంతర్థానమైంది. ప్రొద్దుటూరు రేంజి పరిధిలోని పోరుమామిళ్ల సరిహద్దులు.. అహోబిలం అటవీ ప్రాంతం సమీపంలో విలువైన సంపద ఉంది. ఇక్కడ ఉన్న ఎర్రచందనంపై స్మగ్లర్ల కన్ను పడింది. స్థానిక కూలీలతో నరికిస్తే బయటకు తెలిసే ప్రమాదం ఉందన్న కారణంగా అంతర్రాష్ట్ర స్మగ్లర్లు.. తమిళ కూలీలను నల్లమలకు తీసుకొచ్చి దుంగలను నరికించడం సర్వసాధారణంగా మారింది. వీటిని డి.వనిపెంట సెక్షన్‌ పరిధిలో చాగలమర్రి మీదుగా జాతీయ రహదారి పైకి చేరుస్తున్నారు. అక్కడినుంచి బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు తరలిస్తుంటారు.

ఆదాయ వనరుగా మార్చుకుని..

సులభంగా డబ్బులు సంపాదించేందుకు పలువురు అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఆళ్లగడ్డ, మరికొన్ని ప్రాంతాలకు చెందిన పలువురు ఇలానే పెద్దఎత్తున సంపాదించారు.  మరికొందరు ఇప్పటికీ ఎర్రచందనాన్నే తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నంద్యాల జిల్లా పరిధిలో ఎర్రచందనం పెద్దగా లేకపోవడంతో పక్క జిల్లాలపై కన్నేశారు. వైఎస్సార్‌ జిల్లా పరిధిలో మైదుకూరు, బద్వేలు అటవీ ప్రాంతాలకు అహోబిలం అటవీ ప్రాంతం నుంచే వెళ్లి ఎర్రచందనాన్ని నరికి సొమ్ము చేసుకుంటున్నారు. ఒకరిద్దరు అటవీ సిబ్బంది స్మగ్లర్లకు అండగా ఉంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అటవీ ప్రాంతంలో ఇతరులకు ప్రవేశం నిషిద్ధమైనప్పటికీ తమిళ కూలీలు పెద్ద సంఖ్యలో యథేచ్ఛగా గొడ్డళ్లతో వెళ్లి ఎర్రచందనం నరికి సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు.

సిబ్బంది అండదండలు

స్మగ్లర్లను అటవీ ప్రాంతంలో సరిహద్దులు దాటించడం వెనుక కొందరు అటవీ సిబ్బంది పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ ప్రాంతంలో ఉన్న చెట్లు నరకకుండా పక్క జిల్లాల్లో సరకు తీసుకెళ్లేలా జాగ్రత్త పడుతున్నారు. వైఎస్సార్‌ జిల్లా సరిహద్దుల్లో నరికిన దుంగలను అహోబిలం పరిధి నుంచి తరలిస్తున్నా.. అవి తమవి కావంటూ నిర్లక్ష్యంగా ఉంటున్నట్లు సమాచారం. 10 రోజుల కిందట జిల్లా సరిహద్దుల్లో ఎర్రచందనం చెట్లు నరుకుతుండగా కొందరు ప్రొటెక్షన్‌ వాచర్లు గమనించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు స్పందించి ఘటనా స్థలికి చేరుకుని తమిళ కూలీలను పట్టుకునేందుకు యత్నించారు. ఒకరు మాత్రమే పట్టుబడగా మరికొందరు తప్పించుకున్నారు. పట్టుబడిన కూలీని విచారించగా మిగిలిన వారి ఆచూకీ తెలిసింది. గత శుక్రవారం మరో 8 మంది తమిళ కూలీలను అరెస్టు చేశారు. గత రెండు మూడేళ్ల కాలంలో 72 మంది నిందితులను పట్టుకుని వారి నుంచి రూ.1.20 కోట్ల విలువైన దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని