logo

జగన్‌ సాయమెంత కౌలు రైతు కలవరింత

ఈ మహిళ పేరు అయ్యమ్మ. మండల పరిధిలోని హోసూరుకు చెందిన ఈమె భర్త ఉప్పర తిక్కన్న 2022 ఏప్రిల్‌ 18న అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

Published : 20 Apr 2024 05:55 IST

అధ్వానంగా పంట కాల్వలు
భారంగా మారిన సేద్యం
పథకాలు అందక వేదన

వెంటాడిన కష్టనష్టాలు

హోసూరు(పత్తికొండ గ్రామీణం), న్యూస్‌టుడే: ఈ మహిళ పేరు అయ్యమ్మ. మండల పరిధిలోని హోసూరుకు చెందిన ఈమె భర్త ఉప్పర తిక్కన్న 2022 ఏప్రిల్‌ 18న అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. 2022కు ముందు ఉన్న రెండున్నర ఎకరాలతో పాటు ఐదెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేసినా పంటలు పండక తీవ్ర నష్టాల పాలయ్యారు. అప్పులు చెల్లించే మార్గంలేక, పెట్టుబడి కూడా దక్కక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో దిక్కుతోచని స్థితితో పడ్డారు. బ్యాంకులో రూ.50వేలు అప్పు ఉండగా ప్రైవేటు వ్యక్తుల వద్ద  మరో రూ.3.50లక్షలకు పైగా అప్పులు చేశారు. కుటుంబ బాధ్యత రైతు భార్య అయ్యమ్మపై పడింది. పెద్దకుమారుడు ఆటో నడుపుతూ జీవనం సాగిద్దామనకుంటే.. అది కూడా సక్రమంగా నిర్వహించుకోలేని పరిస్థితి నెలకొంది. చిన్నకుమారుడు ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ వచ్చిన దాంతో కుటుంబ జీవనం సాగిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా కరవు పరిస్థితులు నెలకొనటంతో జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయని మృతుని భార్య, కుమారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పెట్టుబడీ దక్కలేదు

- శంకర్‌నాయక్‌, కౌలు రైతు. జేఎం తండా

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: నాకున్న పొలం నాలుగెకరాలతో పాటు మరో నాలుగున్నర పొలాన్ని కౌలుకు తీసుకొని  పత్తి, సజ్జ పంట సాగు చేశా. రూ.లక్షన్నరకు పైగానే పెట్టుబడి పెట్టి సాగుచేసినా వర్షాభావ పరిస్థితుల కారణంగా పెట్టుబడి ఖర్చులూ దక్కలేదు. కూలీలు, పంటకోత, నూర్పిళ్లు తదితర ఖర్చుల కింద అదనంగా ఖర్చు చేసినా ఫలితంలేదు.  తీవ్రంగా నష్టపోయి రూ.4లక్షలకు పైగా అప్పులయ్యాయి. కౌలు కూడా చెల్లించేందుకు ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం అదుకుంటుందనుకుంటే ఇంత వరకు పంట నష్టపరిహారం అందించలేదు. రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.


శ్రమకు ఫలితం లేదు

- కుమారస్వామి, హొళగుంద

హొళగుంద, న్యూస్‌టుడే: నాగరకణ్వి గ్రామంలో 11 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని ఎకారకు రూ.10 వేల చొప్పున కౌలు చెల్లించా. ఎనిమిది ఎకరాల్లో మిరప పంటను వేశా. ఎకరానికి పురుగు మందులు, ఎరువులు, కూలీలు ఖర్చు కలిపి రూ.8లక్షలు అయింది. ఆరు గాలం శ్రమిస్తే రూ.3 లక్షల దిగుబడి వచ్చింది. మూడు ఎకరాల్లో ఉల్లి సాగుచేశా. మూడు ఎకరాలకు మొత్తం రూ.2.50లక్షలు పెట్టుబడి పెట్టా. రూ.50 వేల దిగుబడి వచ్చింది. వడ్డీలు చెల్లించేందుకే సరిపోతోంది. కౌలు రైతు పరంగా నాకు మూడేళైనా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయోజనం జరగలేదు.


ఏడు ఎకరాల్లో సాగు

- రామచంద్రప్ప, కౌలు రైతు, శంకరబండ

ఆస్పరి, న్యూస్‌టుడే: ఏడు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశా. రూ.2లక్షలు ఖర్చు చేశా. మా ఎద్దులును పోషించలేక రూ.లక్ష విలువ చేసే ఎద్దులను రూ.56 వేలకు అమ్మెశా. సరైన వర్షాలు, పంటలు పండక పోవడంతో అప్పులే మిగిలాయి. ప్రభుత్వం కౌలుకు భూములను చేసే రైతులను అదుకోవాలి. పంటలు పండక పోవడంతో తమ కుమారుడు, కోడలు సుమారు మూడు నెలల పాటు వలస వెళ్లి వచ్చారు. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది.


ప్రభుత్వ సాయం అందలేదు

- రామచంద్రుడు, పెనుమాడ (కృష్ణగిరి)

కృష్ణగిరి, న్యూస్‌టుడే: నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నా. ఏటా వానలు కురవక పంటలు పండటం లేదు. నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పతుతున్నా. ఈ ఏడాది మిరప సాగు చేసి గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్ట పోయా. మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. ప్రభుత్వం కౌలు రైతులకు రాయితీ పథకాలు అందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని