logo

తుంగ తాగలేని గంగ

తుంగభద్ర జలాలు గరళంగా మారుతున్నాయి.. 193 పల్లెలు.. 10.74 లక్షల మంది గొంతులు తడుపుతున్న నీరంతా కలుషితమవుతోంది..

Published : 30 Jun 2023 03:27 IST

నదిలోకి నగర వ్యర్థాలు
తీవ్రస్థాయిలో కలుషితం

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: తుంగభద్ర జలాలు గరళంగా మారుతున్నాయి.. 193 పల్లెలు.. 10.74 లక్షల మంది గొంతులు తడుపుతున్న నీరంతా కలుషితమవుతోంది.. ఆ నీటితో కనీసం చేతులు శుభ్రం చేసుకోవడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి.. జల కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరినట్లు కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనాల్లో తేలింది.. నగరంలో మురుగు నేరుగా నదిలోకి వెళ్తోంది.. శుద్ధి కేంద్రాలు నిర్మించాలని కార్పొరేషన్‌ అధికారులకు పలుమార్లు తాఖీదులు జారీ చేసినా స్పందన ఉండటం లేదు.

మురుగులో హామీలు

8 కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కార్పొరేషన్‌కు ఇప్పటికే 20కు పైగా తాఖీదులు జారీ చేశారు. ఇందుకు స్పందించిన కార్పొరేషన్‌ అధికారులు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించి మురుగంతా నాలుగుచోట్ల కలిసేలా చేసి అక్కడ శుద్ది కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.

8 కల్లూరు దేవనగర్‌ వద్ద హంద్రీ వంతెన సమీపంలో 10 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రం పనులు ఏళ్లుగా సాగుతున్నాయి. పాత నగరం జమ్మిచెట్టు వద్ద 2 ఎంఎల్‌డీ సామర్థ్యమున్న శుద్ధి కేంద్రం పనులు ఇలానే ఉండటం గమనార్హం.

రూ.5 కోట్ల జరిమానా

నగరంలోని 52 వార్డుల పరిధిలో 60 ఎంఎల్‌ఎడీ మురుగు ఉత్పత్తి అవుతోంది. మురుగు, వ్యర్థాలు నేరుగా నదిలోకి వెళ్తున్నాయి. కోలి బ్యాక్టీరియా సరాసరిన 600 సీఎఫ్‌యూ/100 ఎంఎల్‌ ఉండాలి. కొన్నిచోట్ల 1,100-1,200 దాటేయడం గమనార్హం. కోలి బ్యాక్టీరియా 50 దాటితే ఆ నీటిని సాధారణ శుద్ధితోపాటు తాగేందుకు వాడాలి. సరిగా శుద్ధి చేయకుంటే విరేచనాలు, టైఫాయిడ్‌, హెపటైటిస్‌ బారిన పడే అవకాశముంది. నది కలుషితంపై 2019 ప్రాంతంలో ఎన్‌జీటీ శేషశయనారెడ్డి కమిటీ ఏర్పాటు చేసింది. కార్పొరేషన్‌ నిర్లక్ష్యాన్ని గుర్తించి 2019లో   రూ.5 కోట్ల వరకు జరిమానా విధించారు.

తీవ్రస్థాయిలో కోలిఫాం

* నగరంలో నిత్యం 60 ఎంఎల్‌డీల మురుగు ఉత్పత్తవుతోంది. అందులో 22.1 ఎంఎల్‌డీలు నదిలో కలుస్తోంది. మురుగంతా నదిలో కలవడంతో కలుషితం పెరుగుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు జారీ చేసింది. నీటి కాలుష్య తీరు తెలుసుకొనేందుకు 11 చోట్ల ఎప్పటికప్పుడు నాణ్యతా పరీక్షలు చేస్తున్నారు.

* నదిలో కలుస్తున్న మురుగు నీటిలో కోలిఫాం తీవ్రస్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా మురుగు నీటిలో 500 ఎంపీఎన్‌/100 మిల్లీలీటర్లు ఉండాలి. నగరంలో ఉత్పత్తవుతున్న మురుగులో కోలిఫాం 2,500పైగా ఉండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. శుద్ధి చేసి సరఫరా చేస్తున్న నీటిలోనూ 500-800 వరకు ఉంటుండటం గమనార్హం. బయో కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ ప్రమాణాల ప్రకారం 30 ఎంజీ/లీటరు నీటిలో ఉండాలి. నదిలో 50-60 మధ్య ఉండటం కలవరపెడుతోంది.

పాత నగరంలో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని